Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

$
0
0

ఒంగోలు, జూలై 4: గ్రామపంచాయితీ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాలులో రెవిన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్లతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. అధికారులు ఏవిధమైన పొరపాట్లుకు తావులేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ఓటర్లు సేచ్చగా వారికి నచ్చిన అభ్యర్థులను ఎన్నుకునే వాతావరణం కల్పించాలన్నారు. అధికారులు తప్పు చేయనప్పుడు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా వారికి రక్షణ కల్పిస్తామని, తప్పుచేసినట్లు తెలితే మాత్రం అదే స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సబ్‌డివిజన్ స్థాయిలో ఆర్‌డివోలు, మండల స్థాయిలో ఎంపిడిఒలు కీలక బాధ్యతలు నిర్వహించాలన్నారు. ఆర్‌డిఒలు డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహిస్తూ వారి పరిధిలోని సిబ్బందికి పనివిభజన స్పష్టంగా చేయాలన్నారు. అధికారులు నిర్ణీత సమయానికి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఎక్కడైనా సందేహాలుంటే సీనియర్ అధికారులను సంప్రదించాలని తెలిపారు, జాయింట్ కలెక్టర్ అదనపు జిల్లా ఎన్నికల అదికారి హోదాలో గ్రామపంచాయితీల ఎన్నికల పక్రియను పర్యవేక్షిస్తారని, వివిధ స్థాయిలో పనిచేస్తున్న అధికారులందరూ జాయింట్ కలెక్టర్‌ను ఎప్పటికప్పుడు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల సామాగ్రికి సంబంధించి బ్యాలెట్‌పత్రాలు, ఓటర్ల జాబితాల ముద్రణ బాధ్యతలు జిల్లా పంచాయతీ అధికారి నిర్వహించాలని, బ్యాలెట్ బ్యాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రికి సంబంధించిన బాధ్యతలు ఎపిఎంపిఐపి ప్రాజెక్టు డైరక్టర్ నిర్వహించాలని ఆదేశించారు.
పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల నిమాయకం, పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా పరిషత్ సిఇఒ నిర్వహిస్తారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు బాధ్యతలను జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. గ్రామపంచాయితీ ఎన్నికలు ముగిసే వరకు జిల్లా పంచాయతీ అధికారి, వారి కార్యాలయ సిబ్బంది మొత్తం కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో పనిచేయాలని, జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో ఎవరికి కేటాయించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలకు తావులేకుండా రాజ్యాంగ బద్దంగా ఎన్నికల కమిషన్ నియమావళికి అనుగుణంగా పనిచేయాలన్నారు. అధికారులు సమయస్పూర్తి, బుద్ది కుశలతో పనిచేసి ఏవిధమైన ఆరోపణలు, అభియోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలపై నివేదికలను కంభం స్పెషల్ డిప్యూటి కలెక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాల్సిన బాధ్యత జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఎపిడి, కోనేరు రంగారావు సిఫారసుల కమిటీ డిప్యూటి కలెక్టర్ నిర్వహిస్తారన్నారు. ఈసమావేశంలో జిల్లాజాయింట్ కలెక్టర్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీలలో ఆధిపత్యానికి మూడు పార్టీల ఎత్తుగడలు
