Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మూడు పార్టీలకు ముచ్చెమటలు!

$
0
0

విశాఖపట్నం, జూలై 4: పంచాయతీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని చంద్రబాబు ఇప్పటికే డిక్లర్ చేశారు. తొమ్మిదేళ్ళపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి ఇవి ప్రతిష్ఠాత్మక ఎన్నికలు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బే తగిలింది. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలను సాధించుకోపోతే, తొమ్మిదేళ్ళ పాలనకు అర్థం లేకుండా పోతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం కాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలో తెలియని పరిస్థితుల్లో ఉంది.
ఏ ఎన్నికలకైనా పంచాయతీ ఎన్నికలే నాందీ ప్రస్తావన అవుతాయి. పార్టీ పరంగా ఈ ఎన్నికలు జరగకపోయినా, గ్రామాల్లో ఆయా పార్టీలకున్న బలమేంటో తేలిపోతుంది. ఆ తరువాత జరగనున్న జిల్లాపరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎన్నికల ప్రభావమే కనిపిస్తుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించాయి.
ముందుకురాని అభ్యర్థులు
పంచాయతీ సర్పంచ్‌లుగా పోటీ చేయడానికి అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వస్తే, ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తావని ప్రశ్నించడంతో, వారు ముందుకు రావడం లేదు. చాలా చోట్ల ప్రధాన రాజకీయ పార్టీలకు అభ్యర్థులు లేకపోవడం గమనార్హం. అన్ని రాజకీయ పార్టీలూ అభ్యర్థుల అనే్వషనలో నిమగ్నమై ఉన్నాయి. జిల్లాలో 920 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 50 శాతం పంచాయతీలను మహిళలకు కేటాయించారు. అంటే 460 పంచాయతీల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైనా ఉంది. అంతమంది మహిళా అభ్యర్థులు ఏ పార్టీకీ దొరకడం లేదు.
ఏకగ్రీవం అనుమానమే!
గత పంచాయతీ ఎన్నికల్లో 71 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఈ ఏడాది పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికలు ఏకగ్రీవమైనా, వేలం పాటలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఈ సంవత్సరం ఏకగ్రీవం అయ్యే పంచాయితీలు ఉండకపోవచ్చు.
ఇక పార్టీల పరంగా చూస్తే..జిల్లాలో మూడు పార్టీలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాలేదు. జిల్లాలో కొణతాల, దాడి, సబ్బం గ్రూపులు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో క్యాడర్ ఎవరి మాట వినాలి? అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతోంది. దీని ప్రభావం ఆయా గ్రామాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ గ్రూపులను సరిచేసుకోలేకపోయారు. ఈ తరుణంలో పార్టీని సరిచేసుకునే అవకాశాలు లేవు. కొణతాల రామకృష్ణ ఇంకా అలక వీడలేదు. కాగా, నిన్న మొన్నటి వరకూ సబ్బం హరి పక్కన ఉన్న వర్గం అంతా ఇప్పుడు దాడి వీరభద్రరావు గూటిలోకి చేరుతోంది. దీనిపై సబ్బం హరి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇన్ని గ్రూపులు, ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న వైకాపాకు జన బలం ఉన్నా, తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, ఇక్కడ ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. నాయకులంతా కలిసి ఉన్నట్టే, కనిపిస్తున్నా, ఎన్నికల్లో పార్టీకి తూట్లు పొడిచేందుకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో ఈ తీరు కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలుగుదేశం పార్టీ వారు అమ్ముడైపోయారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. డిసిసిబి చైర్మన్ ఎన్నిక సమయంలో అప్పటి రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ సొసైటీ అధ్యక్షులను సమావేశానికి పిలిచినా, ఎవ్వరూ హాజరు కాకపోవడాన్ని బట్టి పార్టీ తీరు అర్థమవుతోంది. ఇక టిడిపి నుంచి వైకాపాలో చేరిన దాడి వీరభద్రరావు ఆ పార్టీలో పట్టు నిలుపుకొనేందుకు ఈ ఎన్నికలను ఒక వేదికగా చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో పట్టు ఉన్న దాడి, వైకాపా బలాన్ని జోడించి ప్రధానంగా తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేసినా చేయచ్చు. వీటిని బేరీజు వేసుకుని, టిడిపి నాయకులు పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహ రచన చేసే పరిస్థితులు చాలా మృగ్యంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆధిపత్య పోరు కొనసాగితే, పార్టీలో సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో గడ్డు రోజులు తప్పవన్నది వాస్తవం.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లా మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. గత తొమ్మిదేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను గ్రామీణ ప్రజలకు అందించింది. వీటిపై మమకారంతో ఓట్లు కాంగ్రెస్ వేస్తారా? అదే మాదిరి గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు వగైరా అంశాలతో కాంగ్రెస్‌ను ఈ సారి దూరంగా ఉంచుతారా? అన్నది వేచి చూడాలి. ఒక విధంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన తీరు ఈ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు.

