Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచాయతీ ఎన్నికల గుర్తులు ఖరారు

$
0
0

శ్రీకాకుళం, జూలై 4: పంచాయతీ ఎన్నికల గుర్తులను ఎట్టకేలకు ఖరారు చేశారు. జిల్లాలో బ్యాలెట్ విధానం ద్వారా ఈదఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. సర్పంచ్‌లకు, వార్డు మెంబర్లకు కేటాయించిన గుర్తుల ముద్రణల సైతం జిల్లాలోనే ముద్రించినట్లు జిల్లా పంచాయతీ శాఖాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సర్పంచు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులకు 20 గుర్తులను, వార్డు మెంబర్లకు పోటీచేసే అభ్యర్థులకు 15 గుర్తుల వరకు కేటాయించారు. జిల్లాలో 1091 పంచాయతీల్లో సర్పంచ్లు, 10,490 స్థానాల్లో వార్డుల అభ్యర్థులు బరిలో దిగి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ముద్రించిన బ్యాలెట్ ముద్రణలను ఆయా మండలాలకు పంపించినట్లు తెలిసింది. సర్పంచు స్థానాలకు గాను బుట్ట, ఉంగరం, కత్తెర, కుట్టుమిషన్, బ్యాట్, పలక, బ్యాటరీలైట్, బ్రష్, క్యారెట్, టేబుల్‌బల్ల, దూరదర్శిని, చేతికర్ర, షటిల్, మొక్కజొన్న, నగారా, దువ్వెన, మంచం, కప్పు, సాసర్, కొవ్వొత్తి గుర్తులను ముద్రించి సిద్ధం చేశారు. అదేవిధంగా వార్డుమెంబర్లకు సంబంధించి స్తంభం కవాతు, గ్యాస్‌పొయ్యి, హార్మోనియం, టోపీ, ఇస్ర్తిపెట్టె, పోస్టుడబ్బా, ఫోర్క్, చెంచా, జగ్గు, గౌను, స్టూల్, బీరువా, ప్రషర్‌కుక్కర్, ఐస్‌క్రీమ్, కెటిల్ గుర్తులను ముద్రించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత మండలాధికారులకు సైతం వీటికి సంబంధించిన బ్యాలెట్ ముద్రణలను పంపించి అక్కడ నిర్ధేశించిన కేంద్రాల్లో సిద్ధం చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి 4,408 వరకు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసి మండలాలకు చేరవేశారు. వీటితోపాటు బ్యాలెట్ కొరత లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికలకమీషన్ ఆదేశాల మేరకు మరో వెయ్యి బ్యాలెట్ బాక్సులను కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాకు తెప్పించుకున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయి స్టేషనరీ సామాగ్రి సైతం ఆయా మండలాలకు పంపించినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.3కోట్లు?
శ్రీకాకుళం, జూలై 4: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడు కోట్లరూపాయల వరకు బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో మూడు విడతల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా జరిపే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశాల మేరకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది పూర్తి జాబితాను సిద్ధంచేసిన పంచాయతీ అధికారులు దానిని నేడో, రేపో జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. సుమారు ఏడేళ్ల తరువాత నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఇప్పటికే సంబంధిత జిల్లా కలెక్టర్‌కు, పంచాయతీ అధికారులతో పాటు ఎన్నికల్లో పాల్గొంటున్న వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2.46 కోట్లరూపాయల నిధులను ఎన్నికల నిర్వహణకు వెచ్చించగా, ఈ సారి ఈ వ్యయాన్ని మూడుకోట్లరూపాయలకు పైగా కేటాయించినట్ల్లు తెలిసింది.
* అధికారులు, సిబ్బంది నియామకం
జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో స్టేజ్-1, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల నియమాకం ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. ఈనెల 23వ తేదీన శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికలకు స్టేజ్-1లో రిటర్నింగ్ అధికారులు 151 మందిని, స్టేజ్-2లో 389 మందిని నియమించింది. అదేవిధంగా 3,448 మంది ప్రిసైడింగ్ అధికారులు, 5,245 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. అలాగే ఈనెల 27వ తేదీన జరగనున్న పాలకొండ డివిజన్ ఎన్నికలకు గాను స్టేజ్-1లో119, స్టేజ్-2లో 408మందిని నియమించగా, 3,522మంది ప్రిసైడింగ్ అధికారులను, 4,805 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసారు.అదేవిధంగా 31వ తేదీన జరగనున్న టెక్కలి డివిజన్ ఎన్నికకు గాను స్టేజ్-1కు 117 మందిని, స్టేజ్-2కు గాను 368 మందిని నియమించారు. 3,520 మంది ప్రిసైడింగ్ అధికారులను, 4,050 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ఇతర శాఖల సహాయం కూడా తీసుకున్నారు.
* ఎన్నికల విధులకు గౌరవవేతనం
స్థానిక సంస్థ ఎన్నికల విధుల్లో పాల్గోనే అధికారుల గౌరవవేతనాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రిసైడింగ్ అధికారి/ కౌంటింగ్ సూపర్‌వైజర్‌కు-250 రూపాయలు, పోలింగ్ అధికారి/ కౌంటింగ్ అసిస్టెంట్‌కు-175 రూపాయలు, జోనల్, రూట్, సెక్టోరియల్ అధికారులకు ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం ఇచ్చే గౌరవవేతనం-800 రూపాయలు, క్లాస్‌ఫోర్ ఉద్యోగులకు-100 రూపాయలు, పోలింగ్ /కౌంటింగ్ జరిగే రోజుల్లో భోజనానికి-100 రూపాయల వరకు గౌరవవేతనం ఇవ్వనున్నారు.

