‘‘సక్సెస్ అనే పదాన్ని ప్రతి ఒక్కరి నోటా వింటుంటాం. అసలు సక్సెస్‌కు కొలమానం ఏమిటి? మన సక్సెస్‌ను మనం అంచనా వెయ్యాలంటే సక్సెస్ స్టాండర్డ్ తెలియాలి కదా!’’- చెన్నయ్ నుండి శివప్రసాద్ ఇచ్చిన టెక్ట్స్ మెసేజ్ చూడటానికి చాలా సింపుల్‌గానే ఉంది. సమాధానం చెప్పుకోవాలంటే కాస్త లోతుగా అనుశీలించాల్సిందే! ఆలోచనలు సక్సెస్ టూల్స్ వెంట పడుతుంటే success will not lower its standard to us. We must raise of standard to success అన్న మాక్ బ్రైడ్ జూనియర్ మాటలు గుర్తొచ్చాయి.
మనం ఎదగలేదని, ఎదగలేమని సక్సెస్ దిగిరాదు. సక్సెస్‌ను అందుకోవాలంటే మనం ఎదగాల్సిందే! ఏ మాత్రం మెట్టుదిగినా అది సక్సెస్ అనిపించుకోదు. ఒక మహావృక్షం దగ్గరకెళ్ళి కాయలో, పండ్లో కోయాలనుకుంటాం. అవి మనకు అందనంత ఎత్తులో ఉంటాయి. వాటిని కోయటానికి మనం చెట్టంత పొడగరులం కానక్కరలేదు. చెట్టెక్కటం తెలిసైనా ఉండాలి, నిచ్చెన వేసుకుని చెట్టెక్కచ్చు అన్న ఆలోచనైనా రావాలి లేదా ఒక గడకర్రతోనైనా కాయలు రాల్చవొచ్చన్న ఉపాయమైనా తట్టాలి. కాబట్టి సక్సెస్ అన్నది బోన్సాయ్ మొక్క కాదు.. మహావృక్షమే! అది అందనంత ఎత్తులో ఉంటుంది కాబట్టే సక్సెస్ అనేది అందని మ్రానిపండులాగా ఊరిస్తుంటుంది. సక్సెస్‌ను అందుకోవాలంటే మన శక్తి సామర్థ్యాలను, ఆలోచనా పటిమను పదును పెట్టాల్సిందే. అవే మనకు ఉపకరణాలవుతాయి. అవి ఉపకరణాలే అయినప్పటికి అవి మనవే!
గెలావాలన్న తపనతో మనం గెలుపుమార్గం పడతాం.. గెలుపన్నది ఆ మార్గంలోనే ఎక్కడో ఒక చెట్టులో ఉందని తెలుసు. నడుస్తూ నడుస్తూ చెట్టును చేరుకుంటాం. అలా చేరుకోవటం ఒక అచీవ్‌మెంటే తప్ప అదే సక్సెస్ కాదు. చెట్టు క్రింద నిలబడి రాలిన కాయలతో తృప్తిపడితే అచీవర్స్ అవుతామే తప్ప సక్సెస్‌ఫుల్ పర్సెన్స్ కాలేం. సక్సెస్‘్ఫల్’ కావాలంటే మన ప్రయత్నం ఉండాలి. మనదైన కృషి ఉండాలి.. చెట్టెక్కాలి. లేదా చెట్టుపై ఉన్న కాయలను మనదైన శైలిలో తెంపగలగాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. రాలిపడ్డ కాయలను బుట్టలో నింపుకున్నపుడు మనం అచీవర్స్. స్వశైలితో తుంపుకుని బస్తాలకు ఎత్తినపుడు సక్సెస్‌ఫుల్ పర్సెన్స్.
సక్సెస్ పరంగా మనం కలలు కనటం తప్పుకాదు. అయితే ఆ కలలు మనం లేచిన తర్వాత వెన్నాడుతుండాలి. ఆ కలల్ని జీవితంలోకి తర్జుమా చేసుకోగలగాలి. అప్పుడు సక్సెస్ మన సమీపానే ఉంటుంది. కన్నకలలు నిద్రలోనే కరిగిపోతే ఫెయిల్యూర్స్‌ను గుండెల్లో దాచుకున్నట్టు. కొందరు చెట్టుకు కాసిన కాయలను తెంపుకోవటమే సక్సెస్ అనుకోవచ్చు. మరికొందరు తాము వేసిన విత్తునుంచి ఎదిగిన చెట్టు కాయలను రుచి చూడటమే- సక్సెస్ అనుకోవచ్చు. ఇలా సక్సెస్ అనే పదానికి డెఫినిషన్, మీనింగ్, స్టాండర్డ్ వ్యక్తికీ, వ్యక్తికీ మారుతుంటుంది. సామాన్యంగా ఒక వ్యక్తిలోని విజేతను చూసి మనం సక్సెస్‌ఫుల్ పర్సెన్ అనుకుంటాం. కానీ మన స్నేహితుడి దృక్పథంలో అతడు సక్సెస్‌ఫుల్ పర్సెన్ కాకపోవచ్చు. అంతెందుకు మనం అనుకుంటున్న ఆ విజేత సైతం తాను సక్సెస్‌ఫుల్ పర్సెన్ అని అనుకోకపోవచ్చు. ఇలా సక్సెస్ విషయంలో మనకు మనమే కొలమానం తప్ప మరెవరో కొలమానం కాదు.