పది రోజుల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం
* సీనియర్లను ఆదేశించిన చంద్రబాబు
విశాఖపట్నం, జూలై 4: ఇప్పటి వరకూ జిల్లాలో నిర్లిప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపేందుకు చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశం చేశారు. గురువార తెల్లవారుజాము రెండు గంటల వరకూ నాలుగు జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, ఉదయం 5.30 గంటలకు ఇక్కడి నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడుతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు జిల్లా నుంచి వెళుతూ పాయకరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌గా అనితను నియమించారు. ఇంకా గాజువాక, పాడేరు, అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను వెంటనే నియమించాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే యలమంచిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల విషయంలో కూడా చంద్రబాబు పునరాలోచన చేస్తున్నట్టు భోగట్టా.
ఇక చంద్రబాబు నాయుడు ఉదయం 5.30 గంటలకు విజయవాడ బయల్దేరి వెళ్లినప్పుడు స్థానిక నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు.

వుడా బోర్డు సమావేశం రద్దు
విశాఖపట్నం, జూలై 4: విశాఖ నగరాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం రద్దయింది. ఈ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే వుడాకు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా మున్సిపల్, పరిపాల పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన శ్యాంబాబు ఆ శాఖ ఈ సమావేశానికి హాజరు కావల్సి ఉంది. ఇటీవల ఆయన ఆ శాఖ నుంచి బదిలీ కావడంతో ఈ బోర్డు సమావేశాన్ని రద్దు చేసినట్టు వుడా విసి యువరాజ్ ప్రకటించారు. దీన్ని ఎప్పుడు నిర్వహించేదీ తరువాత తెలియచేస్తామని ఆయన చెప్పారు.

వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
* కెజిహెచ్‌లో కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
విశాఖపట్నం, జూలై 4: బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ కెజిహెచ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు గురువారం కెజిహెచ్ సూపరింటెడెంట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులను జెండాలను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పటల్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జెడి నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు వెన్నుముకగా ఉన్న కింగ్‌జార్జి ఆసుపత్రిలో 130 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఓ కార్పొరేట్ సంస్థ ఆదీనంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తస్తున్నారన్నా. వీరంతా దళిత బలహీనవర్గాలకు చెందినవారు, వీరంతా రోగులు విడిచిన వ్యర్ధాలను తీసి ఆసుపత్రిని శుభ్రం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారన్నా. వీరికి గత రెండు మాసాలుగా సంబంధిత కాంట్రాక్టర్, ఆసుపత్రి యాజమాన్యం జీతాలు చెల్లించడంలేదన్నా. జీతాలు లేక కార్మికులంతా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారన్నా. ఈ వృత్తిమీద వచ్చే జీతమే వీరికి ఆదారంగా పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. యూనియన్ ప్రతినిధి జి.వామనమూర్తి మాట్లాడుతూ ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు కట్టుకోలేక తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారన్నా. కొన్ని సందర్భాల్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్మికులంతా చాలీచాలని జీతాలతో బతుకుతున్నారని, పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు చెల్లించడంలేదన్నారు. 68 జివో (సఫాయి కర్మచారి)ల ప్రకారం ధరలకనుగుణంగా జీతాలు చెల్లించడంలేదన్నారు. జివోలు ఇచ్చి 15 మాసాలు గడుస్తున్నా అమలకు నోచుకోలేదన్నారు. కార్మికులపట్ల కాంట్రాక్టర్, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జీతాల కోసం ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. అందువలనే ఆందోళనకు దిగామని, రెండు మాసాల జీతాలను చెల్లించాలని, పెరిగిన జీతాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరించకపోతే కార్మికులంతా కలసి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

విశాఖలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
* నేటికి 200 రోజులు..100 నియోజకవర్గాలు పూర్తి
విశాఖపట్నం, జూలై 4: మరో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్సార్‌సిపి నాయకురాలు షర్మిల ప్రారంభించిన పాదయాత్ర విశాఖ నగరంలో కొనసాగుతోంది. గత నెల 24వ తేదీన షర్మిల పాదయాత్ర విశాఖ జిల్లాకు చేరుకుంది. విశాఖ రూరల్ జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకుని, రెండు రోజుల కిందట విశాఖ నగరంలో అడుగుపెట్టింది షర్మిల. విశాఖ రూరల్ జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుల సహాయ సహకారాలు ఆమెకు అందలేదు. జగన్ ముఖ్య అనుచరునిగా చెప్పుకుంటున్న సబ్బం హరి అస్సలు పాదయాత్రలో ఎక్కడా కనిపించలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కొణతాల రామకృష్ణ వ్యక్తిగత కారణాల వలన పాదయాత్రకు దూరంగా ఉండిపోయారు. దాడి వీరభద్రరావు పాత్ర కూడా పాదయాత్రలో అంతంతమాత్రంగానే ఉంది. శుక్రవారం ఉదయం గాజువాక నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎన్‌ఎడి జంక్షన్ మీదుగా కంచరపాలెం మెట్టకు చేరుకుంది. రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు.
