నెల్లూరు, జూలై 4: చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను సత్వరం ప్రభుత్వం రద్దు చేయాలంటూ బిజెపి చేనేత సెల్ రాష్ట్ర సంయుక్త కన్వీనర్ కెఎస్ చక్రధారి డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను కొంతమందికి మాత్రమే మాఫీ చేసేందుకు వర్తింపచేయడం తగదన్నారు. అధికశాతం చేనేత కార్మికుల రుణాలు రద్దు కాలేదన్నారు. వడ్డీ లేకుండా చేనేతలకు లక్ష రూపాయలు రుణాలు ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదో బూటకమంటూ విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిపొందేందుకు చేనేత కార్మికులపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా ఖాదీ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ రుణాలు మంజూరు చేయాలన్నారు. బ్యాంకర్లు చేనేతలకు రుణాలివ్వకుండా కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారని విమర్శించారు. చేనేత కార్మికులు వృద్ధాప్య, వితంతు పింఛన్ల కింద ప్రభుత్వం నెలసరి రెండువేల రూపాయల వంతున ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నూలు సబ్సిడీ ధరకే అందజేసేలా చేనేత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అర్హులైన చేనేత కార్మికులకు గుర్తింపుకార్డులు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డిపేట ప్రాంతంలో ఇప్పటికే రెండువందల మందికిపైగా చేనేతలకు గుర్తింపుకార్డులు ఇవ్వలేదన్నారు. అర్హులైన వారికి సహకార సంఘాలతో సంబంధం లేకుండా మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికి గుర్తింపుకార్డులు ఇవ్వాలంటూ కోరారు. రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం 11 రకాల వస్త్రాలు పవర్‌లూమ్ తరఫున తయారు చేస్తున్నారన్నారు. దానివల్ల చేనేత కార్మికులు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోతున్నారని తెలిపారు. జిల్లాకో చేనేత ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. యూపిఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిలో మునిగి తేలుతూ చేనేతల జీవితాలను దుర్భరం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలకుల అసమర్ధ వైఖరితో దేశం అన్ని రంగాల్లో భ్రష్టుపట్టిపోయిందని వాపోయారు. యూపిఏ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి బిజెపి నిరంతర పోరాటం ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ప్రజల్ని చైతన్యపరుస్తుందన్నారు.
విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ
6న విద్యాసంస్థల బంద్
* విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి
నెల్లూరు, జూలై 4: పాఠశాలలు ప్రారంభమై 20రోజులు పూర్తి అయిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బట్టలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న రాష్టవ్య్రాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటి నేతలు తెలిపారు. గురువారం స్థానిక ఆమని గార్డెన్స్‌లోని టిఎన్‌ఎస్‌ఎఫ్, ఏవైవిఎస్, వైఎస్‌ఆర్‌యస్‌యు, పిడిఎస్‌యు నేతలు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాలలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కార్పొరేట్ విద్యాసంస్థల మాఫియాను మరింత ప్రోత్సహిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య యజమానులు సిండికేట్ విద్యా వ్యాపారానికి అడ్డకట్ట వేయడానికి రాష్ట్రంలో పటిష్టమైన ఫీజుల నియంత్రరణకు సమగ్ర చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న లక్ష టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి రాష్ట్రంలో, జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఇఓ, డిప్యూటి డిఇఓ పోస్టులను భర్తీచేసి ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూల్స్ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ఇప్పటికీ భవనాలు పూర్తికాక మొండి గోడలగానే ఉన్నాయని అన్నారు. మోడల్ పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి అందులో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 6వ తేదిన నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి సుధీర్, పి కిరణ్, ఏవైవిఎస్ జిల్లా అధ్యక్షులు డి అంజయ్య, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు బాలిక గూడూరులో ప్రత్యక్షం
