హైదరాబాద్, జూలై 5: తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదో కుట్ర అని ఆమె దుయ్యబట్టారు. మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ్ శుక్రవారం విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ మోపిదేవిని అరెస్టు చేసే ముందు వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. 26 జివోల కేసు రాజీకీయ ప్రేరేపితమైందని ఆమె దుయ్యబట్టారు. 26 జివోల కేసుల్లో ఒక్కొక్కరికీ ఒక్క న్యాయమా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిందని ఆమె పునరుద్ఘాటించారు. అందుకు ప్రతిఫలంగా వైఎస్‌ను అప్రతిష్ట చేసేందుకు ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టిడిపి కలిసి చేస్తున్న కుట్రలను ప్రజలు గమినిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి పంచాయతీలో పార్టీ విజయం సాధించాలని, పార్టీ జెండా రెపరెపలాడాలని ఆమె తెలిపారు.
విజయమ్మ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మోపిదేవి సోదరుడు హరినాథ్