విజయనగరం, జూలై 4: పంచాయతీ ఎన్నికల ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. గ్రామాల్లో ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల్లో తమ సామాజిక వర్గం బలం ఎక్కువ ఉందని, తనకే మద్దతు పలకాలని ఆశావహులు ప్రధాన పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని ప్రధాన పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమకు గల అన్ని అవకాశాలను ఒడ్డి పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రాబల్యం కొనసాగించేందుకు అన్ని శక్తులను ఉపయోగిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా పంచాయతీ ఎన్నికలను కీలకంగా భావిస్తొంది. ఈ ఎన్నికల్లో పట్టు సాధిస్తేనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు సులభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం గెలుపు అవకాశాలు ఉన్న వారినే బరిలో నిలబెట్టాలని యోచిస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ఆకర్షించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తొంది. అంతేగాకుండా కాంగ్రెస్‌లో వర్గాలు ఉన్న చోట తమ బలం పెంచుకోవాలని వ్యూహాం పన్నుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే తమకు శ్రీరామరక్ష అని తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగుతున్న ఆశావహులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఈ దఫా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి నిలబెట్టే యోచనలో ఉండటంతో త్రిముఖ పోటీ ఖాయమని తెలుస్తొంది. నిన్న, మొన్నటి వరకు ప్రధాన పార్టీలలో ఎవరికో ఒకరికి సర్పంచ్ పదవులు దక్కేవి. ఈ దఫా త్రిముఖ పోటీతో ఓటర్లలో చీలిక ప్రారంభం కానుంది. మూడు పార్టీలలో నేతలు మహిళల్లో గెలుపు అవకాశాలు, మాటకారితనం ఉన్న వారిని గ్రామాల్లో నిలబెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సర్పంచ్ పదవులను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. గ్రామాల్లో సర్పంచులకు పలుకుబడి, హోదా ఉండటంతో ఆ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు అన్ని వర్గాల వారిని కలుసుకుంటున్నారు. తాము గతంలో చేసిన సేవలకు గుర్తుగా ఈ దఫా తమను గెలిపించాలని అభ్యర్థులు ప్రాధేయపడుతున్నారు. రిజర్వేషన్ ప్రక్రియలో కొంత మందికి పోటీ చేసే అవకాశం దక్కనప్పటికీ వారి మిత్రులు, తమ మాట మీద నిలబడే వ్యక్తులను ఎన్నికల్లో దింపి తాము అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎన్నికల వేడి కన్పిస్తొంది.
గంటి ప్రసాదంపై కాల్పులను
ఖండించిన కళాసీ సంఘం
విజయనగరం, జూలై 4: విరసం సభ్యునిగా జీవితాన్ని ప్రారంభించి విప్లవబాటలో నడిచిన మావో అమరవీరుల బంధుమిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటి ప్రసాదరావు గురువారం నెల్లూరులోని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురై అక్కడ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈయన స్వస్థలం సీతానగరం మండలం అజ్జాడ. తల్లిపేరు వాసమ్మ. ఈయనకు ఆరుగురు అన్నదమ్ములు. ఈయన బీఎస్సీ వరకు బొబ్బిలిలో విద్యాభ్యాసం చేశారు. ఉద్యోగం వేటలో తిరిగి ఉద్యోగం దొరక్కపోవడంతో పిడబ్ల్యుజి విధానాలపట్ల ఆకర్షితులయ్యారు. 1998 ఆగస్టులో జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం కొప్పడంగి ఎన్‌కౌంటర్‌లో తన సోదరుడు గంటి రమేష్ మృతి చెందాడు. ఆ తరువాత గంటి ప్రసాదరావు ఆ దళంలో చేరాడు. దళంలో చేరక ముందు రెండేళ్ల నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. 12 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపాడు. ఆ తరువాత బీహార్‌లో కొనే్నళ్లు గడిపాడు. ఉత్తరాంధ్రలో విప్లవ కార్మిక సంఘాలకు పునాది వేశాడు. రైతు పేదల కమిటీ, ప్రగతి శీల కార్మిక సంఘంలకు నాయకత్వం వహించాడు. 2007 మార్చి 10న బొబ్బిలిలో ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో అతనిపై కర్ణాటక కేసు, నిజామాబాద్ కేసులతోపాటు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, నరసన్నపేటలో జరిగిన దాడుల కేసులు ఉన్నాయి. ఆ తరువాత ఏడాది జైలు జీవితం గడిపాడు. గంటి ప్రసాదరావుపై కాల్పులు జరపడాన్ని కళాసీల సంఘం అధ్యక్షుడు బాగారు అప్పలస్వామి, కార్యదర్శి తవిటినాయుడులు తీవ్రంగా ఖండించారు. ఆయన గన్ను పట్టే వ్యక్తి కాదని, పెన్ను పట్టే వ్యక్తిఅని వారు పేర్కొన్నారు. పోలీసులు బూటకపు కాల్పులు జరిపారని మండిపడ్డారు.
