ఒంగోలు, జూలై 5: జిల్లాలో మళ్ళీ విద్యుత్‌కోతలు ప్రారంభం కావటంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలోను తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీనికితోడు విద్యుత్ ఉత్పత్తి ఘనణీయంగా తగ్గిపోవటంతోనే ఈపరిస్థితులు ఏర్పడ్డాయని ట్రాన్స్‌కో అధికారులు సెలవిస్తున్నారు. జిల్లాకు నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం రోజుకు 310 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుండటంతో భారీగా విద్యుత్‌కోతలను విధిస్తున్నారు. ప్రధానంగా రామగుండం, కొత్తగూడెం థర్మల్‌పవర్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో కూడా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మూడుగంటలపాటు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలు, గ్రామాల్లో 12గంటల పాటు కోతలను అధికారికంగా విధిస్తున్నారు. ఆ ఇచ్చే సరఫరా కూడా మూడు నుండి నాలుగు సార్లు ఇస్తుండటంతో రైతులు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కోస్తాతీరంలో వందలాది ఎకరాల్లో వేరుశనగపంటను సాగుచేశారు. వారందరూ రాత్రివేళల్లో పొలాల్లోనే జాగరణచేస్తూ పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికార కోతలు ఈవిధంగా ఉంటే అనధికార కోతలను కూడా భారీగావిధిస్తున్నారు. ఎమర్జెన్సీలోడ్ రిలీఫ్‌పేరుతో విద్యుత్‌కోతలను విధిస్తూ జిల్లాప్రజలను అంధకారంలోకి నెడుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లో
ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
విద్యుత్‌కోతల కారణంగా ఆక్వా, పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వారంగానికి కూడా సక్రమంగా విద్యుత్ సరఫరాకాకపోవటంతో ఆయిల్ ఇంజన్లపై ఆధారపడి సాగుచేయాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్, ఇతర పరిశ్రమల యజమానులు కూడా ఈ విద్యుత్‌కోతలతో తీవ్రంగా నష్టపోతున్నారు. మొత్తంమీద రాష్ట్రప్రభుత్వం విధించే విద్యుత్‌కోతలతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో మళ్ళీ విద్యుత్‌కోతలు ప్రారంభం కావటంతో
english title:
power cut
Date:
Saturday, July 6, 2013