ఒంగోలు, జూలై 5: జిల్లా నూతన ఎస్‌పిగా పి ప్రమోద్‌కుమార్ శుక్రవారం ఉదయం 9.50గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిబందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఆయన తెలిపారు. రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదుచేస్తామన్నారు.
జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. దొంగతనాలకు సంబంధించిన రికవరీని కూడా త్వరతగతిన చేస్తామన్నారు. జాతీయరహదారులపై ప్రమాదాల నివారణకు దృష్టిపెడతానన్నారు. జాతీయ రహదారిపై మద్యంసేవించి వాహనాలు నడిపేవారిపై నిఘాపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయరహదారిపై వెళ్లే వాహనాలు పరిమితికి మించి లోడుతో వెళితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒంగోలునగరంలో ట్రాఫిక్ వ్యవస్ధను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కృషిచేస్తానని ఆయన తెలిపారు. నగరంలో సిగ్నల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన న్యాయసహాయం అందించేందుకు కృషిచేస్తానని జిల్లాఎస్‌పి ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. నూతన ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్‌కుమార్‌ను పలువురు పోలీసు అధికారులు, రాజకీయనాయకులు అభినందనలు తెలిపారు.
బరితెగించిన నీటి చోరులు ప్రధాన కాల్వ కట్టలకే గండ్లు
కురిచేడు, జూలై 5: సాగర్ జలాలు విడుదల చేయటంమే ఆలస్యం, నీటి మళ్లింపుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంటారు చేపల గుత్తేదారుడు. వారికి తామేమి తీసిపోమన్నట్టుగా ఏకంగా ప్రధాన కాల్వకట్టలకే గండ్లు పెడుతున్నారని అనధికార సాగుబడి రైతులు. తరచూ కాల్వ మేజర్లకు గండ్లు పెడుతున్నా అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఒకరైతు ఏకంగా దర్శి బ్రాంచి కాల్వకు శుక్రవారం గండిపెట్టి అక్రమ తూము ఏర్పాటుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాన్ని పసికట్టిన పడమర వీరాయపాలెం మేజర్ లస్కర్ ఆశీర్వాదం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే సిబ్బందిని అప్రత్తం చేసి, అక్రమతూము ఏర్పాటును అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి బ్రాంచి కాల్వ కుడివైపు కట్ట 3వ కిలోమీటరు వద్ద ఒక రైతు అక్రమ తూముకు ప్రయత్నించాడు. అద్దంకి ప్రాంతం నుండి వలస వచ్చిన ఆరైతు ఇక్కడ పొలం కొనుగోలు చేశాడు. సాగర్‌కాల్వ ఊటనీటితో పొలం సాగు చేయసాగాడు. ఊట నీటి కన్నా ఏకంగా కాల్వలో ప్రవహించే నీటినే తమ పంట పొలానికి మళ్లించుకోవాలనే దురాశ అతనిలో కలిగింది. అతని దురాశకు ఒక చోటా రాజకీయనాయకుడి భరోసా దొరికింది. దీంతో ప్రొక్లయినర్‌తో కాల్వకట్టను తొలిచాడు. అక్కడ తూము ఏర్పాటు చేసి పైపుల ద్వారా నేరుగా తన పొలంలోకి నీటిని మళ్లించుకోవాలని ఏర్పాట్లు చేసుకోసాగాడు. కాల్వలపై పర్యవేక్షిస్తున్న లస్కర్ ఆశీర్వాదం గమనించి దర్శి జెఇ అంకమరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల విధి నిర్వహణలోవున్న ఆయన సిబ్బంది వర్కఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, లస్కర్లు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనులను సంఘటనా స్థలానికి పంపి రైతు ప్రయత్నాలకు చెక్ పెట్టించారు. అక్రమ తూము ఏర్పాటుకు ప్రయత్నించిన రైతుపై కాని, ప్రొక్లయినర్ యాజమాన్యంపై కాని ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సిబ్బంది వారిని వదిలివేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఆధునీకరణ పేరుతో కాల్వలకు ఒకవైపు మరమ్మతులు చేస్తుంటే మరో వైపు నీటిచోరులు, అక్రమ సాగుబడి దారులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాలుపడుతున్నా పోలీసు కేసులు బనాయించకుండా ఉపేక్షించటంపై ఆయకట్టుదారులు విమర్శిస్తున్నారు.
‘హిమ్ బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం’
మార్కాపురం, జూలై 5: మాయ మాటలతో హిమ్ సంస్థ ద్వారా నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని పోరాట కమిటీ అధ్యక్షులు ప్రేమానందం తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్‌జిఓ హోంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నెల్లూరులో సిఐడి డివైఎస్పీ దిలీప్‌కుమార్‌ను కలిసి తమ బాధను విన్నవించుకోవడం జరిగిందని, ప్రతిఒక్కరికి న్యాయం జరిగేవరకు తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈసమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షులు సిపిఎం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా ప్రతి ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారే తీవ్రంగా నష్టపోయారన్నారు. త్వరలో బాధితుల తరుపున ప్రధాన న్యాయస్థానంలో రిట్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గౌరవ సలహాదారుడు బలుసుపాటి గాలెయ్య కమిటీ కార్యదర్శి మందా పోలయ్య పాల్గొన్నారు.