ఆకాశాన్నంటిన
కూరగాయల ధరలు
భోగాపురం, జూలై 4 : కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మధ్య తరగతి నిరుపేదలకు కూరగాయలు కొనుక్కోని తినాలంటే చుక్కలు లెక్కపెట్టవలసిన పరిస్థితి వుంది. టమాటా కేజీ ధర వారం క్రితం 16 రూపాయలు ఉండగా ప్రస్తుతం కేజీ 60 రూపాయల వరకు ధర పెరగడంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఏవైనా శుభకార్యాలయకు అంత రేట్లతో కాయగూరలు విక్రయించ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వంద రూపాయలు వున్న అరటిగెలలు ప్రస్తుతం 280 రూపాయల వరకు అధిక ధరలు పలుకు తున్నాయి. అలాగే బెండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, క్యాబేజీ, వంకాయలు తదితర కూరగాయలకు కేజీకి అదనంగా 20 రూపాయలు వరకు ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు తినాలంటే వ్యయ ప్రయాసలు కోర్చి విక్రయించాల్సిన పరిస్థితి వుంది తక్షణమే ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలను అదపులోకి తీసుకు రావాలని పలువురు కోరాతున్నారు.
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద
విజయనగరం , జూలై 4: యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ చైర్మన్ మామిడి అప్పలనాయుడు అన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి గురువారం ఇక్కడ పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో జరిగింది. వివేకానంద చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ స్వామి వివేకానంద మనదేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శనీయమన్నారు. . ప్రపంచం ఉన్నంతవరకూ స్వామి వివేకానంద ఆశయాలు, ఆదర్శాలు సజీవంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రవూఫ్, జె.వి.రాకేష్ పట్నాయక్, శ్రీనివాసరావు, పెంటయ్య, నారాయణరావుతదితరులు పాల్గొన్నారు.
‘ఆగస్టు 18న ఉత్తరాంధ్ర శైవ మహాసభలు’
విశాఖపట్నం, జూలై 4: శ్రీ శైవ మహాపీఠం విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 18న ఉత్తరాంధ్ర శైవ మహాసభలు నిర్వహిస్తున్నట్టు ఆ పీఠం అధ్యక్షుడు అండలూరి శ్రీనివాసశర్మ గురువారం ప్రకటనలో తెలిపారు. సద్గురు శివానందమూర్తి ఆశీర్వచనాలతో జరిగే ఈ కార్యక్రమంలో సావనీర్‌ను ఆవిష్కరిస్తారన్నా. ఆరాధ్యుల్లో 70 ఏళ్ళు పైబడిన వారికి ఆత్మీయ సత్కారాలు ఉంటాయన్నారు. ఆరాధ్య బంధువులత్లో ప్రతిభ పాటవాలు కనబర్చిన పిల్లలకు ప్రోత్సహించి జ్ఞాపికలను అందజేయనున్నట్టు చెప్పారు. అరాధ్య బంధువులంతా శ్రీ శైవమహాపీఠంను సంప్రదించి, వారి వివారలను, సావనీర్‌లో ప్రచురించాల్సిన అంశాలను పీఠానికి అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ పీఠం ప్రతినెల మాస శివరాత్రి రోజున లేదంటే మొదటి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏకవార రుద్రాభిషేకం,స్ర్తి, పురుష సూక్తం, మంత్రపుష్పాలు వంటి కార్యక్రమాలను నిర్వహస్తున్నామన్నారు.
‘రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర’
బొంపడల్లి, జూలై 4 : ఠాష్ట్ర విభజన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం తెలియని నేతల నివేదిక అవసరమా? అని అనకాపల్లి ఎంపి, వైకాపా రాష్ట్ర నేత సబ్బంహరి ప్రశ్నించారు. మండలంలోని దేవుపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను చిన్నాభిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసి రాష్ట్ర సాంప్రదాయాన్ని కాపాడిన వైఎస్సార్ తనయుడు జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌పై అవగాహన లేని దిగ్విజయ్, ఆజాద్ నివేదికలపై కాంగ్రెస్ ఆధార్ పడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక నేత రాయల తెలంగాణా అని, మరో నేత తెలంగాణా అని మరికొంత మంది సమైక్యాంధ్ర అని పొట్లాట పెట్టి రాష్ట్ర ముక్కలుగా విభజించేందుకు నివేదిక అందజేయడం సరికాదన్నారు . వైకాపా జిల్లా కన్వీనర్ పి.సాంబశివరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయకేతనం ఎగుర వేసేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబినాయిన, ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు , నాయకులు పాల వలస రాజశేఖర్, శీరంరెడిడ పెద్దినాయుడు, మండల కన్వీనర్ ఈదుబిల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు రాపాక అచ్చింనాయుడు, రాజశేఖర్, అప్పారావు, వైకాపాలో చేరారు.
