జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టం అని అర్థం. ఈ విశాలమైన భూమి మీద దేన్నైనా చాలా ఖచ్చితంగా ఎక్కడుందో గుర్తుపట్టడానికి వినియోగించే వ్యవస్థే జిపిఎస్. ఇది ఉపగ్రహాల సాయంతో పనిచేస్తుంది. భూ ఉపరితలం పైనుంచి 11 వేల నాటికల్ మైళ్ళ దూరంలో 24 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తూ రేడియో తరంగాలను వెదజల్లుతూంటాయి. ఈ తరంగాలు భూగోళాన్ని మొత్తంగా ప్రతి అంగుళాన్నీ గుర్తించగలవు. వీటికి తెలీకుండా భూమి మీద ఎలాంటి వస్తువునూ ఒకచోట నుంచి మరో చోటికి తీసుకెళ్ళలేరు. భూమిచుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఉపగ్రహాలకు 12 గంటల సమయం పడుతుంది. ఇవి విడుదల చేసే రేడియో తరంగాలతో బాటు ఖచ్చితమైన సమయాన్నికూడా కొలిచే పరమాణు గడియారాలను కలిగి ఉండటంవల్ల 0.000000003 సెకన్లదాకా ఖచ్చితమైన సమయాన్ని పొందవచ్చు. 1978లో తొలి జిపిఎస్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత వరసగా ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. 1994 నాటికి ఆ ఉపగ్రహాల సంఖ్య 24కు చేరింది. నేడు మనం వాడే జిఐఎస్ వ్యవస్థలకు జిపిఎస్ ఎంతో కీలకం. జిఐఎస్, జిపిఎస్ వ్యవస్థలను రెండింటినీ చక్కగా వాడుకొని సమాచార వ్యవస్థలను రూపొందించవచ్చు. దానివల్ల మ్యాపు గీచి అందులో ఒక వస్తువును లేదా మనిషిని లేదా ఒక అంశాన్ని ఖచ్చితంగా గుర్తించి, పరిశీలించి చర్యలు తీసుకోవడానికి సులభంగానే వీలవుతుంది. అందుకే వివిధ దేశాలు ఈ రెండింటి మీదా దృష్టి సారించాయి. ఈ 24 ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్‌ను మనం జిపిఎస్ ఉపకరణంతో గుర్తించవచ్చు. ఏ సమయంలోనైనా మనకు కనీసం 6 ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుతాయి. ఉపగ్రహాలనుంచి వచ్చే రేడియో తరంగ సిగ్నల్స్‌ను బట్టి ఒక వస్తువు, ప్రదేశం, వ్యక్తి ఎక్కడున్నదీ తెలుస్తుంది. దీనికి కీలకమైన రేఖాంశం, అక్షాంశం వివరాలను జిపిఎస్ ఉపకరణం ద్వారా తెలుస్తుంది. ఖచ్చితమైన సమాచారాన్ని అందుకోవాలంటే 6 ఉపగ్రహాలనుంచి సిగ్నల్స్ అందుకోగల్గితే మంచిది. లేదంటే, కనీసం 4 ఉపగ్రహాలనుంచి సిగ్నల్స్ అందుకోవాలి. ఈ జిపిఎస్ వ్యవస్థను వినియోగించి, భూమిమీద 2 సెం.మీ (అడ్డంగా), 3 సెం.మీ (నిలువుగా) దూరంలోని వస్తువును ఖచ్చితంగా గుర్తించగల్గడమే కాదు, వేగంగా సమర్థవంతంగా పగలూ రాత్రీ తేడా లేకుండా ఎపుడైనా గుర్తించవచ్చు. జిపిఎస్ సౌకర్యం కేవలం ప్రత్యేక ఉపకరణాలకే పరిమితం కాలేదు. నేడు వచ్చే కొన్ని ఖరీదైన మొబైల్ ఫోన్లలో కూడా వస్తూన్నది. దీనివల్ల ఒక వ్యక్తి దగ్గర అలాటి మొబైల్ ఫోన్ ఉండీ, అవతలివ్యక్తి దగ్గరా అలాంటి ఫోన్ ఉంటే- ఒకరికొకరు వాళ్ళెక్కడున్నారో ఖచ్చితంగా తెల్సుకొనే వీలుంటుంది. అపుడు అబిడ్స్‌లో ఉండి మాట్లాడుతూ ‘అమీర్‌పేటలో ఉన్నా’ అని అనడానికి వీలుండదు. ఒకవేళ అబద్ధం చెప్పినా అవతలి వ్యక్తికి ఇట్టే తెల్సిపోతుంది.
ఈ జిపిఎస్ వల్ల ఒక వస్తువును, వ్యక్తిని గుర్తించడమే కాదు, ఒక చోటునుంచి మరో చోటికి చేరడానికి ‘నేవిగేషన్’కి వీలవుతుంది. ఒక వాహనం, వ్యక్తి ఒక చోటునుండి వెళ్తున్నపుడు ట్రాక్ చేయవచ్చు. నదులు, సముద్రాలు, దేశాల సరిహద్దులు గుర్తించడం, తద్వారా మ్యాపులను రూపొందించడం సులభం. నిజానికి జిపిఎస్‌ను మిలటరీ ప్రయోజనాల కోసం రూపొందించారు. బిన్‌లాడెన్, సద్దాం హుస్సేన్ లాటి వారి ఉనికిని గుర్తించడానికి కూడా ఈ జిపిఎస్ వ్యవస్థ ఎంతో ఉపకరించింది. విమాన, నౌకా ప్రయాణాల్లో జిపిఎస్ వినియోగం ఎంతో ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే జిపిఎస్ ఆధారిత కార్లు ఉన్నాయి. తద్వారా ఒక కారు ఎలా ప్రయాణించాలో సూచించడం సులభం. జిపిఎస్ ద్వారా వైల్డ్ లైఫ్ మేనేజిమెంట్, బెలూన్ ట్రాకింగ్, ఆటో పైలటింగ్, యాక్సిడెంట్ హేండ్లింగ్ వంటి వాటికే కాదు పర్వతాల ఎత్తు కనుక్కోవడంలో, గనులలో మార్పులను పసిగట్టడానికి, భూఖనిజ సంపద గుర్తించడానికి కూడా వినియోగిస్తుంది. బస్సుల ప్రయాణంలో వాటిని ట్రాక్ చేయడానికి, ఆంబులెన్స్‌లను ట్రాక్ చేయడానికి, మ్యూజియంల రక్షణకీ కూడా జిపిఎస్ ఎంతో సాయపడుతుంది. అందుకే జిఐఎస్, జిపిఎస్‌ల కలపోతతో నేడు సాఫ్ట్‌వేర్ రూపకల్పనలకే పెద్ద పీట, జిఐఎస్ డెవలపర్స్‌కి కాసుల పంటగా మారిపోయింది.
జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టం అని అర్థం
english title:
gps
Date:
Wednesday, February 29, 2012