హైదరాబాద్, జూలై 7: తెలంగాణ ఉద్యమంపై తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండగలరా అని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకురాలు రమ్య సవాల్ విసిరారు. తెలంగాణ మాదిగ దండోర ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ‘వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు’ కార్యక్రమాన్ని రమ్య ప్రారంభించారు. అంతకుముందు ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ఇందిరా పార్కుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో రమ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కెసిఆర్, ఇనేళ్లలో ఏ జిల్లాకైనా దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ సంపద, వనరులను సీమాంధ్రులు తరలించుకుపోతున్నారని కెసిఆర్ ఆరోపిస్తుంటారనీ, మరి ఆందులో ఆయన వాటా ఎంత అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కెసిఆర్ కుటుంబం చేస్తోన్న దోపిడీని ప్రశ్నిస్తే తనపై దాడులు చేయించారని రమ్య ఆరోపించారు. మహిళలు అంటే కెసిఆర్‌కు చిన్న చూపనీ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని బజారు కీడుస్తానని గతంలో అవమానపర్చారని ఆమె దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై కెసిఆర్‌కు ఏమాత్రం గౌరవం లేదనీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను చప్రాసీతో పోల్చారని రమ్య గుర్తు చేసారు. టిఆర్‌ఎస్ నేతల అవినీతి బండారంపై వచ్చిన ఆరోపణలకు ఆ పార్టీ నేతలు ఎందుకు సమాధానం చెప్పడం లేదనీ ఆమె ప్రశ్నించారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం వల్లనే వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆమె తెలిపారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న కెసిఆర్, చిన్న చిన్నవాటికే అసహనానికి గురైతే, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నిర్వహించగలరనీ ఆమె ప్రశ్నించారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా దాడులు చేయించడం ఏం సంస్కృతి అని తెలంగాణ మాదిగ దండోర నేత చింతాస్వామి ప్రశ్నించారు. కెసిఆర్ వల్ల దళితులకే కాకుండా దళితులకు అండగా నిలిచినవారిపై దాడులు చేయిస్తున్నారనీ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి కెసిఆర్, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చింతాస్వామి హెచ్చరించారు.
ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ‘వెయ్యి డప్పులు -
లక్ష చెప్పులు’ కార్యక్రమంలో పాల్గొన్న కెసిఆర్ అన్న కూతురు రమ్య