Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మన గ్యాస్ మనకే!

$
0
0

హైదరాబాద్, జూలై 5: కృష్ణా గోదావరి బేసిన్ నుంచి రాష్ట్రానికి న్యాయంగా చెందాల్సిన సహజవాయువు వాటాను ప్రాధాన్యత ప్రకారంగా వచ్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఏపి ట్రాన్స్‌కో సిఎండిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఎఎస్ అధికారి సురేష్ చందా అన్నారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రుల బృందం ఈ అంశంపై సమావేశం కానుంది. సహజవాయువు, విద్యుత్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి ఈ నెల 8వ తేదీన ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. సహజవాయువుకేటాయింపులపై సమగ్రమైన వివరాలు రూపొందించాలని, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఒత్తిడి తెచ్చి గ్యాస్ సరఫరా అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా నివేదిక ఇవ్వాలని ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల గురించి నివేదిక ఇవ్వాలన్నారు. శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు, సహజవాయువు కొరత ఉందన్నారు. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో సమర్ధ ప్రాజెక్టు యాజమాన్య విధానం ద్వారా పూర్తి చేయాలన్నారు.
ఇంకా సత్వరమే విద్యుత్ అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. విద్యుత్ గ్రిడ్ సమతుల్యత పరిరక్షణకు క్రమశిక్షణ పాటించాలని, విద్యుత్ పంపిణీ నష్టాలను 17.4 శాతం కంటే దిగువకు తగ్గించాలని, ఐటి ద్వారా ఉత్తమసేవలు అందించాలని, ఆర్ధిక వనరులను సమర్ధంగా వినియోగించడం విధానాలను అమలు చేయాలన్నారు.
1985వ బ్యాచికి చెందిన ఐఎఎస్ అధికారి సురేష్ చందా ఈ సర్వీసులో చేరకముందు ఎన్టీపిసిలో ఇంజనీర్‌గా పనిచేశారు. తనను రాష్ట్రప్రభుత్వం ట్రాన్స్‌కో సిఎండిగా నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. డిస్కాంలు, ట్రాన్స్‌కో ఉద్యోగులు, ఇంజనీర్లు సమిష్టిగా విద్యుత్ రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సురేష్ చందా గుంటూరు, ఖమ్మం జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశానని, సైన్స్, టెక్నాలజీ శాఖ డైరెక్టర్‌గా, సాగునీటి శాఖ కార్యదర్శిగా, మాధ్యమిక విద్యాశాఖ కార్యదర్శి, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్, ఇ సేవ, ఐటి శాఖ కమిషనర్‌గా పనిచేసి అందరి మన్ననలు పొందారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ట్రాన్స్‌కో జాయింట్ ఎండిలు పి రమేష్, వై నాగిరెడ్డి, డిస్కాం సిఎండిలు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కార్తికేయ మిశ్రా, కెవిఎస్ రెడ్డి, డైరెక్టర్లు జి రామకృష్ణా రెడ్డి, ఎస్ సుబ్రహ్మణ్యం, మహమ్మద్ అన్వరుద్దీన్ తదితరులు హాజరయ్యారు.
మూడు విడతలకు
మూడు నోటిఫికేషన్లు ఇవ్వండి
