‘‘నేను ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపరేషన్ పాయింట్‌లో మీ సలహాలు కావాలి’’ అంటూ ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది.
‘‘నేను ఐఏఎస్‌ను కాదమ్మా! ఏం చెప్పగలను’’ అన్నాను.
‘‘అదేంటి మాస్టర్! అలా అంటారు. సివిల్స్ కోచింగ్ సెంటర్లలోని లెక్చరర్లందరూ ఐఏఎస్‌లా చెప్పండి’’ అంది.
‘‘అవును.. ఆ అకడమిక్ స్ట్ఫా ఐఏఎస్ ప్రొఫెషనల్స్ కాదు కదా’’ అనిపించింది.
‘‘ఎ, బి, సి, డిలు రాయించిన టీచర్స్ లెక్చరర్స్‌గా పనికిరాకపోవచ్చు. లెక్చరర్స్ అందరూ రిసెర్చి గైడెన్స్ ఇవ్వలేకపోవచ్చు. కోచింగ్ సెంటర్స్ స్ట్ఫా కలెక్టర్లు కాకపోవచ్చు. మంచి రాంక్‌లతో ఐఏఎస్ అనిపించుకున్న వాళ్లందరూ టీచింగ్‌కి పనికిరాకపోవచ్చు. అయినా ఎవరి ప్రత్యేకత వాళ్లదే. ఎవరి మెళకువలు వాళ్లవే. ఎవరి క్వాలిటీస్ వాళ్లవే. ఎవరి స్టైల్ వాళ్ళదే. అందరూ అన్నిటా నిష్ణాతులు కారు కాలేరు’’ అంది.
‘‘యస్. ఈ అమ్మాయి పేరు పక్కన ఐఏఎస్ గారంటీ’’ అనుకున్నాను. ఆ అమ్మాయి మాటలు వింటుంటే A man who wants to lead the orchestra must turn his back on the crowd అన్న మాక్స్ లుకాడో మాటలు మెదడులో తళుక్కుమన్నాయి. ఈ మాటలు గుర్తొచ్చినపుడల్లా రకరకాల ఆలోచనలు తరుముకొస్తుంటాయి. కొత్త కొత్త అర్థాలు స్ఫురిస్తుంటాయి. జీవితంలోని అనేక కోణాలు ఆవిష్కృతమవుతుంటాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే టీచర్ బ్లాక్ బోర్డుపై దృష్టి పెట్టాల్సిందే. టీచర్ బాక్‌ను చూస్తారో, బ్లాక్‌బోర్డును చూస్తారో- అది విద్యార్థుల తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ తత్వాన్ని బట్టే విద్యార్థుల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి.
ప్రేక్షకులకు బాక్‌ను అప్పగించి స్టేజిపైన రేఖలా అటూ ఇటూ కదిలే వ్యక్తి ఆర్కెస్ట్రాను లీడ్ చేస్తుంటాడు. ఇరవై ముప్ఫై మంది వాద్యకారులూ తమ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై చేతులు కదుపుతున్నా దృష్టంతా ఆ లీడ్ చేస్తున్న వ్యక్తిపైనే. ఆ లీడ్ చేస్తున్న వ్యక్తే లీడర్. మనకు వీనుల విందు చేస్తున్న ఆ స్వర సముదాయమంతా ఆతడి సృజనే!
సృజించటం తెలిసినవారు తెరముందుకు రాకపోయినా వౌనంగానే ఎదిగిపోతుంటారు. తమ లీడర్‌షిప్‌లో రోల్ మోడల్స్ అయిపోతుంటారు. ఒక లీడర్ ప్రభావంతో వందమంది తయారవుతారు. ఆ వందమందిలో కొన్ని వేలమంది లీడర్స్ అవుతారు- లీడ్ చేయగలిగితే! కాబట్టి ‘లీడ్’ చేసేవాళ్ళే ‘లీడర్స్’.
నా ఆలోచనలను పసిగట్టిన దానిలా- నా భావాలను చదివిన దానిలా- ‘‘ఇప్పటికైనా నన్ను లీడ్ చేస్తారా’’ అంది.
ఎక్కడ ఏ విద్వత్తు ఉందో, ఎవరిలో ఏ శక్తి దాగివుందో దాన్ని అందుకోవగలగటం ఎదగాలనుకున్నవారి తత్వం కావాలి- అనే విజయ రహస్యం ఆ అమ్మాయి కళ్లలో కదలాడుతుంటే- ఆ అమ్మాయి అందుకోగలిగేటట్టు కొన్ని సూచనలు చేస్తుంటే- అవే సక్సెస్ సీక్రెట్స్ అన్నట్లు నోట్ చేసుకుంటూ పోతుంది.
======
మార్కెట్లో కొనుక్కోవడానికి సక్సెస్ -వస్తువు కాదు. కష్టపడి సాధించాల్సిన క్రియ. అందుకు ప్రయత్నం సాగాలి. ప్రయత్నం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. వాటిని ఆచరణలో పెట్టేందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. అవి -వ్యక్తిగత ప్రతిభకు గీటురాళ్లు కావాలి. విజయ సాధనలో ఏమైనా అనుమానాలుంటే పోస్టుకార్డు రాయొచ్చు. లేదా ఈ-మెయిల్ పంపొచ్చు. వాటికి రచయిత సమాధానాలిస్తారు.
ఎడిటర్, (విజయం) యువ, ఆంధ్రభూమి,
36, సరోజిని దేవి రోడ్, సికిద్రాబాద్