కందుకూరు, జూలై 4: డివిజన్ పరిధిలో 475పంచాయతీలలో ఈనెల 27న జరగనున్న ఎన్నికలకు టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపిలు పార్టీల నాయకులు ఇప్పటి నుండే ఎత్తుగతలు వేస్తూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డివిజన్ పరిధిలో కందుకూరు, కనిగిరి, కొండపి, దర్శి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజక వర్గాల పరిస్థితిని విశే్లషిస్తే త్రిముఖ పోటీ తప్పనిసరి అనే విధంగా పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశే్లషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అపర రాజకీయ చాణక్యుడిగా పేరు గడించిన మహీధర్‌రెడ్డి పంచాయతీలలో పట్టు సాధించి తన హవా తగ్గలేదని తద్వారా రానున్న శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు సాధ్యం అని నిరూపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక గత రెండు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీకి గట్టిపోటీ ఇచ్చి ప్రతిపక్షంగా ఉన్న టిడిపిని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిగిన నెల్లూరు పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారంలో వెనకబడినా టిడిపి ఎన్నికల వ్యయంలో వెనకడుగువేసినా సుమారు 34వేల ఓట్లు ఆపార్టీకి లభించి, గ్రామీణ ప్రాంతాలలో చెక్కుచెదరని కేడర్ ఉందని నిరూపించింది. అయితే ఆపార్టీలో శివరాం మినహాయించి మరే ద్వితీయశ్రేణి నాయకుడు లేనందున పార్టీకి కొంత వెలితి కనిపిస్తుందని విశే్లషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక జగన్ ఊపుతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానంతో పుట్టుకొచ్చిన వైఎస్‌ఆర్‌సిపి నియోజకవర్గంలో సంచలనాలు నెలకొల్పింది. నెల్లూరు పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా పార్టీకి సుమారు 30వేలు మెజార్టీ నియోజకవర్గంలో రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే తదుపరి జరిగిన సహకార సంఘ ఎన్నికలలో నియోజకవర్గంలో ఆపార్టీ నామమాత్రంగానే పోటీ ఇచ్చింది. ప్రస్తుతం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్‌ఆర్‌సిపికి కన్వీనర్లు, నియోజకవర్గస్థాయిలో ముగ్గురు కన్వీనర్లు ఉన్నా గ్రామస్థాయిలో పటిష్టమైన కేడర్‌లేని ఆపార్టీని వెంటాడుతుందని అభిప్రాయాలు రాజకీయపార్టీ నాయకుల నుండి వస్తున్నాయి. ఇప్పటి నుండే మూడు పార్టీల నాయకులు గ్రామాలవారీగా తమ అనుచరగణంతో ముమ్మరంగా చర్చలు సాగిస్తూ అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కందుకూరు మండలంలో టిడిపికి, లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో మూడుపార్టీల మధ్య నువ్వా నేనా అన్న విధంగా, గుడ్లూరు మండలంలో వైఎస్‌ఆర్‌సిపి వైపు మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో మూడుపార్టీల మధ్య పోటాపోటీగా పోటీ జరగనున్నట్లు తెలుస్తోంది. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తన అనుచరులతో ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తూ మెజార్టీస్థానాలు సాధించే దిశంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి మెజార్టీకై ఆపార్టీ నాయకులు ముక్కు కాశిరెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక టిడిపికి కదిరి బాబూరావు ఆధ్వర్యంలో మండలాల వారీగా పార్టీ నాయకులు గ్రామాలలోని పార్టీ కేడర్‌తో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కనిగిరి నియోజకవర్గంలో మూడుపార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా దర్శి, కొండపి నియోజకవర్గాలలో కూడా మూడు పార్టీల మధ్య పోరు తప్పనిసరి అని సమాచారం.

గ్రామాలలో మొదలైన ఎన్నికల సందడి