పంచాయతీ ఎన్నికలపై బాబు లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: మూడు విడతలుగా జరిగే పంచాయితీ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ప్రచారం చేసుకునే సమయంలో అభ్యర్థుల మధ్య వివక్ష చూపినట్టు అవుతుందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికలకు విడివిడిగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. టిడిపి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, పి. రాములు, ప్రకాశ్‌గౌడ్‌లు ఎన్నికల కమిషన్ రమాకాంత్‌రెడ్డిని కలిసి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తొలి విడత ఎన్నికలకు పరిమితం చేసి, రెండవ, మూడవ విడత పోలింగ్ జరిగే ప్రాంతాల కోసం విడిగా సవరించిన నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. 2006లో ఇదే విధంగా ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు.
జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించండి: సిపిఐ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: జైళ్లలో జీవితఖైదీ శిక్షను అనుభవించడం వల్ల వారి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని, క్షమాభిక్ష ప్రసాదించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. వివిధ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న జీవితఖైదీల కుటుంబ సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జైళ్లలో ఏళ్లతరబడి మగ్గి పశ్చాత్తాపంతో సత్ప్రవర్తనను అలవరచుకుని నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని, శిక్షలు పడటంతో వారి కుటుంబ సభ్యులు సామాజికంగా, ఆర్ధికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని , కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు తరచూ వస్తున్నాయని, ఖైదీల తరఫున కె. సంపూర్ణ, కె. ఎస్తేరమ్మ, పోచయ్య, కె. పురుషోత్తం, భిక్యా, తిరుపతయ్య తదితరులు నారాయణను కోరారు. 2004 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షమాబిక్ష జీవో -196 ఇచ్చిందని, దానివల్ల చాలా మంది విడుదలయ్యారని, కనీసం ఏడేళ్ళ శిక్ష వాస్తవ శిక్ష రెమిషన్, 10 ఏళ్లు జీవిత ఖైదీలను విడుదల చేయాలని వారు కోరారు.
పిజి తొలి దశ కౌనె్సలింగ్ పూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ఉస్మానియా యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, పాలమూరు వర్శిటీల్లో పిజి అడ్మిషన్ల తొలి దశ పూర్తయినట్టు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఇంగ్లీషు, ఎకనామిక్స్, ఉర్దూ, థియేటర్ ఆర్ట్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, లింగ్విస్టిక్స్, మరాఠీ, పర్షియన్, కన్నడ భాషల్లో కౌనె్సలింగ్ పూర్తయిందన్నారు. కౌనె్సలింగ్‌లో ప్రభుత్వ నిబంధనలను పాటించామని, లోపాలకు తావులేకుండా చర్యలు చేపట్టామని వర్శిటీ అధికారులు పేర్కొన్నారు.

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంతరెడ్డి శుక్రవారం ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వ్యవహరించాల్సిన తీరు, మార్గదర్శకాలను వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి వివాదాలు, గొడవలు తలెత్తకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కాగా రాష్ట్ర డిజిపి వి దినేష్ రెడ్డి ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డిని కలిసి పంచాయతీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తీసుకున్న చర్యలను వివరించారు. ఒక లక్ష మంది పోలీసులను పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించనున్నట్లు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన బలగాలను మోహరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

పోలీసులకు శంకర్‌రావు ఝలక్

అసలు దస్తావేజులు వారే ఎత్తుకెళ్ళారు
పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి
వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: వివిధ కేసులపై నాన్ బెయిలబుల్ వారంట్‌తో ఎమ్మెల్యే శంకర్‌రావును ఏ క్షణమైనా అరెస్టు చేయాలని యోచిస్తున్న పోలీసులకు శంకర్‌రావు ఝలక్ ఇచ్చారు. గురువారం కేర్ ఆసుపత్రి నుంచి శంకర్‌రావు డిశ్చార్జి అయ్యారు. గత రెండు రోజులుగా ఇరువైపులా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుసుకున్న శంకర్‌రావు నేరుగా కోర్టులో పోలీసులపై పిటిషన్ దాఖలు చేసి ఆశ్చర్యపర్చారు. వివిధ అంశాలకు చెందిన కేసుల దస్తావేజులను భద్రంగా దాచిపెట్టానని అయితే వాటిని పోలీసులే ఎత్తుకెళ్ళారని చెప్పారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వీల్‌చైర్‌లో శంకర్‌రావు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ తాను వివిధ అంశాలపై దర్యాప్తు చేయాలని ఎసిబితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పలుమార్లు విన్నవించుకున్నానని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం, పోలీసులపైనా తాను ఉద్యమం చేస్తున్నానని చెప్పారు. అయితే అందుకు ప్రభుత్వం, పోలీసులు సహకరించలేదని, అందుచేత కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కోర్టులో న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే నెలలు గడచినప్పటికీ దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదన్నారు. తన వద్ద ఉన్న అసలు దస్తావేజులను పోలీసులు ఎత్తుకెళ్ళారని ఆయన ఆరోపించారు. దస్తావేజులను తిరిగి ఇవ్వాలని తాను నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. అయితే పోలీసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. సమాధానం రాకపోగా తనపై కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. డిజిపిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుతం దస్తావేజులు పోలీసుల వద్ద ఉన్నందున తనకు నిరూపించడానికి అవకాశం లేదన్నారు. కనీసం దస్తావేజుల జిరాక్స్ కాపీలు ఇవ్వాలని కోరినప్పటికీ స్పందనలేదన్నారు. రెడ్ల కులస్తులకు చెందిన భూములు డిజిపి బినామీ ఆస్తులని తాను ఎన్నడూ చెప్పలేదన్నారు. తాను కేవలం డిజిపి కుటుంబానికి చెందిన ఆస్తులు బయటపెట్టాలని డిమాండ్ చేశానన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరులు అక్రమంగా కలప, ఎర్రచందనం అమ్ముకుంటున్నారని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తనకు అక్రమాస్తులు ఉన్నట్లు నిరూపించాలని డిజిపి దినేష్‌రెడ్డి చాలెంజ్ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా అందుకు సమాధానం దాటవేశారు. అన్ని విషయాలపై కోర్టులో సమాధానం చెబుతానని ఆయన చెప్పారు.

నేడు విద్యాసంస్థల రాష్ట్ర బంద్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: పాఠశాలల్లోనూ, జూనియర్ కాలేజీల్లో సౌకర్యాలను పెంచాలని, ప్రభుత్వం ప్రకటించిన పథకాలను పటిష్టంగా అమలుచేయాలని, ప్రధానంగా విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలను, దుస్తులను వెంటనే ఇవ్వాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ సహా ఐదు విద్యార్ధి, యువజన సంఘాలు శనివారం నాడు రాష్టవ్య్రాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐడిఎస్‌ఓ, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐపిఎస్‌యు సంఘాలు ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నూర్ మహ్మద్ చెప్పారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష టీచర్ పోస్టులను, 930 ఎంఇఓ, 113 డిప్యూటీ డిఇఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మోడల్ స్కూళ్లు వెంటనే ప్రారంభించాలని, విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ హాస్టళ్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, ప్రతి ప్రభుత్వ జూనియర్ కాలేజీ అభివృద్ధికి కోటి రూపాయలు చొప్పున కేటాయించాలని అన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలను కట్టడి చేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహిస్తున్నామని, దానిని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పాఠశాలలు ప్రారంభించి 26 రోజులు గడచినా, ఇంత వరకూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, 30 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించారని అన్నారు. మిగిలినవి ఆగస్టుకు కూడా అందించలేమని నిస్సిగ్గుగా చెబుతున్నారని మహమ్మద్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని, ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని, దానికి అనుగుణంగానే 39, 40 జీవోలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారని, లక్షలాది రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలుచేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదని, వారి వ్యాపారానికి ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తమిళనాడులో ఉన్న మాదిరి పటిష్టమైన చట్టం చేయాలని ఆయన కోరారు. కొన్ని పాఠశాలల్లో భవనాల పరిస్థితి దారుణంగా ఉందని, అవి ఎప్పుడు కూలుతాయో తెలియడం లేదని అన్నారు. మరో పక్క విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే బంద్ పాటిస్తున్నట్టు పేర్కొన్నారు.

కలిసి పనిచేయడం కష్టమే

అయినా కలిసి రావాలన్న బి. వి. రాఘవులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ప్రస్తుత సంక్షుభిత సమయంలో వామపక్ష పార్టీలు కలిసి పనిచేయడం కష్టంగానే ఉందని, అయినా ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరస్పర పోటీలను విడనాడి ఉమ్మడిగా చర్చించుకుని వామపక్ష బలాన్ని చూపాల్సి ఉందని అన్నారు. ఎంసిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్జీత్‌సింగ్ లాయల్‌పురి సంతాపసభను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంసిపిఐ యు పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.డి గౌస్ అధ్యక్షత వహించగా, సిపిఐ జాతీయ సమితి సభ్యుడు చాడా వెంకటరెడ్డి, ఎంసిపిఐ పోలిట్‌బ్యూరో సభ్యుడు మర్రెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయకుమార్, న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.వి. కృష్ణ, లిబరేషన్ కమిటీ సభ్యుడు కె. రణధీర్, ఎస్‌యుసిఐ సభ్యుడు సిహెచ్ మురహరి, ఎంఎల్ కమిటీ సభ్యుడు జి. జానకిరాములు, ఫార్వర్డుబ్లాక్ సభ్యుడు కె. దయానంద్, వామపక్ష వేదిక కన్వీనర్ వి. రాంప్రసాద్, కాటం నాగభూషణం తదితరులు పాల్గొని లాయక్‌పురి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కట్టుబడి ఉన్నవారే నిఖార్సైన కమ్యూనిస్టులు అవుతారని, మనసులో ఒకటి ఉంచుకుని మరొకటి మాట్లాడేవారిని కమ్యూనిస్టులుగా చూడలేమని రాఘవులు పేర్కొన్నారు. లాయక్‌పురి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, పుస్తకాలకు ప్రచారానికే పరిమితం కాకుండా, కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడని చెప్పారు. వామపక్షాలు వివిధ విషయాలపై ఉమ్మడిగా పనిచేయలేకపోతున్నాయని, సరైన ప్రాతిపదిక ఏర్పడటం లేదని, వౌలిక కార్యక్రమాలపై విభేదాలు ఉన్నప్పుడు కార్యక్రమాల్లో ఏది మంచిదో చూసుకోవల్సి ఉందని అన్నారు.
గంటి హత్య కిరాతకం
గంటి ప్రసాదం హత్య కిరాతకమని సిపిఎం రాష్టక్రార్యదర్శి బి. వి. రాఘవులు అన్నారు. నెల్లూరులో పట్టపగలు ఉద్యమ కార్యకర్తను హత్య చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని తెలుపుతోందని అన్నారు.

ఉపాధి హామీ వివరాలను పొందుపర్చకపోతే పెనాల్టీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం శ్రమ శక్తి సంఘాలను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లు పనుల జాబితాను, పనులు చేసే వారి జాబితా వివరాలను నిర్దేశించిన విధంగా వారం లోపల పొందుపర్చకపోతే నెలవారీ వేతనంలో 25శాతం కోత విధించే విధంగా పెనాల్టీ విధిస్తారు. ఈ వివరాలు పొందుపర్చని పక్షంలో ఐటి సిస్టమ్ ద్వారా అసిస్టెంట్ ప్రొగ్రాం ఆఫీసర్ ఆటోమాటిక్‌గా రికవరీ చేస్తారు. కాగా సరైన కారణాలు చూపితే ఏపివో పెనాల్టీని విధించకుండా ఈ వివరాలను ప్రాజెక్టు డైరెక్టర్‌కు నివేదించాల్సి ఉంటుంది. కాగా ప్రాజెక్టు డైరెక్టర్ ఆమోదం లేని పక్షంలో మరుసటి నెలలో ఫీల్ట్ అసిస్టెంట్స్ వేతనం నుంచి 25 శాతం సొమ్మును పెనాల్టీ రూపంలో మినహాయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
టిఆర్‌ఎస్ కార్యవర్గ భేటీ వాయిదా
ఢిల్లీ పరిణామాల్లో స్పష్టత వచ్చాకే సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం వాయిదా పడింది. ఈ నెల 7వ తేదీన సమావేశం కానున్న రాష్ట్ర కార్యవర్గాన్ని వాయిదా వేసినట్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల వ్యూహంపై శుక్ర, శనివారం జిల్లాల వారీగా సమీక్షలు జరిపి, ఆ మరుసటి రోజు ఆదివారం రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే ఢిల్లీస్థాయిలో తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన తర్వాతనే భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని తాజాగా టిఆర్‌ఎస్ యోచిస్తోన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ కారణంగానే రాష్ట్ర కార్యవర్గాన్ని వాయిదా వేశారని తెలిసింది.

ఓటర్లను ప్రలోభపరిచే హామీలపై

‘సుప్రీం’ ఆదేశాలను స్వాగతించిన లోక్‌సత్తా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపరిచే విధంగా వాగ్దానాలు చేసే రాజకీయ పార్టీల విధానాలపై నిఘావేయాలని, ఈ తరహా చర్యలను నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు లోక్‌సత్తా ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ఊదరగొట్టే హామీల వల్ల దారిద్య్రం తొలగదన్నారు. రైతులకు సబ్సిడీపై విద్యుత్, పేదలకు సబ్సిడీపై బియ్యం, ఇంకా ఇళ్లు లేని వారి ఇళ్లు కట్టిస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వవచ్చన్నారు. కాని ఉచితంగా టీవీలు, గ్రైండర్లు, బంగారు హారాలు ఇస్తామంటూ కొన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం అనైతికమన్నారు. రాజకీయ పార్టీలు అర్ధంపర్ధంలేని హామీలను ఇస్తుంటే ఇక రానున్న రోజుల్లో ప్రతి ఓటరుకు ఉచితంగా మద్యం బాటిళ్లను సరఫరా చేస్తామని కూడా హామీ ఇచ్చేందుకు ప్రస్తుత రాజకీయ పార్టీలనేతలు వెనకాడరన్నారు. ఓటర్లను ప్రలోభపరిచే విధంగా ఉన్న హామీలకు అడ్డుకట్టవేసేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా తీసుకురావాలని సుప్రీం కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనైతిక విధానాలకు అద్దంపట్టే ఎన్నికల హామీలు చేసే రాజకీయ పార్టీలకు కళ్లెం వేసేందుకు ఎన్నికల సంఘానికి రాజ్యాంగంలోని 324వ అధికరణ విశేషాధికారాలు కల్పిస్తోందని వారు చెప్పారు.

తెలంగాణవాదాన్ని చాటండి

పంచాయతీ ఎన్నికల వ్యూహంపై పార్టీ జిల్లా ఇన్‌చార్జీలకు టిఆర్‌ఎస్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని బలంగా చాటాలని పార్టీ జిల్లా బాధ్యులకు టిఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణవాదం ఎంత బలంగా ఉందో చాటడంతో పాటు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు కనువిప్పు కలిగేవిధంగా ఫలితాలు సాధించాలని సూచించింది. పంచాయతీ ఎన్నికల వ్యూహంపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు, జిల్లా కన్వీనర్లతో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం ఇన్‌చార్జి కడియం శ్రీహరి, పార్టీ జాతీయ వ్యవహారాల కమిటి సెక్రటరీ జనరల్ కె కేశవరావు పార్టీ జిల్లా బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు నేతలు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందనీ, దాని నుంచి బయట పడేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసపూరితంగా నమ్మించేందుకు ప్రయత్నిస్తోందని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణవాదం గతంలో మాదిరిగా బలంగా లేదని తెలంగాణ వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారనీ, వీరి వాదనను తప్పని నిరూపించేందుకు పంచాయతీ ఎన్నికలను అస్త్రంగా ఉపయోగించుకోవాలని కడియం శ్రీహరి సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భవించిందనీ, యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే స్వాగతిస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేసారు. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా ఇంకా నానే్చందుకు ప్రయత్నిస్తే కాంగ్రెసు పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు పంచాయతీ ఎన్నికలను ఆయుధంగా ఎంచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌కు మద్దతు ఇచ్చే పార్టీలు, భావ సారూప్యం కలిగిన సంస్థలను తమ పార్టీ మిత్రులుగానే భావిస్తుందని కడియం తెలిపారు. సంక్షేమ పథకాలను కొనసాగించాలని కానీ, వాటిని కేవలం పార్టీ ప్రచారం కోసమే వినియోగించుకోవడం తప్పని కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ అమృత హస్తం, బంగారు తల్లి పథకాలకు ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫోటోలను ఉపయోగించుకోవడం తీవ్ర అభ్యంతరకరమని కడియం తప్పుపట్టారు. సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయకుండా, కాంగ్రెసు కేవలం తమ పార్టీ నేతల వ్యక్తిగత ప్రచారం కోసం ఉపయోగించుకోవడం తప్పనీ కడియం విమర్శించారు.
ఈ వ్యవహరంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కడియం శ్రీహరి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని చెప్పి, నోటిఫికేషన్లను మాత్రం ఒకేసారి విడుదల చేయడం తప్పని ఆయన అన్నారు. విడతల వారీగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పార్టీ తరఫున ఫిర్యాదు చేయనున్నట్టు కడియం శ్రీహరి తెలిపారు. పంచాయతీ ఎన్నికల వ్యూహంపై జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలో మొదటి రోజు పార్టీ బలాబలాలను అంచనా వేశామనీ, దానికి అనుగుణంగా పార్టీ వ్యూహాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కమిటీలతో శనివారం సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు.

