హైదరాబాద్, జూలై 7: ఈ ఏడాది రాష్ట్రంలో పది శాతం మేరకు విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (ట్రాన్స్‌కో) చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ చందా తెలిపారు. ఉత్పత్తికి సిద్ధమవుతున్న నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుంచి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను ఉపయోగించేందుకు సరఫరా, పంపిణీ ప్రాజెక్టులన్నింటినీ నాణ్యతా నియంత్రణ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. థర్ట్ పార్టీ తనిఖీల ద్వారా సంపూర్ణ నాణ్యతా యాజమాన్యం అమలుకు విద్యుత్ సంస్ధలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్ధితిపై సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమీక్షించనున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఆయన విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. టెండర్ల ఒప్పందాల్లోని నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ఏ విధమైన ఉల్లంఘనలు, అవకతవకలకు చోటివ్వకుండా నిర్మాణ పనులన్నింటీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర విద్యుత్ అధ్యయన సంస్ధ, విద్యుత్ అధ్యయన అభివృద్ధి వంటి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్ధల ద్వారా నిపుణులైన నాణ్యతా నియంత్రణ బృందాల ఏర్పాటు, థర్ట్ పార్టీ తనిఖీలను చేపట్టడం ద్వారా సంపూర్ణ నాణ్యతాయాజమాన్యం అమలు సాధ్యపడుతుందన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తిలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన కాంట్రాక్టర్లను వదిలేది లేదని, జరిమానాలు విధిస్తామన్నారు. నాసిరకం పనుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్ధ, సబ్‌స్టేషన్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆరు అంశాలపై విద్యుత్ పరిస్ధితిని సమీక్షిస్తారు. ఈ అంశాలపై ఏపిట్రాన్స్‌కో, డిస్కాంలు ఒక సమగ్ర నివేదికను అందిస్తాయి. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరిస్ధితులు, కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, భవిష్యత్తులో పెరగనున్న డిమాండ్, పెరగనున్న విద్యుత్ స్ధాపిత శక్తి, అదనపు విద్యుత్ కొనుగోళ్లు, సౌర విద్యుత్, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర విద్యుత్ వనరుల అభివృద్ధి, వినియోగదారుల సంక్షేమ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఖరీఫ్ పంటకు ఏడు గంటల విద్యుత్ సరఫరా జరిగే విధంగా ప్రణాళిక ఖరారు చేసినట్లు సిఎండి సురేష్ చందా తెలిపారు.
కెసిఆర్ వౌనం వెనుక
పదునైన వ్యూహం
ఢిల్లీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టిఆర్‌ఎస్
తొందరపాటు ప్రకటనలు చేయరాదని పార్టీ నేతలకు ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 7: టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు వౌనం వెనుక పదునైన వ్యూహం ఉందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. గత వారం రోజులుగా ఇక్కడ, ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం చేపట్టిన కసరత్తు, తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో హడావుడిని కెసిఆర్ తన సన్నిహితులతో కలిసి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఏర్పడే పక్షంలో టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం తథ్యమనే భరోసా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాజకీయ జాక్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ బృందం ఢిల్లీకి వెళ్లి హల్‌చల్ సృష్టించింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్‌తో కోదండరామ్ కలిసి చర్చించడం, మరో కాంగ్రెస్ నేత ఇచ్చిన విందుకు హాజరు కావడం లాంటి అంశాలను టిఆర్‌ఎస్ సీనియర్ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి తెలంగాణ అంశంపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు, లేదా ఒక నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించే వరకు ఎటువంటి ప్రకటన చేయరాదనే నిశ్చయంతో కెసిఆర్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల పార్టీలో చేరిన కడియం, కేశవరావుకు పార్టీ రోజూవారీ వ్యవహారాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఎంపిక చేయడం, కార్యకర్తలకు శిక్షణ, పార్టీ వ్యవహారాల సమీక్ష కార్యక్రమాలను కెసిఆర్ అప్పగించినట్లు సమాచారం. అందుకే కడియం శ్రీహరి, కెకె ఇరువురే పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కెసిఆర్‌కు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి చేపట్టిన కసరత్తులోని అంశాలను వివరించలేదని తెలిసింది. ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయాన్ని తాము తీసుకుని, ప్రకటించి ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలనే తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్ఠానం, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