భక్తులతో కిటకిటలాడిన కూర్మనాథుని ఆలయం
గార, జూలై 4: మండలం శ్రీకూర్మంలో వెలసిన కూర్మనాథుని జయంతి వేడుకలు గురువారం కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారిణి శ్యామలాదేవి, పాలక మండలి సభ్యులు పొన్నాడ రుషీశ్వరరావు, దివిలి అప్పారావుల పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు చామర్ల సీతారామ నృసింహాచార్యులు నేతృత్వంలో అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పంచామృత అభిషేక సేవ అనంతరం ఉత్సవ మూర్తులను ఏకాంతంగా స్వామివారి జయంతోత్సవ మండపంలో వేంచేపు చేశారు. అదేవిధంగా స్వామి వారి ఆస్థాన మండపంలో 108 కలశాలతో ఆరాధన గావించి అనంతరం వివిధ రకాలైన ఔషధాలతో నదీజలాలను శాస్ర్తియంగా స్నపన అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా అభిమంత్రన చేసిన తీర్ధంతో స్వామికి అభిషేకం చేసారు. అనంతరం స్వామి ఉత్సవ మూర్తులను ఆస్థాన మండపంలో ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి నూతన వస్తధ్రారణ అనంతరం పుష్పాలతో అలంకరణ గావించి స్వామి అవతార ఘట్టాన్ని అర్చకులు వినిపించారు. అనంతరం భక్తుల సందర్శనార్ధం అనుమతించారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు అర్చక స్వాములకు పండిత సత్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరినామ సంకీర్తనలు, హరికథా కాలక్షేపం భక్తులను ఆకట్టుకొంది. అభిమంత్రన చేసిన జలం కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ ఉత్సవ నిర్వహణ కోసం ముందుకు వచ్చిన దాతలు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఆనందగజపతిరాజు గోత్రనామాలతో కూడా విశేషార్చనలు గావించారు.

నరసన్నపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జిగా రమణమూర్తి
నరసన్నపేట/జలుమూరు, జూలై 4: నరసన్నపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బగ్గు రమణమూర్తిని నియమిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇన్‌చార్జిగా కొనసాగిన బగ్గు లక్ష్మణరావు ఇటీవలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక్కడ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే నియోజకవర్గంలో ఇన్‌చార్జి నియామకానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సమీక్షలు జరిపి, చివరకు బగ్గు రమణమూర్తికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంతో నియోజకవర్గంలో నాలుగు మండలాల స్థానిక ఎన్నికలలో పార్టీపరంగా కార్యకర్తలకు నాయకత్వ కొరత తీరనుంది.
పార్టీ పటిష్టతే లక్ష్యం
టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎన్నికైన బగ్గు రమణమూర్తిని గురువారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ అధినేత తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. తాను పార్టీ ఆవిర్భావం నుండి కీలకబాధ్యతలను చేపట్టానన్నారు. 1985-87లో నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా, అలాగే 1987-89లో జిల్లా పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశానని వివరించారు. 1991 వరకు పార్టీలో జనరల్ సెక్రటరీగా సేవలను అందించానని చెప్పారు. జలుమూరు, నరసన్నపేట జడ్పీటిసి ఎన్నికై 1995 నుండి 2001 వరకు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా కూడా కొనసాగానన్నారు. అలాగే 2001 నుండి 2005 వరకు జలుమూరు జెడ్పీటిసిగా పదవీబాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. అయితే దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు నేతృత్వంలో పార్టీలో సేవలందించానని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని వెల్లడించారు.