గూడూరు, జూలై 4: కర్నూలు పట్టణానికి చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకువచ్చిన ఒక వ్యక్తి ఆ బాలికను వదిలించుకోవటంతో ఎటుపోవాలో తెలియక ఆ మె తిరుపతిలో గూడూరు వైపు వెళ్లే రైలెక్కింది. రైలులో వస్తుండగా కొండాగుంట రైల్వే స్టేషన్ వచ్చేసరికి టిసి తనిఖీల్లో ఆ బాలికను వద్ద టిక్కెట్ లేకపోవడంతో ఆమెను గూడూరులో దించేశారు. ఇది గమనించిన రైల్వే పోలీసులు ఆ బాలికను చేరదీసి వివరాలు సేకరించి, ఈ విషయాన్ని ఐసిడిఎస్ గూడూరు గ్రామీణ సిడిపివోకు సమాచారం అందించారు. ఆమె ఐసిపిఎస్ సుమలతకు విషయం తెలియచేసి ఆమె స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు గార్గేయపురానికి చెందిన రెడ్డిపోగు గౌరి తండ్రి మృతి చెందడంతో తల్లి మరియమ్మ వద్ద ఉంటోంది. తల్లి కూలి పనులకు వెళ్లి కూతురును కొడుకు ఇంటిలో ఉంచి ఇంటర్ చదివిస్తోంది. అయతే వదిన అగౌరవంగా మాట్లాడడంతో భరిస్తూ వచ్చింది. ఈ నెల 1 న గౌరిని ఓ యువకుడు చేరదీసి మాయమాటలు చెప్పి తనతో తిరుపతికి రావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన గౌరి అతనితో తిరుపతికి రాగా, అక్కడ ఆ వ్యక్తిగౌరిని వదిలించుకొనే క్రమంలో గూడూరువైపు వచ్చే రైలులో ఎక్కించేసి తప్పుకున్నాడు. రైలు గూడూరు సమీపంలోకి రాగానే టిసి గౌరిని టికెట్ అడిగేసరికి లేదని సమాధానం చెప్పడంతో గూడూరులో దించేశారు. విషయం తెలుసుకొన్న గూడూరు రైల్వే పోలీసులు ఆమెను చేరదీసి వివరాలు సేకరించి ఈ విషయాన్ని గూడూరు గ్రామీణ సిడిపివో ప్రమీలారాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే ఈ విషయాన్ని ఐసిపిసి అధికారిణి సుమలత దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని గౌరి తల్లి మరియమ్మకు ఫోను ద్వారా తెలియచేయడంతో, మరియమ్మ గురువారం ఉదయం గూడూరుకు చేరుకొంది. ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు ఆర్ సుజన, ఎస్‌కె మెహబూబీ గౌరిని గూడూరు రైల్వే పోలీసుల నుండి స్వాధీనం చేసుకొని గౌరి తల్లి కుటుంబ పరిస్థితిపై వాకబు చేయడంతో తాము కర్నూలు వెళ్లినా తమను ఆదరించేవారు ఎవరు లేరని చెప్పడంతో వారు గౌరి తల్లిని నెల్లూరు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వీసు హోంలో ఆయాగా ఉద్యోగం ఇప్పించి గౌరికి అన్ని ఖర్చులు భరించి ఉచితంగా విద్యనభ్యసించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తాను ఇక్కడే ఉండి ఉన్నత చదువులు చదువుకుంటానని, తన తల్లికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఐసిడిఎస్ అధికారులకు గౌరి కృతజ్ఞతలు తెలిపింది.
అది పోలీసుల పనే
నెల్లూరు రూరల్, జూలై 4: మాజీ మావోయిస్టు నేత, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంటి ప్రసాదంపై హత్యాయత్నం చేసింది పోలీసుశాఖకు సంబంధించిన వారేనని విరసం నేత కల్యాణ్‌రావు ఆరోపించారు. మండల పరిధిలోని నారాయణ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న గంటి ప్రసాదంను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ గంటి ప్రసాదంపై పోలీసులకు మొదటి నుండి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, అందులో భాగంగానే గురువారం పోలీసుశాఖకు చెందిన వారు ముగ్గురు వేట కొడవళ్లతో దాడిచేసి అనంతరం మూడు రౌండ్‌లు కాల్పులు జరిపారని తెలిపారు. మూడు బుల్లెట్లు ప్రసాదం శరీరంలో ఉన్నాయని, అందులో ఒక బుల్లెట్‌ను వైద్యులు తొలిగించారని, మరో బుల్లెట్ వెన్నుముకలో అత్యధిక ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. పరిస్థితి మాత్రం విషమంగా ఉందని, బుల్లెట్లు తీసే వరకు వివరించలేమని వైద్యులు తెలిపారన్నారు. వేటకొడవులతో మెడపై నరకడంతో రక్తస్త్రావం బాగా జరిగిందన్నారు. గతంలో కూడా పోలీసులు విరసం నేతలైన మనె్నం ప్రసాద్, పురుషోత్తంలపై ఇదే స్థాయిలో దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. అందు వలన కచ్చితంగా పోలీసుల పనేనన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ఆశాఖ కేసులు నమోదు చేయడం లేదని, వీరిని ఒక కిరాయి హంతుల గ్రూపుగా తయారుచేసి మాజీ మావోయిస్టులు, నిరసం నేతలపైన, సానుభూతిపరులపైన వీరిని ఉసుకల్పడం పోలీసుశాఖలో పరిపాటిగా మారిపోయిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి మయం: బీద