ఇదిలా ఉండగా శుక్రవారం నాటికి షర్మిల పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటుంది. గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. అలాగే ఇప్పటి వరకూ 100 నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర కొనసాగింది. దీన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్‌కె బీచ్‌లో భారీ బహిరంగ సభకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. అయితే స్థానిక నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా అది ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బహిరంగ సభ సమాచారాన్ని పార్టీ క్యాడర్‌కు తెలియచేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖలోనే ముగింపా?
షర్మిల శనివారం వరకూ విశాఖలోనే పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తొమ్మిదో తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఈ సమయంలో పాదయాత్ర నిర్వహించడం సరికాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకూ పాదయాత్రను నిలిపివేయాలా? లేక విశాఖలోనే ముగింపు ఇవ్వాలా? అన్న ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర 208 రోజులు కొనసాగింది. విశాఖతోనే షర్మిల తన పాదయాత్రను ముగిస్తే, 201 లేదా 202 రోజులు పూర్తవుతాయి. అయితే చంద్రబాబు కన్నా ఎక్కువ కిలో మీటర్లు నడిచినట్టు పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి.

గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలి
విశాఖపట్నం, జూలై 4: విశాఖ ఏజేన్సీ మండలాల్లో గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని కోరుతూ గిరిజన హక్కుల పరిరక్షణ ఐక్యకార్యాచరణ కమిటీ (విశాఖ జిల్లా) ఆధ్వర్యంలో గురువారం గిరిజనులు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. గత నెల 17వ తేదీన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పసుపులేటి బాలరాజు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖామంత్రి సారయ్య కొయ్యూరు మండలంలో గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చినట్టుగా వచ్చిన సమాచారం గిరిజనులను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధి కె.సత్యనారాయణ మాట్లాడుతూ గిరిజన చట్టాలకు, హక్కులకు భంగం కలిగించే ఈ చర్యను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యనే తమ సంఘాలు జరిపిన సర్వేలో అరకువేలీలో సుమరు వంద దుకాణాలకుగాను కేవలం ఒక్క దుకాణం కూడా గిరిజనుడికి చెందినది లేదన్నారు. ఒక పేద గిరిజనుడు పెట్టుకున్న చిన్న టీ దుకాణం లేకపోగా, పక్కనే వెలసిన గిరిజనేతురుని హోటల్ పోటీకి తట్టుకలేక మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజన ఉద్యోగులు హౌసింగ్ సొసైటీగా ఏర్పడి ఇళ్ళు కట్టుకొందామని ప్రయత్నం చేయగా అరుకువేలీ చుట్టుపక్కల సుమారు కిలోమీటర్ల పరిధిలో భూములన్నీ గిరిజనేతరుల చేతిలో బినామీ పేర్లతో ఉన్నాయన్నారు. ఏజేన్సీలో అన్ని మండల కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. గిరిజన ఐక్యవేదిక ప్రతినిధి ఏ.సింహాచలం మాట్లాడుతూ 1/70 చట్టాన్ని ఇతర గిరిజన అనుకూల చట్టాలను నీరుగార్చే ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసినా అది లక్షలాది మంది గిరిజనుల మనోభావాలను దెబ్బతిసేవిగా భావిస్తున్నామన్నారు. కనుక గత నెల 17వ తేదీన కొయ్యూరు మండలంలో గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని, పీసా చట్టం, అటవి హక్కుల చట్టం, ఇతర గిరిజన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే కాలంలో గిరిజనులు తమ హక్కుల కోసం జరిపే పోరాటాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గిరిజనులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలి
అనకాపల్లి, జూలై 4: జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అల్లూరి సీతారామరాజు జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గూడ్సుషెడ్డు వద్దనున్న సీతాతారామరాజు విగ్రహానికి సిపిఐ కార్యదర్శి వైఎన్ భద్రం, ఆడారి అప్పారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించి గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి శీరందాసు అబ్బులు, మాజీ కౌన్సిలర్ తాకాశి వెంకటేశ్వరరావు, కర్రి సూర్యనారాయణ, వియ్యపురాజు, కోరిబిల్లి శంకకరావు, ఎఐటియుసి కార్యదర్శి కోన లక్ష్మణ, వేగి బంగారునాయుడు పాల్గొన్నారు. ఎఐటియుసి భవనంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఎఐటియుసి కార్యదర్శి కోన లక్ష్మణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంటకోట సత్యనారాయణ, నాయుడు మల్లికార్జునరావు, కోడూరు వీరాచారి, బుద్ధ వీరభద్రరావు, కెవి రమణ, వియ్యపురాజు పాల్గొన్నారు. భారతీయ జనతాపార్టీ యువమోర్చ ఆధ్వర్యంలో తుమ్మపాల ఆర్‌ఇసిఎస్ కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ సైనికులు వైఎస్‌రావు, బిజెపి రాష్ట్ర నాయకులు గంగుపాం నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌రావు సమాజంలో నేటి యువత అల్లూరి ఆశయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు కొణతాల శివకుమార్, న్యాయవాది ఐవిఎస్ ప్రసాదరావు, బిజెవైఎం నాయకులు పీలా మురళీ, బొడ్డేడ అశోక్, వుడా రమేష్, పొలమరశెట్టి నాగేశ్వరరావు, ఎం.రామచంద్రరావు పాల్గొన్నారు. హిందూ జనవేదిక ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి జయంతిలో జనవేదిక పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అడపా రామకృష్ణ, బోనగిరి శ్రీనివాసరావు, నాగులాపల్లి ఈశ్వరరావు, శివసత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు.

టిడిపి పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా అనిత?
పాయకరావుపేట, జూలై 4: టిడిపి పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా వి.అనితను నియమించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఓపెన్‌స్కూల్స్ జిల్లా కో-ఆర్డినేటర్‌గా అనిత పనిచేస్తున్నారు. చెంగల వెంకట్రావు టిడిపిని వీడి వైఎస్సార్ సిపిలోకి వెళ్లడంతో ఇక్కడ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి సీటు ఖాళీ అయింది. ఈ సీటు కోసం సుమారు 15 మంది వరకు రాష్ట్ర పార్టీకి బయోడేటాలు సమర్పించారు. బుధవారం విశాఖ వచ్చిన చంద్రబాబు పాయకరావుపేట ఇన్‌చార్జి నియమించే విషయమై చర్చించారు. నేతలు అయ్యన్నపాత్రుడు, గవిరెడ్డి రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, పప్పల చలపతిరావు, కెఎస్‌ఎన్‌రాజు అందరూ అనితకు ఇన్‌చార్జి పదవి ఇస్తే పార్టీ అభివృద్ధి చెందుతుందని సూచించారు. దీంతో అనితను ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్టు ఇక్కడి నాయకులను సమాచారం అందింది. అనితను టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినట్టు సమాచారం అందడంతో పార్టీ నాయకులు ఆనందోత్సవాలు నెలకొన్నాయి.