పాఠశాల సమస్యలపై విద్యార్థుల ఆందోళన
విజయనగరం , జూలై 4: పట్టణంలో కస్పా పురపాలక ఉన్నత పాఠశాల సమస్యలను పరిష్కరించాలని ఆ పాఠశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో గురువారం పురపాలక సంఘ కార్యాలయాన్ని దిగ్భందించారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి ఎం.గణేష్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో సమస్యలపై అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఎందరో విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలు కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి కుళాయిలు పనిచేయడం లేదని, మరుగుదొడ్లు ఉన్న ప్రయోజనం లేదని, ప్రహారీ గేటు మరమ్మతులు గురైందని, మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, వంట గదిని నిర్మించాలని, ప్రయోగశాలలకి, గ్రంథాలయాల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి విద్యార్థులతో పాఠశాల సమస్యలపై చర్చించారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అధ్వాన్నంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యలపై స్పందించిన కమిషనర్ మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సెల్‌ఫోన్‌లో చర్చించారు.
విద్యార్థులకు సక్రమంగా భోజనాన్ని అందజేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వినోద్ తదితరులు పాల్గొన్నారు.
‘సురక్షిత నీటిని ప్రజలకు అందించండి’
పార్వతీపురం, జూలై 4: గ్రామాల్లో మంచినీటి సరఫరాపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సురక్షిత నీటిని అందించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన ఓవర్‌హెడ్‌టాంకుల్లో తప్పని సరిగాక్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన మంచినీటినే ప్రజలకు సరఫరా చేయాలన్నారు. రక్షిత పథకాలు లేని గ్రామాల్లోని గొట్టపుబావులు, నేలబావుల్లో నీటిని తాగే ప్రజలకు క్లోరినేషన్ బిల్లలు సరఫరా చేయాలని ఆదేశించారు. సురక్షితమైన మంచినీటిని అందించడం వల్ల 90శాతం వరకు సీజనల్ వ్యాధులు అదుపుచేయడానికి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ క్లోరినేషన్ కార్యక్రమానికి సంబంధించిన ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయతీరాజ్, ఎడీవోలు సంయుక్తంగా బాధ్యత వహించాలన్నారు. ప్రజల్లో క్లోరినేషన్ నీటి పట్ల అవగాహన ఏర్పడే విధంగా చూడాలన్నారు. మండలాల్లోనిర్వహించే విద్యాపక్షోత్సవాల వివరాలు అడిగితెలుసుకున్నారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులకు కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. అవసరమైతే ఇలాంటి గ్రామాలపై నిఘా పెట్టి ఘర్ణలకు పాల్పడే వారిపై ముందుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు.
ఆర్డీవో జె.వెంకటరావుతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మెహర్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి
బొబ్బిలి, జూలై 4: అధికారులంతా సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సక్రమంగా విధులు నిర్వహించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇప్పటి నుంచే వైద్యశాఖ అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలని జిల్లా డిఎంహెచ్‌ఒ స్వరాజ్యలక్ష్మిని ఆదేశించారు. గ్రామాల్లో అపారిశుద్ధ్యం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మరమ్మతులకు గురైన బోర్లును తక్షణమే బాగుచేయాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. చిన్న పిల్లలకు చక్కని పౌష్టికాహారాన్ని అందించాలని ఐ.సి.డి.ఎస్. అధికారులకు ఆదేశించారు. గ్రామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల పరిషత్ అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ చంద్రిక, ఎం.డి.ఒ. అరుంధతీదేవి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘మొలకెత్తని విత్తనాలకు నష్టపరిహారం’
పార్వతీపురం, జూలై 4: మొలకెత్తని 1001 వరి విత్తనాలకు రైతాంగానికి మళ్లీ వరి విత్తనాలతో అందించడంతో పాటు ఎపి సీడ్స్ సరఫరా చేసిన మొలకెత్తని విత్తనాలకు కూడా నష్టపరిహారంగా డబ్బులు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. డివిజన్‌లోని వివిధ మండలాల్లో పర్యటించిన వచ్చిన అనంతరం కలెక్టర్ గురువారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు హౌస్‌లో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మొలకెత్తని విత్తనాల విషయంలో వ్యవసాయశాఖ తగు చర్యలుతీసుకుంటుందని పేర్కొన్నారు. జిల్లాలో హౌసింగ్‌శాఖ ప్రతి మండలంలోను నెలకు 100నుండి 125వరకు ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు హాస్టళ్లు, పాఠశాలలతో పాటు ఐసిడి ఎస్ కేంద్రాలను కూడా సందర్శించి వారికి తగిన వైద్య సహకారం అందించాలని సూచించామన్నారు. నిర్మల్ భారత్ కింద మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా తాను పర్యిటించిన మండలాల్లో శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించినట్టు తెలిపారు. తాగునీటి సరఫరాను వీలైనంతవరకు 2014నాటికి 90శాతం వరకు రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసేందుకు గాను చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించామన్నారు. రక్షిత మంచినీరు లభించని ప్రాంతాల్లో నీటి కాచి చల్లార్చాలని కలెక్టర్ కోరారు. క్లోరినేషన్ వాటర్ అందించే చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు, ఇతర అధికారులకు ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు.