అనుమసముద్రంపేట, జూలై 4: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో అవినీతి మయంగా తయారైందని టిడిపి కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. గురువారం ఎఎస్ పేట మండలం అసనాపురం గ్రామంలో ఆత్మకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి గూటూరు కన్నబాబు చేసే వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీద మస్తాన్‌రావు పాల్గొన్నారు. కన్నబాబు 450 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని టిడిపి జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర మైలురాయి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బీద మాట్లాడుతూ తల్లి పిల్ల కాంగ్రెస్‌ల వల్ల రాష్ట్రం అస్తవ్యస్తంస్థంగా మారిందన్నారు. జగన్‌ను అవినీతిలో గిన్నిస్‌బుక్‌లో ఎక్కించవచ్చని ఎద్దేవా చేసారు. వైఎస్‌ను ఏవిధంగా స్ఫూర్తిగా తీసుకోవాలో అర్ధం కావటం లేదని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. గత 9 ఏళ్లుగా టిడిపి అధికారంలో లేకపోయినా క్యాడర్‌గల పార్టీని అని, చెక్కు చెదరలేదని తెలిపారు. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల అభివృద్ధి కోసమే టిడిపి పనిచేస్తుందని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల వారిని ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. రాజకీయాల్లో సంపాదించుకునేందుకు రాలేదని, ప్రజాసేవ చేసేందుకే వచ్చినట్టు తెలిపారు. టిడిపిలో పనిచేసే వారికి అవినీతి మచ్చ ఉండదన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని, ఆత్మకూరు నియోజకవర్గంలో కన్నబాబును ఆదరించి గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కన్నబాబు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి నియోజకవర్గంలో 450 కిలోమీటర్ల పాదయాత్ర చేసి గ్రామాల్లోని సమస్యలను తెలుసుకున్నట్టు తెలిపారు. ఉత్తరాఖాండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తాత్కాలికంగా పాదయాత్ర నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా అసనాపురం గ్రామంలో బీద మస్తాన్‌రావు, కన్నబాబును మండల టిడిపి కన్వీనర్ అబ్బూరు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా బిసి నాయకులు సుబ్రహ్మణ్యం, చైజర్ల సంఘం, ఆత్మకూరు మండలాల కన్వీనర్లు రాంబాబు, శ్రీనివాసయాదవ్, చంద్రారెడ్డి, హయ్యద్‌బాషా, గోవిందయ్య, పఠాన్ బషీర్, హజరత్‌రెడ్డి, ఆయాగ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ వర్కర్ల ధర్నా
ఇందుకూరుపేట, జూలై 4: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, నెల్లూరురూరల్ మండలాలకు చెందిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇందుకూరుపేట ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి సిఐటియు మండల అధ్యక్షుడు ఎస్‌కె ఖాదర్‌బాషా మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్ కల్పించాలని, రిటైరైన వెంటనే వర్కర్లకు లక్ష రూపాయలు, హెల్పర్‌కు 50 వేల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని, చివరి జీతంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేసారు. సూపర్‌వైజర్ల వయో పరిమితి 55కు పెంచాలన్నారు. ఐసిడిఎస్‌ను సంస్థాగతం చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలనుస్వచ్చంద, ఇతర సంస్థలకు అప్పగించారాదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాజెక్ట్ పరిధిలోని వర్కర్లు, హెల్పర్లకు, పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఐసిడిఎస్ పరిరక్షణ, అంగన్‌వాడీ హక్కుల సాధనకు జూలై 8, 9, 10 తేదీలలో మూడు రోజుల సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడర్ జి పార్వతీదేవి, అమల, ఎస్‌కె జమీల, డి బుజ్జమ్మ, సుమారు 80 మంది మహిళలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ శీనానాయక్