‘అల్లూరిని ప్రభుత్వం విస్మరించడం తగదు’
కె.డి.పేట,జూలై 4: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం తెలుగు వారికే సిగ్గుచేటని అల్లూరి రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు, అల్లూరి సోదరుని కుమారుడు సత్యనారాయణరాజు అన్నారు. కృష్ణాదేవిపేటలో గురువారం అల్లూరి 116వ జయంతి వేడుకలు స్థానిక పార్కులో నిర్వహించారు. ఇక్కడ సెంటర్‌లో ఉన్న అల్లూరి విగ్రహం నుండి పాఠశాలల విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, యువకులు ప్రధాన రోడ్లలో కాగడా పట్టిన అల్లూరి చిత్రపటాన్ని ఊరేగించారు. అల్లూరి కొల్లగొట్టిన పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ జరిపారు. అనంతరం పార్కులో ఏర్పాటుచేసిన అల్లూరి జయంతి సభలో సత్యనారాయణరాజు మాట్లాడుతూ అల్లూరిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. మన్యం ప్రజల జీవన గమనంపై పోరాడి స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన అల్లూరిని ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు అల్లూరి స్ఫూర్తితో పోరాడాలంటూ పిలుపునిచ్చే ప్రజాప్రతినిధులు, ఎన్నికైన అనంతరం అల్లూరిని విస్మరించడం జాతికే అవమానమన్నారు. అల్లూరి రాష్ట్ర కమిటీ సహా ఉపాధ్యక్షుడు వబ్బలరెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ 3.60 కోట్ల రూపాయలతో ఇక్కడ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో ఎందరో మంత్రులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. పర్యాటక శాఖలో విలీనం చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ఇందుకు జిల్లా మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావు కృషి చేయాలని కోరారు. మన్యం వీరునిగా గిరిజనుల గుండెల్లో దేవుడిగా నిలిచిన అల్లూరిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆయన సంచరించిన ప్రాంతాలు, స్మారక మందిరాలను, పార్కును అభివృద్ధి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలుగుదేశంపార్టీ ఎస్టీసెల్ కార్యదర్శి దుచ్చరి చిట్టిబాబు డిమాండ్ చేశారు. ఈ సభలో స్థానిక నాయకులు చిటికెల మురళీమోహనరావు, పైల రాంబాబు, న్యాయవాది చింతల ప్రకాష్‌తోపాటు అల్లూరి కుటుంబ సభ్యులు శివాజీ పాణిగ్రహి, శ్రీరామరాజు, సత్యవతి, సుబ్బిరాజు పాల్గొన్నారు.
తేనెటీగల దాడిలో
20 మంది విద్యార్థులకు గాయాలు
కోటవురట్ల,జూలై 4: తేనెటీగల దాడిలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ప్రిన్సిపాల్ దివాకర్ తీసుకువచ్చి చికిత్స చే యించారు. తేనెటీగలు విజృంబించడంతో కళాశాల ప్రిన్సిపాల్ గురువారం సెలవు ప్రకటించారు. స్థానిక జూనియర్ కళాశాల వద్ద ఎండిపోయిన చెట్టుకు తేనెపట్టు పట్టింది. ఎవరో ఆకతాయి తేనెపట్టు మీదకు రాయి విసరడంతో తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించాయి. కళాశాల తరగతి గదుల్లోకి వెళ్ళి విద్యార్థులపై దాడిచేశాయి. దీంతో వి ద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కళాశాల నుండి బయటకు పరుగులు తీశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో నాగేంద్ర, సాయిబాబు, కనకదుర్గ, గణపతి, దుర్గాప్రసాద్,దాలినాయుడు, శ్రీను, వర్మ, భాస్కరరావు ఉన్నారు.
‘అల్లూరి స్ఫూర్తితో బాక్సైట్‌పై పోరాటం సాగిద్దాం’
డుంబ్రిగుడ, జూలై 4: మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని బాక్సైట్‌పై గిరిజనులు పోరాటం సాగించాలని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి కె.లోకనాధ్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 116వ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో అల్లూరి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు అడవిపై పూర్తి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని అమలు చేసిందన్నారు. పోడు పట్టాలు పంపిణీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని తెలిపారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని, పీసా చట్టాన్ని తిరస్కరించి బాక్సైట్ తవ్వకాలకు కుటిల ప్రయత్నాలు సాగిస్తుందన్నారు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, వారపుసంతల్లో దళారుల చేతిలో గిరిజన రైతులు మోసపోయి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐ.టి.డి.ఎ. కార్యాలయం ప్రస్తుతం దళారి వ్యవస్థగా మారిందని విమర్శించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని తరిమికొట్టినట్టు బాక్సైట్ జోలికి వచ్చే వారిని సైతం తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. జిల్లా కార్యవర్గ సభ్యులు కోటేశ్వరావు, కె.సురేంద్ర, వి.ఉమామహేశ్వరరావు, కె.్ధయానిధి, గుర్మిసింగ్, దేశం నాయకులు సుబ్బారావు, భాస్కరరావు, అల్లూరి యూత్ అధ్యక్షుడు ఎం.అర్జున్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతనం పెంచాలి
* అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన
* కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
విశాఖపట్నం, జూలై 4: కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పదవీ విరమణ చేసిన తరువాత లక్ష రూపాలయు, హెల్ఫర్‌కు రూ.50వేలు గ్రాట్యూటీనివ్వాలని, చివరి జీతంతో సగం పెన్షన్ ఇవ్వాలనేవి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. వీటితోపాటు సూపర్‌వైజర్ పరీక్షకు వయో పరిమితి 55ఏళ్ళకు పెంచాలని, ఐసిడిఎస్‌ను సంస్థాగతం చేయాలని, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను స్వచ్చంధ, ప్రైవేటు మరే ఇతర సంస్థలకు అప్పగించరాదంటూ అంగన్‌వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ పెరిగిన పని గంటల ఆధారంగా ఉపాధ్యాయులకు, ఆయాలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఆందోళనకు దిగామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే దీనిని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రమాదకర విధానాలతో ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. పిల్లలకు, గర్భిణీ స్ర్తిలకు, బాలింతలకు, కిశోర బాలికలకు అనుబంధ పోషకాహారాన్ని అందిస్తూ, ఫ్రీ స్కూలు పిల్లలకు ఆటలు, పాటలతో విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో దోహదం చేస్తున్న అంగన్‌వాడీ వ్యవస్థను ప్రభుత్వాలు తమ విధానాలతో నాశనం చేస్తున్నాయన్నారు. 2001లోనే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు దేశంలో అన్ని గ్రామాల్లో, నివాస ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పాలని ఆదేశించిందన్నారు. మరోపక్క ప్రభుత్వం ఇందిరమ్మ అమృతహస్తం పేరుతో ‘్ఫల్‌మీల్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, దీనిలో ఐకెపి ఇతర స్వచ్చంధ సంస్థలను కూడా ఈ పథకంలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం గందరగోళం చేస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు ప్రధాన కార్యదర్శి రమేష్ హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రోజు అంగన్ వర్కర్లు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదన్నారు.

జింక్ ప్లాంట్ స్థలానికి రక్షణ కల్పించాలి
* కార్మికుల సంక్షేమంపై చర్యలు కేంద్రం చొరవ తీసుకోవాలి
* కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి
విశాఖపట్నం, జూలై 4: అనేక కారణాలతో మూతపడిన హిందుస్థాన్ జింక్ ప్లాంట్‌లో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని తగిన న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర సహాయమంత్రి, విశాఖ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి తెలిపారు. ఈ మేరకు కేంద్ర గనులశాఖామంత్రి దిన్షా జె.పటేల్‌కు ఆమె లేఖ రాసారు. గతంలో అనేకసార్లు చేసిన విజ్ఞప్తులను పరిశీలించి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా కొన్ని మాసాలుగా మూతపడిన హిందుస్థాన్ జింక్‌ప్లాంట్ స్థలాన్ని రియల్ ఎస్టేట్‌గా మార్పు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. దీనివల్ల మరో సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. ఇప్పటికే మూతపడిన జింక్ ప్లాంట్‌ను తెరిచే క్రమంలో చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇది మూతపడినందు ఇందులో పనిచేసే కార్మికుల కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకునే నాధులే కరవయ్యారని, థర్డ్ పార్టీ అధ్యయనం ద్వారానే న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి జింక్ ప్లాంట్ స్థలానికి తగిన రక్షణ కల్పించి, ఇందులో కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

స్టేషన్‌కు బాంబు బూచి?