సోనా మసూరి విత్తనాలు లేవు!
గజపతినగరం, జూలై 4 : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన సోనామసూరి, 1001 వరి రకం విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. 1001 రకం వరి విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులు 6 వేల క్వింటాళ్ల వరకు సరఫరా చేసినప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో అందలేదు. సబ్ డివిజన్‌కు కేటాయించిన విత్తనాల కేటాయిపులుకు మించి ఇవ్వడంతో జిల్లా విత్తనాభివృద్ది సంస్థ అధికారులు విత్తనాలు సరఫరా చేయడానికి సుముఖంగా లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు పంపలేదు. ఇక సోనా మసూరి రకం విత్తనాలు గత రెండేళ్లుగా పంపిణీ చేయడం లేదు. 1001 రకం విత్తనాలు 670 రూపాయలకు, సోనా మసూరి విత్తనాలు 860 రూపాయలకు ప్రైవేటు డీలర్లు విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు 1001 రకం 525 రూపాయలు, సోనామసూరి 560 రూపాయలకు విక్రయించే వారు. ప్రస్తుతం విత్తనాలను అధిక ధరలకు ప్రైవేటు డీలర్ల వద్దకొనుగోలు చేసుకుంటున్నారు.
‘11 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటల పెంపకం’
బొబ్బిలి, జూలై 4: రాష్ట్రంలో ఉద్యానవనాలశాఖ ద్వారా 11లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని చేపట్టామని రాష్ట్ర ఉద్యానవనాల శాఖ జాయింట్ డైరెక్టర్ జె.డి. శ్రీవెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఉద్యానవన క్షేత్రంలో మామిడి అంట్లను గురువారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 1.37 లక్షల హెక్టార్లు, మైక్రో ఇరిగేషన్ ద్వారా 9.75 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. హెక్టార్‌కు 20వేల రూపాయల సబ్సీడి ఎరువులను రైతులకు అందిస్తున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు శతశాతం, మిగిలిన వారికి 90శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది లక్ష హెక్టార్లలో ఆయిల్‌పామ్‌తోపాటు వివిధ రకాలైన పంటలను సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఎ.పి. మైక్రో ఇరిగేషన్ రాష్ట్ర హార్టీకల్చర్, ఆయిల్‌పామ్, స్టేట్ ప్లాన్ ప్రాజెక్టు, తదితర పథకాల కింద అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గత ఏడాది మామిడి అంట్లుకట్టేందుకు వెయ్యి కోట్ల రూపాయలు వ్యయం చేశామని, ఈ ఏడాది 1270 కోట్లు వ్యయం చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా మామిడి, ఇతర పంటలకు 15వేల రూపాయలు రాయితీ అందిస్తున్నామన్నారు. నీలం తుఫాన్ కారణంగా రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు 33వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ మొత్తాలను ఆయా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమచేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటలు 25.98 లక్షల హెక్టార్లలో ఉన్నట్లు తెలిపారు. విజయనగరం, బొబ్బిలి ఉద్యానవన శాఖాధికారులు రహీమ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఎసిబికి చిక్కిన వీఆర్వో
వేపాడ, జూలై 4 : వేపాడ విఆర్వోగా పని చేస్తున్న గేదెల ఈశ్వరరావు 15వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం ఉదయం ఎల్.కోట మండలం సంతపేట దాబా వద్ద విఆర్వోకు లంచం ఇస్తుండగా ఎసిబి డిఎస్పీ రఘువీర్ తమ సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు. అనంతరం అతన్ని వల్లంపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈశ్వరరావును చినగుడిపాల ఇన్‌చార్జ్ విఆర్వోగా నియమించారు. అక్కడ విశాఖపట్నానికి చెందిన శీరం లక్ష్మణరావు 11 ఎకరాల 8 సెంట్లు భూమిని కొనుగోలు చేసుకొని పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని గత ఆగస్టులో తహశీల్ధార్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. దీనికి తహశీల్ధార్ విఆర్వోను పరిశీలించాలని ఆదేశించారు. దీంతో పట్టాదారు పాసుపుస్తకం కావాలంటే రూ. 15 వేల లంచం ఇస్తేనే ఇస్తానని చెప్పగా లక్ష్మణరావు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా వీఆర్వో లక్ష్మణరావును ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.