వెలిగండ్ల, జూలై 4: మండలంలోని గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు వెలువడడంతో ఆయా గ్రామాలలోని వివిధపార్టీల నాయకులు సర్పంచ్‌ల అభ్యర్థులకోసం వేటప్రారంభించారు. 21పంచాయతీలలోని కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సిపి, టిడిపిలు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నాయి. అయితే మొదటిసారిగా వైఎస్‌ఆర్ సిపి అన్ని పంచాయతీలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉండే, కాంగ్రెస్ మాత్రం అధికారంలో తామే ఉన్నాము కనుక తమకే ఎక్కువ పంచాయతీలు వస్తాయని భివిస్తుంది. ఇక తెలుగుదేశంపార్టీ ప్రభుత్వ వ్యతిరేకత, కోట్లు దిగమింగిన జగన్ జైల్లో ఉండడం, ఆపార్టీపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతుందని వాటివల్ల అత్యధిక స్థానాలు గెలుస్తామని పేర్కొంటోంది. ఏది ఏమైనా మండలంలోని వెదుల్లచెరువు గ్రామంలో జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకున్నాడు. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి స్వగ్రామమైన ఇమ్మడిచెరువు ఎన్నికలు ప్రతిష్టంగా తీసుకున్నారు. జిల్లా బిసిసెల్ టిడిపి అధ్యక్షులు గవదగట్ల పెదమాలకొండయ్య ఇమ్మడి చెరువు పంచాయతీని ఎలాగైనా గెలిపించుకోవాలని కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఎరీక్షన్‌బాబు మొగుళ్లూరు గ్రామాన్ని తెలుగుదేశం కైవసం చేసుకునేందుకు ప్రతిష్టంగా తీసుకున్నారు. ఏది ఏమైనా మండలంలో అత్యధిక స్థానాలు అధికారపార్టీ, వైఎస్‌ఆర్ సిపి, టిడిపిలు గెలుస్తామని ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

బాధ్యతలనుంచి తప్పించండి బాబూ
ఒంగోలు, జూలై 4: జిల్లాలో పార్టీపనితీరు, వాస్తవ పరిస్థితులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి తనను నియోజకవర్గ బాధ్యతలనుండి తప్పించాల్సిందిగా సంతనూతలపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ మన్నం శ్రీ్ధర్ తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడుకు గురువారం లేఖ పంపించారు. ఆ లేఖలోని సారాంశాన్ని పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్రం, పార్టీకోసం, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చంద్రబాబును ఆ లేఖలో కొనియాడారు. కాని కిందిస్ధాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తనను బాధ్యతల నుండి తప్పించినప్పటికీ పార్టీకోసం కృషిచేస్తానని ఆయన వివరించారు. జిల్లాతెలుగుయువత, సంతనూతలపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా తనను నియమించినందుకు చంద్రబాబుకు శ్రీ్ధర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతికార్యక్రమాన్ని నిర్వహించానని ఆయన పేర్కొన్నారు. జిల్లానేతలు కరణం బలరామకృష్ణమూర్తి, శిద్దా రాఘవరావు, దివి శివరాం, కందుల నారాయణరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జులు తనకు సలహాలు,సూచనలను అందించారని ఆయన వివరించారు. రాబోయే ఎన్నికల సమయంలో రెండుపదవులకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో ఒక పదవీకి వేరేవారిని ఎంపిక చేస్తే బాగుంటుందని నాలుగునెలల క్రితం జిల్లా పార్టీ ముఖ్యనాయకులను కలిసికోరానన్నారు. దీంతో సంతనూతలపాడు నియోజకవర్గం రిజర్వుడు సీటు కాబట్టి జిల్లా తెలుగుయువత అధ్యక్షునిగా కొనసాగటం మంచిదని పెద్దలు సలహా ఇచ్చారని ఆయన వివరించారు. దీంతో మూడునెలల క్రితం జరిగిన జిల్లా ఇన్‌చార్జుల సమావేశంలో తనను తెలుగుయువత అధ్యక్షునిగా కొనసాగించాలని జిల్లాపార్టీ నేతలకు వివరించానన్నారు. కాని జిల్లాలో పార్టీ ముఖ్యనాయకులను కాని, ఇన్‌చార్జులను కాని ఎవరిని సంప్రదించకుండా బుధవారం అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించడం బాధకలిగించిందన్నారు. జిల్లా అనుబంధ సంఘాలు ఎనిమిది ప్రకటిస్తే అందులో ఆరుగురు అధ్యక్షులను ఒకే నియోజకవర్గంనుండి ప్రకటించారన్నారు. మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. జిల్లా పార్టీ ముఖ్యనిర్ణయాలు తీసుకునేటప్పుడుకూడా జిల్లా ముఖ్యనాయకులను సంప్రదించి సమష్టినిర్ణయం తీసుకునే పరిస్ధితి లేదని, కష్టపడే కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని మన్నం శ్రీ్ధర్ చంద్రబాబుకు పంపించిన లేఖలో వివరించారు.

