దర్శి, జూలై 5 : రెవిన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల దస్తాలు ఆన్‌లైన్ కావడం వలన అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని జిల్లా రిజిస్ట్రార్ జిఎస్ గోపాల్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పూర్వీకుల ఆస్తులను రిజిస్ట్రర్ కావడానికి వారసుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు అయి ఉండాలన్నారు. లేని చో రిజిస్ట్రేషన్లు జరపడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కొనుగోలు దారులు సంబంధిత ఆస్తి తాలూకు
పూర్తి వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారించుకున్న తరువాతనే చలానాలు తీయాలని ఆయన కోరారు. రిజిస్ట్రార్ కార్యాలయాలు నూతన విధానాల వలన జిల్లా పరిధిలోని ఏ కార్యాలయంలోనైనా తమ ఆస్థులను రిజిస్ట్రర్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విధానం ఈ నెల 8 నుండి పూర్తిగా అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గమనించి కొనుగోలు అమ్మకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ యస్‌యండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఐరన్ మాత్రలు వికటించి బాలికలకు అస్వస్థత
కందుకూరు, జూలై 5: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఐరన్ మాత్రలు వికటించి 27మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు, వైద్యులు, బాధిత బాలికలు తెలిపిన వివరాల ప్రకారం గురువారం పాఠశాల ఆవరణలో జరిగిన స్కూల్‌హెల్త్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు ఐరన్ మాత్రలను బాలికలకు పంపిణీ చేశారు. భోజనం చేసిన వెంటనే ఐరన్ మాత్రలు వేసుకోవాలని బాలికలకు సూచించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య వలన 50మంది బాలికలు ఐరన్ మాత్రలను గురువారం వేసుకోలేదు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన తదుపరి మధ్యాహ్నం 11.30గంటల సమయంలో ఐరన్ మాత్రలను వేసుకున్నారు. వేసుకున్న వెంటనే మాత్రలు వికటించి బాలికలు వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయారు. వెనువెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ, ఎంఇఓ బండి గోవిందయ్య 108 సహాయంతో బాలికలను పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న బాలికల తల్లిదండ్రులు వైద్యశాలకు చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. సమాచారం అందుకున్న వైద్యశాఖ క్లస్టర్ ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ రాజకుమారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు నాగమణి చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సిపిఐ పట్టణ కార్యదర్శి వి రాఘవులు వైద్యశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. చికిత్స పొందుతున్న వారిలో వి భవాణి, ఆర్ సుప్రియ, ఎస్‌కె నజియా, టి సుకన్య, జి శిరీష, పి దేవిప్రియ, జి శ్రీదేవి, బి జానకి, జె వెంకటలక్ష్మి, బి సుమలత, బి కీర్తి తదితరులు ఉన్నారు.
దర్శిలో.
దర్శి: స్థానిక కస్తూర్బాపాఠశాలలో గురువారం రాత్రి ఆ పాఠశాల బాలికలకు ప్రభుత్వం అందచేసిన ఐరన్‌మాత్రలు వికటించి 40మంది బాలికలు అస్వస్థతకు గురైనారు. వీరిని శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల చేర్పించారు. వైద్యులు సరైన సమయంలో స్పందించటంతో బాలికలు ప్రమాదంనుండి బయటపడ్డారు. భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఇచ్చిన ఈ ఐరన్ మాత్రల వలన కొద్దిమందికి ఇటువంటి చిన్నపాటి అస్వస్ధతలు కలుగుతాయని జిల్లావైద్య శాఖాధికారి పి సుధాకర్‌బాబు పేర్కొన్నారు. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కస్తూరిబా పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని బాలికలను అడిగి పూర్తివివరాలను తెలుసుకున్నారు. జిల్లాలో కొన్నిప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. బాలికలను ఆయన పరీక్షించి తగిన వైద్యాన్ని అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. ఆస్వస్ధతకు గురైన బాలికలకు ప్రభుత్వ వైద్యులు ఆనంద్‌బాబు, చేగిరెడ్డి మనోహర్ రెడ్డి, రాధాకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు.