అద్దంకి, జూలై 5: మండలంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయభేరి మోగించాలని అద్దంకి మాజీ శాసనసభ్యులు జాగర్లమూడి రాఘవరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఇరిగేషన్ బంగ్లాలో గ్రామాల వారీగా నాయకులతో పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. గ్రామ నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు. వార్డు మెంబర్లను మాత్రం మీరే ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని భరోసా ఇచ్చారు. రాఘవరావు వెంట పరిటాల నాగేశ్వరరావు, చినరాముడు, ఎర్రిబోయిన వెంకటేశ్వర్లు, తోకల వెంకటేశ్వర్లు, వీరాంజనేయులు, బోసు, ఎర్రిబోయిన ప్రసాదు తదితరులున్నారు.
అక్రమ బాణసంచా పట్టివేత
చీరాల, జూలై 5: నివాస ప్రాంతంలో బాణసంచాను అక్రమంగా నిల్వచేసి ఉందన్న సమాచారం అందుకున్న ఒన్ టౌన్ పోలీసులు శుక్రవారం వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా దాచి ఉంచటం చట్టరీత్యా నేరమని సిఐ భీమా నాయక్ అన్నారు. జాండ్రపేట సెంటర్‌లో ఊటుకూరి హరిబాబు నిబంధనలకు వ్యతిరేకంగా రెండు లక్షల రూపాయల విలువైన బాణసంచాను నిల్వ చేశారన్నారు. స్వాధీనం చేసుకున్నట్లు సిఐ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ మేరకు హరిబాబును అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో సోదాలు చేస్తుండగా అక్రమ బాణ సంచాబైటపడినట్లు ఆయన వెల్లడించారు. అగ్నిమాపక అధికారి అనుమతిలేకుండా కనీసం ఎటువంటి లైసెన్స్‌లు లేకుండా అక్రమంగా నిల్వ చేయటం దారుణమని అన్నారు. ఈ దాడిలో ఎస్ ఐ వెంకటేశ్వర్లు, పుల్లయ్య నాయడు, నాగరాజు, దయానంద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.