అంగన్‌వాడీ వర్కర్స్ సమ్మెను జయప్రదం చేయాలి
గిద్దలూరు, జూలై 4: రాష్టవ్య్రాప్తంగా అంగన్‌వాడీ వర్కర్ల సమ్మె ఈనెల 8,9,10 తేదీల్లో నిర్వహించనున్నామని, ఈసమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు కార్యాలయంలో యూనియన్ సమావేశం అధ్యక్షురాలు స్వర్ణ ఆధ్వర్యంలో జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జీతంతో సమంగా రాష్ట్రప్రభుత్వం వేతనాలు పెంచాలని, రిటైర్‌మెంటు బెనిఫిట్ అందచేయాలని అన్నారు. సూపర్‌వైజర్ పరీక్షకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు ఆవులయ్య, అంగన్‌వాడీ వర్కర్లు లక్ష్మీదేవి, ధనలక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పిఇటి పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
యర్రగొండపాలెంరూరల్, జూలై 4: స్థానిక కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పిఇటి పోస్టులకు అర్హులైన పిఇటి కోర్సు చేసిన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేక అధికారి కె విజయభాస్కర్‌రెడ్డి కోరారు. ఈనెల 8లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

పేద విద్యార్థినికి అన్నా ఆర్థిక సాయం
తర్లుపాడు, జూలై 4: చదువుల నిమిత్తం పేద విద్యార్థినికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు 10వేల రూపాయలను గురువారం అందచేవారు. తర్లుపాడు గ్రామానికి చెందిన సత్తెనపల్లి దానం కృష్ణతార సివిల్ శిక్షణ కొనసాగిస్తుంది. కృష్ణతార తండ్రి ఆటో నడుపుకుంటూ గుండెజబ్బుతో కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఎలాగైనా కూతురు చదవాలనే కోరికతో శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఆర్థికంగా అన్నా రాంబాబు ఆదుకోవడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఏకరూప దుస్తులు పంపిణీ
యర్రగొండపాలెంరూరల్, జూలై 4: స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు గురువారం ఎంఇఓ మస్తాన్‌నాయక్ ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ శ్రీను, వైస్‌చైర్మన్ నూర్జాహాన్, ఉపాధ్యాయులు కె సుకుమారి, ఎం భాస్కర్, రాజామణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అనుమతి లేకుండా నిర్వహిస్తున్న
కార్పొరేట్ జూనియర్ కాలేజీకి తాళాలు
దర్శి, జూలై 4:ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న నారాయణ జూనియర్ కాలేజీకి గురువారం ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ తనిఖీ అధికారి పి మాణిక్యరావు తాళాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో ఈ కళాశాలకు అనుమతులు లేవని హెచ్చరికలు జారీ చేసినా యాజమాన్యం ఖాతర్ చేయలేదన్నారు. ఆకస్మికంగా తనిఖీచేసి కళాశాలలు నిర్వహిస్తున్నట్లు కనుగొన్నామన్నారు. తాము వస్తున్నట్లు ముందుగా పసిగట్టిన యాజమాన్యం విద్యార్థులను కాలేజీ నుండి పంపివేశారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను కళాశాలల్లో చేర్పించేటప్పుడు ఆయా కాలేజీలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అని గమనించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాలేజీ యాజమాన్యం ఇతర కాలేజీలలో విద్యార్థులను చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ అనుమతి లేని కాలేజీలు నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆయనవెంట దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎ సువర్ణరావు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుంచి వైఎస్‌ఆర్ సిపిలో 100 కుటుంబాలు చేరిక
తర్లుపాడు, జూలై 4: కాంగ్రెస్‌పార్టీ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి 100 కుటుంబాలు గురువారం చేరినట్లు వైఎస్‌ఆర్ సిపి మండల అధ్యక్షులు రావి బాషాపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా మార్కాపురం వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కలుజువ్వలపాడు, ఓబాయపల్లి, కొండారెడ్డిపల్లి, లక్ష్మక్కపల్లి గ్రామాల కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ఈకార్యక్రమంలో రమేష్‌రెడ్డి, మండల వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు తిప్పిరెడ్డి వెలుగొండారెడ్డి, మాజీ అధ్యక్షులు వెన్నా తిరుపతిరెడ్డి, మాజీఎంపిపి ఆర్ వెంకటరెడ్డి, యక్కంటి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలుజువ్వలపాడు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

పాతికేళ్ల అనంతరం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న చెరుకూరు