ఇందుకూరుపేట, జూలై 4: ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఇందుకూరుపేట తహశీల్దార్ శీనానాయక్ తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల గంగపట్నంలో 30 సంవత్సరాల నుండి 65 సెంట్ల భూమి ఆక్రమణలో ఉండటంతో, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. త్వరలో ఆప్రాంతంలోని గిరిజనులకు ఇళ్ల పట్టాల ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. 16 రెవెన్యూ గ్రామాలలో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములు, స్థలాలను ఆక్రమించరాదని అన్నారు. అలా ఎవరైనా ఆక్రమించినట్టు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
అక్రమంగా మట్టి తరలింపు
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
చిల్లకూరు, జూలై 4: మండల కేంద్రమైన చిల్లకూరు జాతీయ రహదారి పక్కనవున్న ప్రభుత్వ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న 10 ట్రాక్టర్లు, రెండు జెసిబిలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తరలిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు డిప్యూటీ తహశీల్దార్ కృష్ణారావు, విఆర్‌ఓ మురళి సంఘటనా స్థలానికి చేరుకొని మట్టి తరలింపు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
చింతవరంలో భారీ బహిరంగసభ
చిల్లకూరు, జూలై 4: మండలంలోని చింతవరం గ్రామంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పనబాక కృష్ణయ్య అధ్యక్షతన భారీబహిరంగసభ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి టిడిపి నాయకుడైన విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది టిడిపి కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పథకాలు, వారు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి భారీ ఎత్తున ప్రసంగించారు. రామిరెడ్డిపాలెం గ్రామం నుండి చింతవరం వరకు రోడ్డుకు ఇరువైపులా కాంగ్రెస్ జెండాలు, పలు నాయకులతో కూడిన ఫ్లెక్సీలను రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసినప్పటికి అధికారులు మిన్నకుండిపోయారు. ఈ విషయంపై పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి: పనబాక
మండల కేంద్రమైన చిల్లకూరులో గురువారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, నేటి నుండి ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నజరానాలో కూడా అన్ని పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. టిడిపి, వైకాపాలకు గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసనాక భాస్కర్‌రెడ్డి, మల్లికార్జునరావు, రవీంద్రరెడ్డి, శ్రీనివాసయాదవ్, జనార్ధన్, డి మధుసూధన్‌రెడ్డి, శారదమ్మ, విజయభాస్కర్‌రెడ్డి, కడివేడు శ్రీనివాసులురెడ్డి, కట్టా రవీంద్రరెడ్డి, బి శ్రీనివాసులురెడ్డి, సిహెచ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో సినిమా షూటింగ్
నెల్లూరు, జూలై 4: చెన్నైకు చెందిన కర్పూరం సినిమా యూనిట్ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన ‘శ్రీనివాస రామానుజన్’ చిత్రానికి సంబంధించిన వివిధ దృశ్యాలను నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో చిత్రీకరించారు. గురువారం నిర్వహించిన ఈ షూటింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని విశ్వవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రామానుజన్ సినిమాలో కలెక్టర్‌గా శరత్‌బాబు నటిస్తున్నారు. అదేవిధంగా అభినయ్ వడ్డీ అనే నూతన నటుడు కూడా ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇతను అలనాటి మహానటి సావిత్రికి మనుమడు కావడం గమనార్హం. సుహాసిని రామానుజన్ తల్లిగా, భామ అనే నటి భార్యగా నటిస్తున్నారు. గణిత మేధావి రామానుజన్ పెరిగిన కుంభకోణంలోనే వివిధ దృశ్యాలు చిత్రీకరిస్తున్నట్లు కూడా నిర్వాహకులు చెపుతున్నారు. ఆయన తెలిపిన వివిధ గణితపరమైన సిద్ధాంతాలను ఈ సినిమాలో ప్రధానంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాటోగ్రఫీని జాతీయ అవార్డు పొందిన కెమెరామెన్ సన్నీజోషఫ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీషులో చిత్రీకరించేందుకు రోక్సానే డీ రోవెన్ అనే మహిళ సహకరిస్తన్నారు.
కృష్ణపట్నం పోర్టు వద్ద ఘర్షణ
పలువురికి గాయాలు
ముత్తుకూరు, జూలై 4: కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక ప్రజలకు జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గురువారం పోర్టు కార్యాలయంలో అధికారులతో మాట్లాడి బైటకు వస్తున్న సందర్భంలో పోర్టు సెక్యూరిటీ సిబ్బంది తమపై దాడి చేశారంటూ కృష్ణపట్నం వాసులు చెప్పారు. అధిక సంఖ్యలో ఉన్న గ్రామస్థులపై సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగడంతో మూకుమ్మడిగా ప్రతిదాడి జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. కృష్ణపట్నం గ్రామానికి తూర్పున బకింగ్‌హాం కెనాల్‌కు అవతల వైపున గాయత్రి పవర్‌టెక్ థర్మల్ విద్యుత్
కేంద్రానికి అవసరమైన కనే్వయర్ బెల్ట్ నిర్మాణం చేపట్టారు. ఇదే ప్రాంతంలో
ఏపి జెన్‌కో ఎన్‌సిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా కనే్వయర్ బెల్ట్‌ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అంతేగాక పోర్టు నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలించేందుకు రోడ్లు నిర్మాణాలకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విస్తరించిన పరిశ్రమలతో దుమ్ము, ధూళి రావడంతో కృష్ణపట్నంకు ఇబ్బంది కలుగుతోంది. ఈ రోడ్ల నిర్మాణాలు పూర్తి అయితే గ్రామంలో జీవన విధానానికి అంతరాయం కలుగుతుందని స్థానికులంతా వాపోతున్నారు. దీంతో గ్రామస్థులు ప్రధానంగా పలు సమస్యలను అధికార్లకు తెలియజేస్తున్నారు. కృష్ణపట్నం గ్రామానికి పర్యావరణం, వాతావరణ కాలుష్యానికి సంబంధించి ప్రజాజీవనానికి ముప్పు ఏర్పడుతుందని భావించారు. గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలనే ప్రధాన డిమాండ్‌గా తెలుపుతున్నారు. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డుల ప్రకారం బియ్యం, తగిన పారితోషికం తరలించే వరకు అందజేయాలని కోరుతున్నారు. కృష్ణపట్నం ప్రాంతంలో అనుభవిస్తున్న భూముల మొత్తానికి నష్టపరిహారం అందజేయాలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుకు స్వాధీనపరచిన భూములకు కూడా పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై తొలుత ర్యాలీగా బయలుదేరిన గ్రామస్థులు కనే్వయర్ బెల్ట్ నిర్మాణ పనులను నిలిపివేశారు. అనంతరం పోర్టుకు తరలివెళ్లారు. పోర్టు అధికార్లతో చర్చలు జరిపి బయటకు వచ్చిన గ్రామస్థులపై అనవసరంగా దాడి చేశారని స్థానికులు చెపుతున్నారు. ఈ సందర్భంలో జరిగిన ప్రతిదాడితో చిన్నా అనే సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్బంధ విద్య నవ్వుల పాలు
కావలి, జూలై 4: ప్రభుత్వం 14 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ విద్య అందించాలన్న సంకల్పంతో నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని రూపకల్పన చేసి అమల్లోకి తెచ్చి మూడేళ్ళు గడుస్తున్నా అమల్లో నవ్వుల పాలవుతోంది. సాక్షాత్తు డివిజన్ యంత్రాంగం అంతా కొలువుతీరి వున్న కావలి పట్టణంలోనే అనేక మంది బాలలు హోటళ్లు, దుకాణాలలో బాలకార్మికులుగా ఉన్నప్పటికీ అధికారులు ప్రేక్షకుల్లా చూస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయ. చేతిలో పుస్తకాలు పెట్టుకొని బడికి వెళ్లాల్సి ఉండగా, మండుటెండలో జీవాలు మేపుకుంటూ పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నారు. కొనదినె్న గిరిజన కాలనీ, పెంకుల ఫ్యాక్టరీ, చెరువుకట్ట సంఘం, బాలకృష్ణారెడ్డినగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో పాఠశాల పూర్వ విద్యాకేంద్రాల్లో నమోదైన చిన్నారులు సైతం వాటికి దూరంగా ఉండగా సంబంధిత సెంటర్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కావలి పట్టణానికి ఆనుకొని వున్న పెద్ద చెరువు కట్ట సంఘం కాలనీ వాసులు నిత్యం