అంగన్‌వాడి సమస్యలు పరిష్కరించాలి
చీరాలరూరల్, జూలై 5: అంగన్‌వాడి కార్యకర్తలు పదవీవిరమణ చేసినప్పుడు అన్ని రకాలప్రయోజనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని కోరుతూ చీరాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడి కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రైవేటుపరం చేస్తే సహించేదిలేదని అన్నారు. కార్యక్రమంలో డి నాగేశ్వరరావు, అంగన్‌వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతులు ప్రదానం
యద్దనపూడి, జూలై 5: విద్యాపక్షోత్సవాలలో భాగంగా మండలంలోని పూనూరు గ్రామంలోని ఎల్ ఇ ప్రాథమిక పాఠశాల వద్ద శుక్రవారం ఆరోగ్యం-పారిశుద్ధ్యం అనే అంశంపై విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. క్విజ్ పోటీలలో టి కార్తీక్ గ్రూప్‌కు ప్రథమ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి ప్రసాద్, ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్‌వాడి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వీధిలైట్లు వెలిగించాలి
యద్దనపూడి, జూలై 5: మండలంలోని పలు గ్రామాలలో వీధిలైట్లు వెలగకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని అనంతవరం, పూనూరు, యద్దనపూడి, యనమదల, వింజనంపాడు గ్రామాలలో రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగకపోవటంతో గ్రామస్ధులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. అసలే విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే దీనికితోడు ఉన్న కొద్దిపాటి సమయంలోనైనా వీధిలైట్లును వెలగకపోవటం ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరమ్మత్తులు చేయించి వెంటనే వీధి లైట్లు వెలిగేవిధంగా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
‘ఎన్నికల నియమావళి పాటించాలి’
వేటపాలెం, జూలై 5: రాజకీయ నాయకులు ఎన్నికల నియమావళిని పాటించాలని మండలాభివృద్ధి అధికారి పి ఝాన్సీరాణి తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ప్రసంగించారు. సామాన్యుడు ఓటుహక్కును వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఎస్‌ఐవి అంకబాబు మాట్లాడుతూ సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించదలచుకున్న రాజకీయపార్టీల వారు ముందస్తుగా డివైఎస్‌పి అనుమతి తీసుకోవాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని తెలిపారు. ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడితే రౌడీషీట్‌లు ఓపెన్ చేస్తామని తెలిపారు. అఖిలపక్ష నాయకులు కోనంకి నాగేశ్వరరావు, కర్ణ శ్రీనివాసరావు, అక్కల రాజశేఖరరెడ్డి, పి మనోహరలోహియా, దంతం వెంకటసుబ్బారావు, బొడ్డు సుబ్బారావు, పల్లపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
దాతల సహకారం మరువలేనిది
వేటపాలెం, జూలై 5: జూనియర్ కళాశాల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో ఉపయోగపడుతుందని బండ్లబాపయ్య విద్యాసంస్థల కమిటి కార్యదర్శి బండ్ల శరత్‌బాబు తెలిపారు. శుక్రవారం బండ్లబాపయ్య హిందూ జూనియర్ కాలేజిలో పూర్వ విద్యార్థి బట్ట శంకరరావు జ్ఞాపకార్ధం ఆయన సతీమణి సుగుణ, కుమారులు బట్ట తులసీ శ్రీనివాసరావు, నాగరాజుల ఆర్థిక సహాయంతో 6వ తరగతి విద్యార్థులు 100మందికి నోటుపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శరత్‌బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన నోటుపుస్తకాలు, పెన్నులు అందిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సహాయకార్యదర్శి కొసనం నాగమాంబ, ప్రిన్సిపాల్ పి బాలసుబ్రహ్మణ్యం, హైస్కూల్ ఇన్‌చార్జి ఎన్ ఏసుదాసు, ఉపాధ్యాయులు బట్ట మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా వేటపాలెం రైల్వేస్టేషన్ రోడ్డులోగల అనాధ సంక్షేమ సంస్ధ ఆధ్వర్యంలో వేటపాలెం పంచాయతీలోని పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సంస్థ అధ్యక్షులు జెల్లి యల్లమందయ్య నోటుపుస్తకాలు, జామెంట్రీ బాక్సులు, పెన్సిల్స్ ఇవ్వగా వాటిని ఎస్ ఐ ఇ అంకబాబు విద్యార్థులకు అందజేశారు.
పెన్షన్ సౌకర్యం కల్పించాలి
వేటపాలెం, జూలై 5: అంగన్‌వాడి కార్యకర్తలు పదవీవిరమణ చేసినప్పుడు లక్ష రూపాయల గ్రాడ్యూయిటీ, సహాయకులకు రూ. 50వేలు ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వేటపాలెం మండల కాంప్లెక్స్ ఎదుట అంగన్‌వాడిలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎన్ బాబూరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవవేతనం అందజేయాలని కోరారు. చివరి జీతంలో సగం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి 55ఏళ్లు వయోపరిమితి ఉండేలావిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విఆర్‌వో సంఘ నాయకుడు ఎం సత్యనారాయణ వారికి మద్దతు పలికారు. కార్యక్రమంలో నాయకులు సరళ, గౌరీకుమారి, విజయకుమారి, ఎస్ భ్రమరాంభ, భానుమతి, బుల్లెమ్మాయి తదితరులు పాల్గొన్నారు.
బ్యూటిపార్లర్‌పై ఉచిత శిక్షణ
వేటపాలెం, జూలై 5: స్థానిక మండల కాంప్లెక్స్‌లో గల గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణాసంస్థ ఈ నెల 25నుండి 30రోజులపాటు నిరుద్యోగ మహిళలకు బ్యూటిపార్లర్ మేనేజ్‌మెంటులో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ డైరెక్టర్ టి తిరుపతిరెడ్డి శుక్రవారం తెలిపారు. మహిళలు జిల్లాకు చెందినవారై ఉండి 18నుండి 45 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారై ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తికలిగిన మహిళలు తమ బయోడేటాను ఈ నెల 23వ తేదీలోగా డైరెక్టర్ రూడ్‌సెట్, వేటపాలెం, ప్రకాశం జిల్లాకు పంపాలన్నారు.