పొన్నలూరు, జూలై 4: మండలంలోని చెరుకూరు గ్రామం పాతికేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం పంచాయతీ పోరుకు సిద్ధమవుతోంది. ఈగ్రామంలో ఏ పంచాయతీ ఎన్నికలు జరిగి ఇప్పటికి పాతికేళ్ళ పూర్తియ్యాయి. 1985వ సంవత్సరం తర్వాత ఇప్పటికి చెరుకూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగలేదు. గ్రామస్థులందరూ పార్టీల కతీతంగా సహృద్భావ వాతావరణంలో చర్చలు నిర్వహించుకుని రాజీ ఫార్ములా పాటిస్తుండడంతో ఎన్నికలు జరపకుండా ఐదేళ్ళకోసారి ఐదు లక్షల రూపాయల చొప్పున గ్రామ అభివృద్ధి నిధులు గ్రామానికి చేకూరాయి. అయితే గతంలో గ్రామ పంచాయతీని ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు, దళిత కులాలకు కేటాయిస్తుండడంతో గ్రామస్థులు ఎన్నికలకు వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. అయితే ఈసారి జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో ప్రస్తుతం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కళ కనిపిస్తోంది. గడచిన పదేళ్ల కాలంలో ప్రజలు సమర్థులు, విద్యావంతులైన నాయకత్వం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి సర్పంచ్ నేలపాటి సుబ్బారావు అనేక వ్యయ ప్రయాసలకోర్చి నిజాయతీతో వ్యవహరించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. నాటి నుండి నేటి వరకు జనరల్ అభ్యర్థులకు కేటాయించకపోవడంతో గ్రామంలో రాజకీయంపై నిరాసక్తత నెలకొంది. ఇనే్నళ్ళ తర్వాత పంచాయతీని జనరల్ మహిళకు కేటాయించడంతో గ్రామంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. గ్రామంలో మొత్తం 1500 పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రధానపోటీ టిడిపి,, వైఎస్‌ఆర్‌సిపి మధ్యనే
ఇటీవల సహకార ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన వైఎస్‌ఆర్‌సిపి రెట్టించిన ఉత్సాహంతో కదన రంగంలో కాలు దువ్వుతుండగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి తరపున ఇప్పటికే పోటీచేసే అభ్యర్థిని ప్రకటించి కొంతమేర ప్రచారం పూర్తిచేయగా, అధికార కాంగ్రెస్ గ్రామంలో కనుమరుగైపోయింది. కారణం అధికారపార్టీకి గతంలో నాయకత్వం వహించిన నేత ప్రస్తుతం చిత్తూరు జిల్లా తిరుపతిలో వ్యాపార నిర్వహణలో ఉన్నారు. దీంతో అధికార పక్షానికి దిశా నిర్దేశం చేసే రథ సారధి కరువైపోయారు. దీంతో కాంగ్రెస్‌లో ఉన్న వారంతా వైఎస్‌ఆర్ సిపిలోకి వెళ్లారు. చాలా రోజులుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశంపార్టీ గతంతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు మధ్యవర్తులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఒకవేళ రాజీ ప్రయత్నాలు సఫలం అయితే పాతికేళ్లపాటు పంచాయతీ ఎన్నికలు లేని గ్రామంగా చెరుకూరు గ్రామం రికార్డుల కెక్కనుంది.
‘ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలి’
అద్దంకి, జూలై 4: ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని ఎండిఓ విజయకుమార్ అన్నారు. ఆరోగ్య, పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా గురువారం విద్యార్థులతో పట్టణంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఎండిఓ మాట్లాడుతూ మలమూత్ర విసర్జనకు ఇంటింటా మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆరోగ్య పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. వర్షాకాలంలో మలేరియా, జ్వరాలు వచ్చే అవకాశాలున్నందున, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈప్రదర్శనలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధరశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రోశయ్య జన్మదిన వేడుకలు
దర్శి, జూలై 4 : తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 81వ జన్మదిన వేడుకలను దర్శి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కస్తూరిబా పాఠశాల విద్యార్థినుల మధ్య ఈ వేడులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలేజీ విద్యార్థినులకు ఎస్‌డిఆర్ ఫౌండేషన్ అధినేత సోము దుర్గారెడ్డి నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కాలేజీలో తల్లిదండ్రులు లేని విద్యార్థినికి దుస్తులు పంపిణీ చేశారు. కాలేజీకి అవసరమైన వాటర్ ట్యాంకును కొల్లా భాస్కర్‌రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొగ్గవరపు సుబ్బారావు, కార్యదర్శి అచ్యుత సత్యనారాయణ, కోశాధికారి దేవకి రాము, అచ్యుత కొండలు , వెంకట రమణ, సి ప్రసాద్, దేవకి సత్యనారాయణ, పి సుబ్రమణ్యం, పులిపాటి శ్రీను, బొగ్గవరపు వెంకటేశ్వరరావు, రామచంద్రారావు, కొల్లా భాస్కర్, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయితీ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో
english title: 
free and fair

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>