చెరువులో వున్న వండ్రుమట్టిని ఇటుక వ్యాపారులు తీసుకువెళ్తున్న క్రమంలో ఆ పనులకు వెళ్తున్న గిరిజన కుటుంబాలు పాఠశాలలకు వెళ్లాల్సిన తమ పిల్లలను వెంట తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పైగా పది పనె్నండు సంవత్సరాలు దాటి కాస్త పనిచేయగలిగిన శక్తి వున్న వారిని తమతోటే పనులకు ఈడ్చుకెళ్తుండగా తప్పనిసరి పరిస్థితుల్లో తట్టబుట్ట పడుతున్నారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగ కొలువుల పరంగా అనేక అవకాశాలు వుండగా, వాటిని సద్వినియోగ పరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అధికారులు తమ బాధ్యతను గుర్తెరిగి చర్యలు తీసుకోవాల్సి వుంది. ఒక్క చెరువుకట్ట సంఘం గిరిజన కాలనీలోనే సుమారు 30నుంచి 40మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా తిరుగుతున్నట్లు అక్కడి గిరిజనులు చెబుతున్నారు. నిర్బంధ విద్యతో సంబంధం ఉన్న విద్యాశాఖ పనుల నుంచి విముక్తి కలిగించి వారి కుటుంబాలకు ఆసరాచూపి పిల్లలను పాఠశాలలకు పంపే క్రమంలో సహాయ పడాల్సిన కార్మిక శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో చిత్తశుద్ధితో పనిచేసి ప్రతి పిల్లవాడిని పాఠశాలలకు పంపాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈవిషయమై ఎంఇఓ సత్యనారాయణను సంప్రదించగా అక్కడక్కడా పిల్లలు పనులకు వెళ్తున్న విషయం తమ దృష్టికి వస్తోందని, ఇప్పటికే పలుమార్లు ఉపాధ్యాయులతో పాటు తాము ఇంటింటికీ వెళ్ళి తిరిగి పాఠశాలలో చేర్చామన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పాఠశాలకు తీసుకొస్తున్నామని వివరించారు. పాఠశాల పూర్వ విద్యా కేంద్రాలకు చిన్నారులను తీసుకొని రావడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విషయం సిడిపివో వద్ద ప్రస్తావించగా తాను ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నానని, లోపాలు వుంటే సరిచేసుకుంటామని, నిర్లక్ష్యం చూపుతున్న విషయం నిజమైతే అంగన్‌వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వివేకానందుడ్ని అందరూ ఆదర్శం తీసుకోవాలి
నెల్లూరు, జూలై 4: వివేకానంద 111వ వర్ధంతి వేడుకను భక్తవత్సలనగర్‌లోని కెఎన్‌ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాలలో చేపట్టారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిరాశ, నిస్పృహల్లో నిర్వీర్యమై పోతున్న యువతకు తన ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలతో చైతన్యపరచి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద అంటూ ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అంటూ మంచి మాటలతో ప్రపంచానే్న జయించవచ్చని వివేకానందుడు తెలిపారన్నారు. తనకు వంద మంది సత్ పౌరుల్ని ఇస్తే ప్రపంచానే్న మార్చివేస్తానన్నారన్నారు. ఆత్మ విశ్వాసమే సాధనకు ఆరంభమని చెప్పారన్నారు. తమ బలమే జీవనం, బలహీనతే మరణమని సూచించారన్నారు. గమ్యం చేరే వరకు విశ్రమించకండని యువతకు స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి అంటూ చెప్పారన్నారు. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన వేదికపై తన అనర్గళ, అద్భుత, ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రపంచ ప్రజలను ఉర్రూతలూగించారన్నారు. ఆయన జీవించినది కేవలం 39 సంవత్సరాలే అయినా కొన్ని యుగాలకు సరిపడే ఆత్మ విశ్వాసాన్ని యువతలో నింపిన మహా యోగి అంటూ కొనియాడారు. గురుశిష్య సంబంధాలకే అసలైన నిర్వచనం, ఆదర్శం రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలేనంటూ పేర్కొన్నారు. ఆయన యువతకు నిత్య స్ఫూర్తి చైతన్య దీప్తి అంటూ కొనియాడారు. అలాంటి మహనీయుల జీవితాలను అందరూ తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడవాలంటూ ఉద్భోదించారు.