ఆ పంచాయతీలకూ ఎన్నికలు
* హైకోర్టు తీర్పుతో గ్రామాల్లో ఎన్నికల వేడి
ఎచ్చెర్ల, జూలై 4: శ్రీకాకుళం మున్సిపాలిటీలో పరిసరంగా ఉన్న ఏడు పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆరు పంచాయతీలకు చెందిన నాయకులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తూ కుశాలపురం, తోటపాలెం, పాతృనివలస, ఖాజీపేట ఎన్నికలను తదుపరి కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్వహించాలని వాయిదా వేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు పైడి అనసూయమ్మ, కళ్లేపల్లి రమణకమారి, అప్పలనాయుడు, ఎం.మురళీలు న్యాయమూర్తి వేణుగోపాలరావు ద్వారా ఎన్నికలు జరిపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ప్రజావ్యాజ్యం స్వీకరించిన హైకోర్టు యధావిధిగా కుశాలపురం, తోటపాలెం, పాతృనివలస, ఖాజీపేట గ్రామాలకు ఎన్నికలు జరిపించాలని గురువారం తీర్పునిచ్చింది. దీనిపై ఆ గ్రామాల్లో కూడా ఎన్నికల సమరం జరుగనుంది.

వివేకానందుడి స్ఫూర్తితో సాగండి
* సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు కామేశ్వరరావు
శ్రీకాకుళం, జూలై 4: స్వామి వివేకానందుని స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని సిటిజన్‌ఫోరం జిల్లా అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు అన్నారు. ఫోరం కార్యాలయంలో గురువారం వివేకానందుని 111వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. భారతీయులకు గౌరవం తీసుకువచ్చిన ఘనత వివేకానందుడదని కొనియాడారు. దేశ యువతకు సందేశాన్ని ఇచ్చి సమాజాన్ని మంచి లక్ష్యంతో అభివృద్ధి సాధించాలని బోధించిన వ్యక్తి అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్, పత్తి సుమతిలు మాట్లాడుతూ వివేకానందుని అడుగుజాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు. తొలుత వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరాడ రమేష్, ఎ.వి.టి.అప్పారావు, శ్యామ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూర్మనాథుని దర్శించుకున్న విజిలెన్స్ డిప్యూటి డైరెక్టర్
గార, జూలై 4: మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయాన్ని విజిలెన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎం. సురేష్‌బాబు కుటుంబీకులతో గురువారం సందర్శించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్ర సందర్శనానంతరం కూర్మనాథాలయానికి చేరుకున్న సురేష్‌బాబును ఆలయాధికారులు, అర్చకులు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ముందుగా స్వామిని దర్శించుకున్న ఈయన లక్ష్మీ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలోని గోడలపై ఒడిషా ఆకుపసర్లుతో వేసిన నాటి చారిత్రక చిత్రాల చరిత్రను, విశిష్టతను ఆలయ పాలక మండలి సభ్యుడు దివిలి అప్పారావు వివరించారు. స్వామి ఆస్తాన మండపంలో జరుగుతున్న కూర్మ జయంతి ఉత్సవంలో కొద్ది సేపు పాల్గోన్న సురేష్‌బాబు కుటుంబీకులకు తీర్థ ప్రసాదాలు అందజేసారు.

