హైదరాబాద్, జూలై 7: యుపిఏ ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల దేశంలో ఉగ్రవాదులు తెగబడుతున్నారని, భద్రత విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రం వైఫల్యంవల్లనే బుద్ధగయలో ఉగ్రవాదులు దాడులు చేశారన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను, మత మార్పిడులను రద్దు చేస్తూ చట్టం తెస్తుందన్నారు. దేశమంతా బిజెపి వైపు చూస్తోందన్నారు. బీహార్ పేలుళ్లకు కాంగ్రెస్ అసమర్ధ విధానాలే కారణమన్నారు. యుపిఏ ప్రభుత్వం స్కాంలలో కూరుకుపోయిందన్నారు. ఉగ్రవాదులను అణచివేయడంలో మెతకవైఖరిని అవలంభిస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యుపిఏ కూటమి ఘోరపరాజయం పాలవుతుందని ఆయన అన్నారు. సిబిఐ అండదండలతో కాంగ్రెస్ సర్కార్ కేంద్రంలో నడుస్తోందన్నారు. రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా విడిపోదామన్నారు. దేశంలో ఆహార భద్రత చట్టాలను మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ ప్రభుత్వాలు ముందు తెచ్చాయన్నారు. అక్కడ అసెంబ్లీలలో ఈ చట్టం గురించి కూలంకషంగా చర్చ జరిగిందన్నారు. కాని యుపిఐ కూటమి తెచ్చిన ఆహార భద్రత చట్టం కాంగ్రెస్ భద్రత చట్టంగా మారిందన్నారు. బంగారు తల్లి పథకాన్ని కర్నాటక ప్రభుత్వం గతంలోనే ప్రవేశపెట్టిందన్నారు. మజ్లిస్ పార్టీ మతతత్వ రాజకీయాలను పెంచిపోషిస్తోందని, ఈ పార్టీకి కాంగ్రెస్ అండదండలున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో బిజెపికి గణనీయంగా సీట్లు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవినీతిలో కూరుకునిపోయాయన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పన్నుల కుమార్‌గా మారారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేదని, అధికారుల ఇష్టారాజ్యంగా పాలన తయారైందన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కాళ్ల ముందు పెట్టారన్నారు. ఆగస్టు రెండోవారంలో నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తారని, ఆయన నాయకత్వం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయ, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన బిజెపి ప్రజా చైతన్య సదస్సులో ప్రసంగిస్తున్న ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు. సదస్సుకు హాజరైన ప్రజలు