* పరుగులు తీసిన పోలీసులు
* అధికారుల హైరానా
విశాఖపట్నం, జూలై 4: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి బాంబు ఉందనే వార్తలతో కలకలం రేగింది. చివరికి ఎలాంటి బాంబూ లేదని తేలటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందనే సమాచారంతో రైల్వేస్టేషన్‌లో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అజ్ఞాత వ్యక్తి ఒకరు రైల్వే పోలీసులకు ఫోన్ చేసి స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు బాంబును పెట్టినట్టుగా ఫిర్యాదు చేయడంతో డిస్పీ భీమారావుతోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. అయితే దీనిపై బాంబు స్వ్కాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆర్ఫీఎఫ్, జిఆర్‌పి సంయుక్తంగా స్టేషన్‌లో పలుచోట్ల విస్తృత తనిఖీలు చేశారు. రైల్వే అధికారులు హైరానా పడటం, ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీయడం ప్రత్యేకమైంది. బాంబు ఉందని కొందరు, ఏకంగా బాంబు పేలిదంటూ మరికొంతమంది నోట వినిపించిన నేపధ్యంలో అంతటా అప్రమత్తమయ్యారు. విశాఖ రైల్వేస్టేషన్ అన్ని ప్లాట్‌ఫారాలు, జ్ఞానాపురం వైపు స్టేషన్, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, వాటర్ పైపులైన్లు, స్టేషన్‌ళో పలు విభాగాల్లో నిశితంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బాంబు లేదని తేలటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఎరువు మరీ బరువు
* భారీగా పెరిగిన ఎరువుల ధరలు
విశాఖపట్నం (జగదాంబ), జూలై 4: వరుస కష్టాలతో అల్లాడుతున్న రైతన్నకు ఎరువుల ధర పెంపుతో ప్రభుత్వం మరింత భారం మోపుతోంది. గత మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టిల కారణంగా జిల్లా రైతాంగం నష్టాలబారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోకపోగా వారిని మరింత కుంగదీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కిరణ్ సర్కార్ గద్దెనెక్కిన తరువాత ఇప్పటికే ఐదుసార్లు ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డివిరిచారు. అది చాలదన్నట్లు సర్కారు మరోసారి ఎరువుల ధరలను పెంచింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో లక్షవేల హెక్టార్లకు పైగా వరిపంట సాగవుతోందని అధికారులు అంచనావేసారు. దీనికోసం డిఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు కలిపి సుమారు వంద టన్నులకు పైగా అవసరమని వ్యవసాయ అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం డిఎపి ధర రూ.1190 ఉంది. దీనిని ప్రభుత్వం తాజాగా రూ.1350కి పెంచగా, పొటాష్ ధర ప్రస్తుతం 840 ఉండగా దీనిని 990కు పెంచారు. కాంప్లెక్స్ ఎరువు ధర రూ.1150 ఉండగా రూ.1475కు పెంచారు. యూరియా ధర మాత్రం రూ.290లోనే ఉంది. ఈ ఏడాది దీని ధరను పెంచలేదు. యూరియా ధర అందుబాటులో ఉన్నప్పటికీ పంట ఎదుగుదలకు యూరియావల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనేది రైతుల నమ్మకం. డిఎపి, కాంప్లెక్స్, పొటాష్ ఎరువుల వల్ల పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని భావిస్తున్న జిల్లా రైతాంగం వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కౌలు రైతు మొదలుకొని ప్రతి రైతు డిఎపి, పొటాష్ ఎరువులను వేస్తారు. పంట పొట్టదశలో గింజల నాణ్యత కోసం పొటాష్ ఎరువును వేస్తారు. అయితే ప్రస్తుతం ఎరువుల ధరలను చూసి రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో సుమారు వెయ్యి రూపాయలు కేటాయిస్తే రెండు ఎరువుల బస్తాలు వచ్చేవి. కాని నేడు ఒక బస్తా కూడా రాని పరిస్థితి. గతంలో ఎకరానికి రెండు పర్యాయాలు ఎరువులు వేయడానికి రూ.1200 ఖర్చు అయ్యేది. కాని ఇప్పుడు సుమారు 3 వేలకు పైగా అవుతోంది. దీంతో రైతులు ఎరువులకే సగం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఎరువుల ధర పెంచడం వల్ల ఈ ఏడాది జిల్లా రైతాంగంపై రూ.2.50 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. ఈ పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి సంభవిస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. గత మూడేళ్లుగా పెట్టుబడికి చేసిన అప్పులే రైతన్న ఇంకా తీర్చలేదు. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం రైతన్నకు ఇబ్బందిగా మారింది. రైతు సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్నా ప్రభుత్వం ఎరువుల ధఱలు పెంచి తమపై భారం మోపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ మద్దతుదారులకే అధిక పంచాయతీలు