అది చీకటి ఒప్పందం
ఎన్‌ఎంయు ధ్వజం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ఆర్టీసి యాజమాన్యంతో ఎంప్లారుూస్ యూనియన్, టిఎంయు కుదుర్చుకున్న ఒప్పందాలు చీకటి ఒప్పందాలని, కార్మికులను దగా చేశారని ఆర్టీసి నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వరరావు విమర్శించారు. ఒప్పంద ప్రతిలో కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, వేతన సవరణ తదితర అంశాలపైన స్పష్టత లేదన్నారు. తాము కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గుర్తింపు సంఘాలు డిమాండ్ల సాధనకు ఇచ్చిన సమ్మె పిలుపుకు మద్దతు ఇచ్చామన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టీసి గుర్తింపు సంఘాలు ఎంప్లారుూస్ యూనియన్, టిఎంయు, ఆర్టీసి యాజమాన్యానికి ఒప్పందం కుదిరింది. దీంతో ఆర్టీసికి సమ్మె గండం తప్పింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 17,287 మంది డ్రైవర్లు, కండెక్టర్ల సర్వీసులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు, ఒప్పందంపై సంతకాలు పెట్టినట్లు కార్మిక సంఘాల నేతలు పద్మాకర్, చంద్రశేఖర రెడ్డి, జిడి ప్రసాదరెడ్డి రాజేంద్రప్రసాద్, టిఎంయు నేతలు థామస్ రెడ్డి తదితరులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 8644 మందిని, నవంబర్‌లో 875 మందిని, వచ్చే ఏడాది మే నెలలో 3447 మందిని, వచ్చే ఏడాది సెప్టెంబర్ లో 4322 మంది కాంట్రాక్టు సిబ్బంది సేవలను క్రమబద్ధీకరిస్తామని యాజమాన్యం పేర్కొన్నట్లు వారు చెప్పారు. రెగ్యులర్ కార్మికులకు అమలు చేసే స్ట్ఫా రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీంను కూడా కాంట్రాక్టు సిబ్బందికి వర్తింప చేస్తామిన హామీ ఇచ్చారు. కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింప చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతన సవరణను అమలుచేయడానికి ఒప్పందం కుదిరినట్లు వారు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేస్తామని యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని వారు చెప్పారు.

ప్రాధాన్యతా పరంగా అవసరమైన చర్యలు సకాలంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి ట్రాన్స్‌కో సిఎండిగా బాధ్యతలు చేపట్టిన సురేష్ చందా
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>