సమర్ధవంత నేతను సర్పంచ్‌గా ఎన్నుకోండి
సారవకోట, జూలై 4: గ్రామాల్లో నిరంతరం ప్రజలకు సేవ చేసే సమర్ధవంతమైన నాయకున్ని సర్పంచుగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. కోదడ్డపనస గ్రామంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నేటి కాంగ్రెస్ పార్టీ మునిగే పోయే పరిస్థితిలో ఉందని, రాష్ట్రానికి జగన్ నాయకత్వమే సమర్ధవంతమైన పరిపాలన ఇవ్వగలదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నమ్మిన అవసరాలు తీర్చే విధంగా పరిపాలన కొనసాగాలని అభిప్రాయపడ్డారు. కోదడ్డపనస గ్రామస్థులు ఏకత్రాటిపై నిలిచి ఒకే అభ్యర్థిని సర్పంచు ఎన్నికల బరిలో దించేందుకు నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఇదే స్పూర్తితో కాంగ్రెస్ ఆగడాలను ఎదుర్కొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి గ్రామ పంచాయతీపై వైఎస్సార్ సీపీ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ అర్హులందరికీ ఒకే పర్యాయం పథకాల ఫలితాలు అందించిన ఘనత దివంగత సి.ఎం వైఎస్సార్‌కే దక్కిందన్నారు. పేదలకు విద్యా, వైద్యసదుపాయాలు కల్పించిన వైఎస్ పేరు ప్రజల్లో సజీవంగా ఉందన్నారు. అంతకుముందు పార్టీలో చేరిన గ్రామస్థులకు కృష్ణదాస్, లక్ష్మణరావులు కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటిసిలు చిన్నాల రామసత్యనారాయణ, నామగిరి జగన్నాధదాసు, పార్టీ నాయకులు, గ్రామస్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కనె్నధారపై రీసర్వే ప్రారంభం
సీతంపేట,జూలై 4:సీతంపేట ఏజెన్సీలోని కనె్నధార కొండ పై సర్వే నెం.289లో ఉన్న బౌండరీ సరిహద్దులను సర్వే బృందాలు గురువారం కొలతలు చేపట్టాయి. జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి బి రామారావు ఆదేశాల మేరకు పది బృందాలు పులిపుట్టి, కర్లెమ్మ రెవెన్యూ సరిహద్దు పరిధిలో ఉన్న కంఠమానుగూడ,మాసంగిగూడ గ్రామాల్లో జిపిఎస్ సిస్టం ద్వారా సర్వే జరిపారు. అక్కడి నుండి బౌండరీల పరిధిలో ఉన్న భూముల హద్దులు, పంటలు, శ్మశానాలు, ఉమ్మడి ఆస్తుల వివరాలను మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. మాసంగిగూడ,కంఠమానుగూడ గ్రామాల గిరిజనులకు సర్వే నెం.289లో ఇచ్చిన పట్టాలు,పాస్‌పుస్తకాలు,గిరిజన రైతులు ఆ భూముల్లో సాగుచేస్తున్న పంటలను పరిశీలించారు. సర్వే మొత్తం జిపిఎస్ సిస్టం ద్వారా సాగుతుందని డిఐఓ పోలారావు చెప్పారు. అధికారులు రెండు గ్రూపులుగా విడిపోయి సర్వే జరిపారు.
సర్వే పారదర్శకంగా చేయండి:
తమ జీవనాధారమైన కనె్నధార కొండ పై లోకాయుక్త ఆదేశాల మేరకు చేపడుతున్న రీసర్వే పారదర్శకంగా చేయాలని కనె్నధార పోరాటకమిటీ నాయకులు సవరతోట మొఖలింగం కోరారు. గతంలో మాదిరిగా సర్వే చేపట్టి తప్పుడు నివేదికలు అందజేస్తే సహించేది లేదని అన్నారు.సర్వే బృందాలకు తాము పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. కాగా, రీసర్వే సమాచారం తెలుసుకున్న గిరిజనులు పట్టాలు,పాస్‌పుస్తకాలతో కనె్నధార కొండకు చేరుకున్నారు. ఈ రీసర్వేలో సంజ్ఞారాణి,సర్వేయర్‌లతో పాటు కనె్నధార పోరాటకమిటీ నాయకులు వెలుగు సంజీవరావు,మిత్యారావు, గిరిజనులు పాల్గొన్నారు.