తెలంగాణ గురించి ఢిల్లీలో హడావుడి జరగడం ఇది తొలిసారి కాదు. అందుకే బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది. ఏ నిర్ణయం వెలువడుతుందో చూస్తాం. తెలంగాణ సాధన మా లక్ష్యం. అది నెరవేరితే ఆ క్రెడిట్ ప్రజలకు దక్కుతుంది అని టిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు కావడమే తమ లక్ష్యమని, రాయల తెలంగాణ గురించి తెలియదని టిఆర్‌ఎస్ నేతలంటున్నారు. ఈ అంశంపై ఢిల్లీనుంచి ఎటువంటి సంకేతాలు తమ అధినేతకు అందలేదంటున్నారు. ఎత్తుకు పైఎత్తు వేయడంలో, సమయానుకూలంగా వ్యవహరించడంలో కెసిఆర్ అపర చాణక్యుడనే పేరుంది. అందుకే ఢిల్లీలో, హైదరాబాద్‌లో రోడ్ మ్యాప్‌పై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు హడావుడి పడుతున్నా కెసిఆర్ ఎటువంటి ప్రకటన చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సంయమనంతో ఉండాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తామనుకున్నట్లు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాని పక్షంలో, ఇంకా జాప్యం జరిగేటట్లుంటే మాత్రం కెసిఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడే అవకాశాలు కనపడుతున్నాయి.
దిగ్విజయ్‌తో నేడు ఒయు, టిఎస్ జెఎసి నేతల భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 7: కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సోమవారం ఉస్మానియా విద్యార్థి ఐకాస (ఒయు జెఎసి), తెలంగాణ విద్యార్థి ఐకాస (టిఎస్‌జెఎసి) నేతలు భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం ఒయు జెఎసి, టిఎస్‌జెఎసి నేతలు పిడమర్తి రవి, మర్రి అనిల్‌కుమార్, దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్, వీరప్రసాద్ యాదవ్, శుభప్రదేవ్ పటేల్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటలకు దిగ్విజయ్‌సింగ్ తమతో భేటీకి సమయం ఇచ్చినట్టు ఒయు జెఎసి అధికార ప్రతినిధి బాల్‌రాజ్ యాదవ్ తెలిపారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఒయు జెఎసి, టిఎస్‌జెఎస్ ప్రతినిధులు హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 12న కాంగ్రెసు కోర్ కమిటీతో భేటీ కానున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వినతి పత్రం సమర్పించినట్టు బాల్‌రాజ్ తెలిపారు.
తెలంగాణ అంశంపై సమర్పించే రోడ్‌మ్యాప్‌లో చేర్చాల్సిన అంశాలను ఉప ముఖ్యమంత్రికి వివరించినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణలోని పది జిల్లాలతో కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తప్ప, మరే ప్రతిపాదనకు అంగీకరించవద్దనీ ఉప ముఖ్యమంత్రికి సూచించినట్టు ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించాలని కోరినట్టు బాల్‌రాజ్ తెలిపారు. నీటి వనరులు, ఉపాధి, ఉద్యోగ, విద్యావకాశాలు, తెలంగాణ భూముల ఆక్రమణ తదితర రంగాలలో జరిగిన అన్యాయాన్ని రోడ్ మ్యాప్‌పై సమర్పించే నివేదికలో పేర్కొనాలనీ ఉప ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పార్లమెంట్ ఉభయ సభలో ప్రకటించిన అనంతరం ఈ ప్రాంతంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను సోమవారం తమతో జరిగే భేటీలో దిగ్విజయ్‌సింగ్‌కు వివరిస్తామని బాల్‌రాజ్ యాదవ్ తెలిపారు.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు/నెల్లూరు, జూలై 7: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. గత కొంతకాలంగా జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, మరోపక్క విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తల్లడిల్లి పోయారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో ప్రజలు కొంతమేర ఉపశమనం పొందారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, చినగంజాం తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉప్పు సాగు ఆగిపోయింది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలంలో అత్యధికంగా 94.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నెల్లూరు జిల్లాలోకూడా పలు మండలాల్లో వర్షం కురిసినట్టు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది.