ఇందుకూరుపేట, జూలై 5: అన్నదమ్ముల ఘర్షణ సంఘటనలో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్టు ఇందుకూరుపేట ఎస్‌ఐ శేఖరబాబుబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన నెల్లూరు సుధాకర్‌పై ఈనెల 3న నెల్లూరు గోపాలయ్య, అతని భార్య రాజేశ్వరమ్మ దాడి చేసి గాయపర్చారు. అదే విధంగా నెల్లూరు గోపాలయ్యపై సుధాకర్, నాగేశ్వరరావులు దాడి చేసి గాయపర్చారు. వీరువురికి మామిడితోటలోని కాయలు కోసే విషయంలో వివాదం జరిగింది. కౌంటర్ కేసుగా నమోదు చేసి నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.
తన భర్తని ప్రభుత్వమే హత్య చేసింది
నెల్లూరు, జూలై 5: మాజీ మావోయిస్టు నేత, అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటి ప్రసాదంను ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా హత్య చేయించిందని హతుడు భార్య కామేశ్వరమ్మ తీవ్రస్థాయిలో ఆరోపించారు. నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాదం గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆసుపత్రికి ఆయన భార్య, కుమారుడు, పలువురు విరసం నేతలు వచ్చారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలో ఉన్న వారిని జన స్రవంతిలోకి రావాల్సిందిగా ప్రభుత్వాలు కోరడం, వారి మాటలు నమ్మి ఉద్యమకారులు ప్రజల్లోకి రావడం, వారిని అదును చూసి ప్రభుత్వాలే మట్టుపెట్టడం పరిపాటిగా మారిపోయాయన్నారు. అందులోభాగంగానే తన భర్తను ప్రభుత్వం పథకం ప్రకారం హత్య చేయించిందని ఆరోపించారు. తన భర్తకి ఎవరితోను శత్రుత్వం లేదని, కేవలం ప్రభుత్వం మాత్రమే తమకు శత్రువు అని, వారి పన్నాగమే ఈ హత్యకు కారణమన్నారు. ప్రభుత్వం చేస్తున్న దమన నీతికి ప్రజలు తగు రీతిలో బుద్ధిచెప్తారని హెచ్చరించారు. అన్యాయం చేసే వారి పట్ల ఎదురుతిరిగి నిలబడటమే తన భర్త చేసిన తప్పు అని, అందుకే ప్రభుత్వం కిరాయి మూకలతో ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంపై పలువురు విరసం నేతలు, అభిమానులు వచ్చి ఎర్రజెండా కప్పి లాల్‌సలాం చేశారు. మృతదేహాన్ని చూసిన పలువురు విరసం నేతలు, అభిమానులు కంటితడి పెట్టారు. మద్రాసులో సాఫ్ట్‌వేర్ ) ఉద్యోగం చేస్తున్న కుమారుడు సుధీర్ కూడా తన తండ్రికి లాల్‌సలాం ద్వారా జోహార్లు అర్పించారు. అనంతరం మృతదేహాన్ని తమ స్వగ్రామమైన బొబ్బిలికి అంబులెన్స్‌లో తరలించారు. ఈ కార్యక్రమం మొత్తం పోలీసుల కనుసన్నల్లో జరిగింది. ప్రసాదం మృతదేహాన్ని సందర్శించుకోవడానికి, చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కర్ని పోలీసులు వీడియో కెమెరాతో బంధించారు. నెల్లూరునగర, రూరల్ డిఎస్పీలు వెంకటనాధ్‌రెడ్డి, బాల వెంకటేశ్వరరావు, సిఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, రామారావు, కెవి రత్నం, సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు బాబురావు, మల్లికార్జున, వెంకట్రావులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అర్ధరాత్రి ప్రసాదం చనిపోయిన తర్వాత ఆ వార్తను బయటకు వెల్లడించడానికి నారాయణ వైద్యులు కూడా కొంత భయపడ్డారని సమాచారం.
ంచి వరంగల్‌కు మృతిచెందిన మాజీ మావోయిస్ట్ ప్రసాద్ మృతదేహాన్ని తరలిస్తున్న విరసం నాయకులు
అక్రమంగా తరలిస్తున్న 247 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
మనుబోలు,జూలై 5 : అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం లారీబోల్తా పడడంతో విషయం బయట పడింది. వివరాల మేరకు గురువారం రాత్రి పొదలూకూరు నుండి పోర్టుకు రేషను బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీ మండల పరిధిలో వడ్లపూడి గ్రామం మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న బియ్యం పొదల్లో పడ్డాయి. ఈ విషయాన్ని వడ్లపూడి విఅర్‌వో రామచంద్రయ్యకు గ్రామస్థులు తెలియజేయడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే లారీకి సంబంధించినవారు క్రేన్ సహయంతో లారీని బయటకు లాగి తప్పించుకోవడానికి ప్రయత్నించగా లారీ బ్యాటరీ పాడయిపోయి, డీజల్ ట్యాంకు పగిలి డీజల్ పూర్తిగా పోవడంతో లారీని వదిలి పారిపోయారు. బోల్తాపడిన బియ్యాన్ని కొద్ది మంది ఇళ్లకు తరలించడానికి ప్రయత్నించగా విఅర్‌వో రామచంద్రయ్య అడ్డుకుని విషయాన్ని తహశీల్దారు వెంకటనారాయణమ్మకు తెలియజేశారు. తహశీల్దార్ సంఘటనా స్థలాన్ని పరీశిలించి పౌరసరఫరా అధికారులకు తెలియజేయడంతో జిల్లా పౌరసరఫరా అధికారి ఉమామహేశ్వర రావు తన సిబ్బందితో వచ్చి 247 బస్తాల బియ్యాన్ని సీజ్‌చేసి, పొదలూకూరుకు తరలించి లారీని మనుబోలు పోలీసులకు స్వాధీనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎఎస్‌ఓ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.