పట్టుబడిన అంతర్ రాష్ట్ర దొంగలు
పాలకొండ,జూలై 4: ఏమార్చి బంగారం దుకాణాల్లో వ్యాపారుల నుండి బంగారాన్ని అతి చాకచక్యంగా దొంగిలించే అంతర్రాష్ట దొంగల ముఠాను పాలకొండ పోలీసులు పట్టుకున్నారు. అనతికాలంలోనే ఈ నేరస్తులను ఎస్ ఐ వినోద్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని దొంగతనం చేసిన బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు. నేరస్తులను స్థానిక డి ఎస్‌పి దేవానంద్ శాంతౌ గురువారం విలేఖర్ల ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పోస్ట్ఫాసు రహదారిలో ఈ నెల 1న సాయంద్రం ఏడున్నర గంటల ప్రాంతంలో బంగారుదుఖాణంలో చోరీకి పాల్పడిన వారిని పార్వతీపురం రామకళామందిర్ థియేటర్‌లో మాటువేసి పట్టుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుండి ఏడున్నర తులాల బంగారం వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పార్వతీపురంలో ఈ బంగారాన్ని విక్రయించేందుకు వీరు వస్తారనే అనుమానంతో ఆప్రాంతంలో నిఘా పెంచామన్నారు. అలాగే మండలంలోని ఎన్‌కె రాజపురం గ్రామంలో మే 5న గిరి త్రినాధరావు ఇచ్చిన పిర్యాదు మేరకు దొంగను పట్టుకున్నామని స్థానిక బుట్టిమఠం ప్రాంతానికి చెందిన గొలుసు శ్రీను అలియాస్ కుక్కల శ్రీను అలియాస్ పోలయ్యను స్థానిక మార్కెట్‌లో గురువారం అరెస్టు చేశామన్నారు. ఈ దొంగతనంలో నాలుగు తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్, వెండి పట్టీలు స్వాధీన పరుచుకున్నామని తెలిపారు.
ఒడిశాలో దొంగల నివాసం
పట్టుబడిన వారు ఒడిశాలోని రాయఘడకు చెందినవారు సయద్ గులాం ఆలీ, సఫీ ఆలీ, సయద్ మహమ్మద్ ఆలీలుగా గుర్తించామని వీరంతా బంధవులేనని అదే రాష్ట్రానికి చెందిన ఖరియర్‌కు చెందినవారన్నారు. రాయఘడలో ఉంటూ వీరు పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. దొంగల్లో రకరకాలవారు ఉంటారని, వీరు వ్యాపారులను ఏమార్చి దొంగతనాలు చేసేవారిగా గుర్తించి ఆదిశలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నామని తెలిపారు.
జిల్లా ఎస్‌పి అభినందన
పాలకొండ పట్టణంలో బంగారం దుఖాణంలో జరిగిన చోరీకి సంబంధించి నింధితులను అనతికాలంలో పట్టుకున్న పాలకొండ ఎస్ ఐ వినోద్ బాబు, సిబ్బంది ఎల్ రాంబాబు, పి శ్రీనివాసరావు, వై గవరయ్య, బి రమేష్‌లను జిల్లా ఎస్‌పి గోపాలరావు అభినందించారు. ఈసందర్భంగా వారికి రివార్డును కూడా ప్రకటించినట్లు డి ఎస్‌పి తెలిపారు.

విద్యాసంస్థల బంద్‌పై ఎస్‌ఎఫ్‌ఐ ప్రచారం
శ్రీకాకుళం, జూలై 4: ప్రభుత్వం విద్యాసంస్థల్లో కనీస వౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపుమేరకు ఈనెల 6న విద్యాసంస్థల బంద్ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ చేసిన ప్రచారానికి విశేష స్పందన లబించింది. విద్యాసంస్థలు, యాజమాన్యం హాస్టల్ విద్యార్థులను కలిసారు. ఈ సందర్బంగా విద్యార్థులు, యాజమాన్యం, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై చలపతిరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమో పాఠశాల ప్రారంభం నాటికి ఇవ్వాలని ఖచ్చితమైన అంచనాలు ఉన్నప్పటికీ ప్రింటింగ్ చేయకుండా, టెండర్లు పిలవకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలకు కనీస వౌళిక సదుపాయాలు కల్పించాల్సిన బాద్యతను విస్మరిస్తున్నారన్నారు.
ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు చదువుకొనేందుకు కళాశాలల్లో కొన్ని గ్రూపులు ఎత్తివేసి విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఆర్ మోహన్‌రావు, ఎస్ హరీష్, డీవైఎఫ్‌వై పట్టణ కన్వీనర్ మనోహరి పట్నాయిక్, జగదీష్, బాబూరావు, జానకిరావు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల గుర్తులను ఎట్టకేలకు ఖరారు చేశారు
english title: 
symbols

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>