* మంత్రి ముఖేష్‌గౌడ్ ధీమా
సింహాచలం, జూలై 4: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధిక పంచాయతీలు కైవసం చేసుకుంటారని రాష్ట్ర మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో మంత్రి కాసేపు మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కానప్పటికీ పార్టీల మధ్య తప్పక ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామీణస్థాయిలో అందరికీ చేరునున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో గెలుపొందుతారనే ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఏకతాటిపై నడిచి సర్పంచ్‌ల విజయాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసేవలోవ ఉన్నవారికి పదవులు వాటంతట అవే వర్తిస్తాయని పదవులొచ్చాక సేవలు కొనసాగించే వాడే ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతారని మంత్రి చెప్పారు. అంతకు ముందు మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారిని ప్రార్థించుకున్నారు. కాగా ఎపిడిసిఎల్ సిఎండి కార్తికేయమిశ్రా కూడా సింహాచలేశుని దర్శించుకొని విశేష పూజలు చేయించుకున్నారు. దేవస్థానం అధికారులు ఈయనకు ఆలయ మర్యాదలు చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

విశాఖపట్నం, జూలై 4: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరక అవసరాలు తీసుకుని, మరో యువతిని వివాహమాడిన వ్యక్తి బాగోతం గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మహిళ చేతన నాయకురాలు కె.పద్మను ఆశ్రయించి, ఆమె సహాయంతో ఎమ్.వి.పి.జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన యువతి అక్కడ ఉన్న కంకి రిలేషన్‌షిప్ మార్కెటింగ్ ప్రైవెట్ లిమిటెడ్‌లో పని చేస్తుండేది. అదే కంపెనీలో పని చేయడానికి నగరంలోని కె.ఆర్.ఎమ్.కాలనీకి చెందిన బొల్లవరపు సుధాకర్ 2006లో చేరాడు. ఈ తరుణంలో వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని సుధాకర్ నమ్మించి 2010లో విశాఖకు తీసుకుని వచ్చి ఎమ్‌విపికాలనీలోని పెయింగ్ గెస్ట్ రూమ్‌లో కొద్ది రోజులు ఉంచి తర్వాత ఆమెను హైదరాబాద్‌కు పంపి వేశాడు. మరల విశాఖకు తీసుకుని వచ్చి అప్పుఘర్‌లోని ఎపి టూరిజం హొటల్‌లోని గదిలో ఉంచి సుధాకర్ శారీరకంగా లొంగదీసుకోవడంతో 2011లో ఆమె గర్భవతి అయ్యింది. వివాహం చేసుకోమని ఒత్తిడి తీసుకుని రావటంతో మాత్రలు ఇచ్చి ఆదర్శనగర్‌లోని ఓ క్లినిక్‌లో ఆమెకు సుధాకర్ అబార్షన్ చేయించాడు. తర్వాత వివాహం చేసుకోమని పట్టుబడడంతో 2012 మే నెలలో ఆమెను సుధాకర్ తన ఇంటికి తీసుకుని వెళ్లి తల్లి శంకుతలకు పరిచయం చేశాడు. కొత్తగా సుధాకర్ పేరుతో కనస్ట్రక్షన్స్ బిజినెస్ పెట్టానని తర్వాత వివాహం చేసుకుంటానని తల్లి ఎదుట మాట ఇవ్వడంతో ఆమె నమ్మింది. అప్పటి నుండి ఎప్పటికప్పుడు వివాహ విషయం వాయిదా వేయడం సుధాకర్ ప్రారంభించాడు. తర్వాత ఇసుకతోటలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఆమెను ఉంచాడు. ఈ ఏడాది మే నెలలో దుబాయ్ వెళ్తున్నానని, రాగానే వివాహం చేసుకుంటానని చెప్పి హైదరాబాద్‌కు పంపించి వేసి, విజయనగరం జిల్లాకు చెందిన సత్య అనే యువతిని మే 29న సుధాకర్ వివాహం చేసుకున్నాడు.
సుధాకర్ వివాహం చేసుకున్నట్టు అతని కంపెనీ సూపర్‌వైజర్ ద్వారా తెలుసుకున్న ఆమె షాక్‌కు గురై వెంటనే విశాఖకు చేరుకుని, అతనికి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను నిలదీసింది. సుధాకర్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని, ఆచూకీ దొరికితే వెంటనే పెళ్లి చేస్తామని వారు నమ్మించారు. ఈ విధంగా రెండు సార్లు ఇంటి చుట్టూ ఆమె తిరగగా, సుధాకర్‌కు పెళ్లి చేసేశామని ఇంకోసారి ఇంటికి వస్తే బాగుండదని మూడో సారి ఆమె ఇంటికి వెళ్తే అతని తల్లిదండ్రులు ఓ ముస్లిం యువకునితో కలిసి బెదిరించారు. దీంతో చేసేది లేక ఆమె మహిళ చేతన నాయకురాలు పద్మను ఆశ్రయించడంతో ఆమె సహాయంతో మోసగాడు సుధాకర్, తల్లిదండ్రులు శంకుతల, వీరభద్రచారిపై గురువారం ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్.వి.పి.జోన్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

* వైకాపాలో గ్రూపులు * కాంగ్రెస్‌లో సమన్వయ లోపం * టిడిపిలో ఆధిపత్యపోరు
english title: 
three parties

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>