జగనే మగధీరుడు
నెల్లూరు, జూలై 5: తమ పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి మాత్రమే రాజకీయాల్లో సిసలైన మగధీరుడంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర నేత, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలో రానున్న పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు వైఎస్‌ఆర్‌సి జిల్లా విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ శ్రేణులనుద్దేశించి పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ అంశాలపై విశదీకరించారు. క్రమశిక్షణతో, శ్రద్ధగా వ్యవహరిస్తూ సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం ద్వారా విజయానికి పరిస్థితులు అనుకూలపరచుకోవాలంటూ కార్యకర్తలకు ఉద్బోధిందించారు. ఇదిలాఉంటే ఉత్తరాఖాండ్ వరదల్లో చిక్కుకున్న చార్‌థామ్ యాత్రికుల్ని రక్షించడంలో చంద్రబాబునాయుడు మగధీరుడిగా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం సాగించడం, ఫ్లెక్స్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవడాన్ని మేకపాటి ఎద్దేవ చేశారు. ఉత్తరాఖాండ్ వరదల్లో చిక్కుకున్న ప్రయాణికుల్ని రక్షించడంలో దేశ సైన్యం మాత్రమే అమోఘమైన పాత్ర పోషించిందన్నారు. దేశం అంతా సైన్యం చేసిన అపార కృషికి కృతజ్ఞతులై ఉండాలన్నారు. అయితే చార్‌ధామ్ ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న తరువాత వారిని నాలుగు విమానాల్లో తరలించినంత మాత్రాన చంద్రబాబు మగధీరుడై పోతారా అంటూ మేకపాటి ప్రశ్నించారు. ఆయనకు ఆర్థికంగా వెసులుబాటు ఉండటం వలనే విమానం ఏర్పాటు చేశాడంటూ కూడా మేకపాటి పేర్కొన్నారు. ఏదేమైనా నలభై ఏళ్ల వయస్సులోనే జన రంజకమైన పార్టీ ఏర్పాటు చేసి అందరి అభిమానాన్ని చూరగొంటున్న జగన్మోహనరెడ్డి మాత్రమే రాష్ట్ర రాజకీయ రంగంలో మగధీరుడంటూ మేకపాటి ఉద్ఘాటించారు. వైఎస్‌ఆర్‌సి కేడర్‌లో ఏమైనా చిన్నపాటి కలహాలున్నా వాటిని పక్కన పెట్టి త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పాటుపడాలన్నారు. పంచాయతీ ఎన్నికలు జగన్ భవిష్యత్‌కు ఎంతో కీలకం కానున్నాయని మేకపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొరపాటున ఈ పంచాయతీ పోరులో వైఎస్‌ఆర్‌సి మద్దతుదారులు ఓటమి పాలైతే ఇదే అవకాశంగా భావించి వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి పార్టీపై దుష్ప్రచారం ఉద్ధృతం చేసే శక్తులు బలపడతాయని కార్యకర్తలనుద్దేశించి హెచ్చరించారు.
అంతకుముందు నెల్లూరు ఎంపిగా తాను చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేకపోయినా జగన్‌పై ఉన్న జనాభిమానమే రెండో పర్యాయం ఘన విజయానికి బాటలు వేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు కుమ్మక్కై రాజకీయ విన్యాసాలు చేస్తున్నాయన్నారు. రెండున్నర ఏళ్ల క్రితం నిర్వహించిన ఎంఎల్‌సి ఎన్నికల నుంచి ఇటీవల చేపట్టిన సహకార పోరు వరకు ఆ పార్టీల మధ్య కొనసాగిన అనైతిక సర్దుబాటు తేటతెల్లమవుతుందన్నారు. కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం అన్నింటా విఫలైమందన్నారు. యూపిఏ-1 పరిపాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, కుంభకోణాలన్నీ ఇప్పుడిప్పుడు వరుసగా బహిర్గతమవుతున్నాయని విమర్శించారు.