బిట్రగుంట, జూలై 5: మండల కేంద్రమైన బోగోలు పంచాయతీలోని స్టేట్‌బ్యాంక్ ఎటిఎంలో దొంగనోట్లు వస్తున్నట్లు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడు తన జీతం ఇటీవల ఎటిఎం నుండి డ్రాచేసి ప్రకాశం జిల్లా ఉలవపాళ్ల స్టేట్‌బ్యాంక్‌లో నగదు చెల్లించేందుకు వెళ్లగా ఆ నగదులో 1000 రూపాయల నోటు నకిలీదిగా గుర్తించి నోటుపై ఫేక్ రాసరాని వాపోయాడు. బ్యాంకులు ఏర్పాటుచేసిన ఎటిఎంల నుండి దొంగ నోట్లు వస్తుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయం తెలిసిన పలువురు జిల్లా బ్యాంకు అధికారులు గుర్తించి దొంగ నోట్లు రాకుండా చూడాలని ఖాతాదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోగుల వివరాలు ప్రతి రోజు తెలపాలి
* ఇన్‌చార్జ్ డిఎంహెచ్‌ఓ సుధాకర్ స్పష్టం
నెల్లూరుసిటీ, జూలై 5: జిల్లాలో గల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంతమంది రోగులకు వైద్య చేస్తున్నారో అందుకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు సాయంత్రం 4 గంటలలోపల తనకు తెలిపాలని జిల్లా ఇన్‌చార్జ్ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఆశ నోడల్ వర్కర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యం అందచేసిన రోగులను వివరాలను ఎప్పటికప్పుడు తెలిపాలన్నారు. అదే విధంగా 24 గంటల హాస్పిటల్లో వైద్య సేవలను అందించేందుకు డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. టాస్క్ఫోర్సు అధికారులు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తారని, వారు సూచించిన విధంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీన జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ముగ్గురు డాక్టర్లకు 10 వేల రూపాయల చొప్పున బహుమతులను అందచేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా డాక్టర్లకు తగిన అవార్డులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓడిటి డాక్టర్ విద్యాసాగర్, ఎన్‌సిడి ప్రాజెక్టు అధికారి డాక్టర్ సుధాకర్, డిఐఓ డాక్టర్ జయసింహ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.