మహిళలకు గ్రైండర్లు, కుట్టుమిషన్ల పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జూలై 4: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య మహిళలకు గ్రైండర్లు, కుట్టుమిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నెల్లూరు అర్బన్‌శాఖ అధ్యక్షులు ఎం ద్వారకానాథ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
11వ రోజుకు చేరిన అధ్యాపకుల నిరసన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జూలై 4: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు 11వ రోజుకు చేరుకున్నాయి. గురువారం ఈ సందర్భంగా మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా బిసిఎస్‌ఎఫ్ బంద్
నెల్లూరు, జూలై 4: విద్యాహక్కు చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓబిసి విద్యార్థులకు ప్రైవేట్ సంస్థల్లో పాతిక శాతం ప్రవేశాల్ని ఉచితంగా కల్పించే అంశంలో జరుగుతున్న జాప్యంపై బిసిఎస్‌ఫ్ బంద్ చేపట్టింది. గురువారం నిర్వహించిన బంద్‌లో భాగంగా స్థానిక విద్యాసంస్థలు మూతపడ్డాయి. కార్యక్రమంలో భాగంగా బిసిఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాకృష్ణయాదవ్ మాట్లాడుతూ సంక్షేమ వసతిగృహాల్లో వౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనుమతి లేని ప్రైవేట్ విద్యాసంస్థలను వెంటనే మూతపడేలా చేయాలన్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనా కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బిసిఎస్‌ఎఫ్ నెల్లూరు నగర అధ్యక్షులు కాకు హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వి మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి కన్నా వెంకట్, ఏ వీరరాఘవులు, వెంగయ్య, నాగార్జున, అమరనాథ్, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
నెల్లూరుసిటీ, జూలై 4: కస్తూర్భాగాంధీ గురుకుల బాలికల విద్యాలయాలలో పనిచేయుటకు దరఖాస్తు చేసుకున్న వివిధ సబ్జెక్టుల అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్‌లను మూలాపేటలోని సిఎఎం ఉన్నత పాఠశాల లో శుక్రవారం సాయంత్రం 5గంటల లోపు తీసుకోవాలని రాజీవ్ విద్యామిషన్ పిడి డాక్టర్ పి కోదండరామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ వెంట 2 పాస్ పోర్టు సైజు ఫోటోలను తీసుకుని రావాలని కోరారు.
యాజమాన్య కమిటీ వివరాలు తెలపాలి
నెల్లూరుసిటీ, జూలై 4: జిల్లాలోని అన్ని ప్రభుత్వ లోకల్ బాడీ, ఎయిడెడ్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసి) వివరాలను శుక్రవారం లోపు ఆయా మండల విద్యాశాఖాధికారులకు స్పరించాలని రాజీవ్ విద్యామిషన్ పిడి డాక్టర్ పి కోదండరామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు ఈ నెల 6వ తేదీల ఇజల్లా ప్రాజెక్టు కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా పంపాలన్నారు.
ఫీజు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలి
నెల్లూరుసిటీ, జూలై 4: కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ కమిటీలను నియమించాలని ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఫీజు నియంత్రణ జరగాలని ఆంధ్ర యువ విద్యార్థి సేన అధ్యక్షుడు పి అంజయ్య గురువారం జిల్లా కలెక్టర్ ఎఓకు వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 25శాతం పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రవేటు విద్యా సంస్థల్లో ఉచిత ప్రవేశాలు కల్పించి జిల్లాలో అనుమతి లేకుండా 175 పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిని తొలగించి బిఇడి అర్హత ఉన్న ఉపాధ్యాయులు స్కూళ్లలో పనిచేయాలన్నారు. విద్యా సంస్థలు ప్రారంభించి నెల రోజులు పూర్తి అవుతున్న జిల్లాలో అధికారులు ఇంత వరకు కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. ప్రతి పాఠశాలలో పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదన్నారు. కొత్తగా జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతి లేకుండా నడుపుతున్న కార్పొరేట్, ప్రవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుని ఫీజు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుండా ఉంటే జిల్లాలో ఉన్న అన్ని విద్యార్థుల సంఘాలతో కలసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ హరి, పి సుబ్రహ్మాణ్యం, పి అంకయ్య, బి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
* బిజెపి నేత చక్రధారి డిమాండ్
english title:
loans
Date:
Friday, July 5, 2013