అసలు సక్సెస్ అన్న పదానికి మనదైన అర్థం ఉండాలి. మనం అనుకుంటున్న సక్సెస్‌కు మనమే ఒక నిర్వచనాన్ని, ఒక గుణాన్ని ఒక రూపాన్ని ఏర్పరచుకోవాలి. సక్సెస్ వెంట పడుతున్నంతకాలం ఆ రూపం, ఆ గుణం, ఆ నిర్వచనం మన కళ్లముందు కదలాడుతుండాలి. వాటిని చూస్తూ నడక సాగించాలి. గమ్యం చేరాక మనం సక్సెస్‌కు గీసుకున్న చిత్రం మన ముందు సాక్షాత్కరించిందో లేదో చూసుకోవాలి. సరిపోతే మనం సక్సెస్. ఏ మాత్రం తేడా కనిపించినా మనం ఫెయిల్. అంటే మన స్టాండర్డ్ సక్సెస్‌ను అందుకోవటానికి సరిపోలేదన్నమాట.
సక్సెస్ స్టాండర్డ్‌ను కూడా మన దగ్గరున్న ఉపకరణాలతోనే నిర్ణయించుకోవాలి. ఫలితం మన స్వంతమయ్యాక అవే ఉపకరణాలతో సక్సెస్‌ను బేరీజు వేసుకోవాలి. అంటే సక్సెస్ విషయంలో రచయితలం మనమే! విమర్శకులమూ మనమే! చివరికి న్యాయ నిర్ణేతలమూ మనమే! ప్రయాణించేదీ మనమే- ఫలితాన్ని అందుకునేదీ మనమే! అంటే సక్సెస్ పరంగా మనం ‘గో- గెట్టర్స్’ అన్నమాట. పైగా ఈ సక్సెస్‌కు కావలసిన మందీ మార్బలాన్ని (టూల్స్) మనమే చూసుకోవాలి. ఆ విషయంలో అ నుండి అః వరకు మనమే వారి చేత అక్షరాలు దిద్దించాలి. అంటే సక్సెస్ పరంగా అన్నివిధాలా బాధ్యత మనదే. దానే్న ‘డైరెక్టింగ్- కోచింగ్- సపోర్టింగ్- డెలిగేటింగ్’ అని అంటుంటాం. అంటే నిర్ణయాధికారమూ మనదే- పరిష్కార మార్గమూ మనమే.
సక్సెస్ అంటే ఏమిటో మనకు మనంగా తెలుసుకోవాలి. దేన్ని సక్సెస్ అనుకోవచ్చో మనమే నిర్థారించుకోవాలి. అంతేకానీ మరెవరో చెప్పిందే సక్సెస్ అనుకోకూడదు. అలాగే ఎవరో కట్టిన విలువలతో మన సక్సెస్‌ను చూసుకోకూడదు. మనం అనుకున్న విలువలతో సక్సెస్ అయ్యామా లేదా అన్నదే మనకు ముఖ్యం. కాలెండర్‌లో పేజీలు మారుతుంటాయి. జీవితంలో రోజును వెన్నంటి మరోరోజు వచ్చేస్తుంటుంది. తిరిగి చూసుకోవటానికి మళ్లీ గతం మనముందుకు రాదు. కాబట్టి మన ఆత్మకథలో సంతృప్తి పుటలే అధికంగా ఉండాలి. అప్పుడే జీవితం అర్థవంతంగా సాగుతోందన్న తృప్తి మిగులుతుంది. అలా బ్రతుకు సక్సెస్ అనిపిస్తోంది. పురోభివృద్ధి ఉన్న చోటనే విజయం నివాసం ఏర్పరచుకుంటుంది. మనకు మనంగా ఉండగలిగితే- మనవికాని విలువలను మన జీవితంలోకి అరువుతెచ్చుకోకపోతే- మన జీవితం ‘విజయ’ విలాసమే అవుతుంది. శ
టెక్స్ట్ మెసేజ్
english title:
text message
Date:
Wednesday, February 29, 2012