ఖైరతాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర ఏర్పాటు కంటే తన సొంత ప్రయోజనాలే ముఖ్యమని, తన స్వప్రయోజనాలకు ఎక్కడ గండి పడుతుందోనన్న కుట్రతో ఆయన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తున్నారని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి విమర్శించింది. సోమవారం లక్డీకపూల్‌ల్లోని ఓ హోటల్‌ల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జెఎసి చైర్మన్ గజ్జల కాంతం, ప్రొఫెసర్లు అన్సారి, చందునాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య అడ్డంకి కెసిఆర్, అతని కుటుంబ సభ్యులేనని, రాష్ట్ర ఏర్పాటు కోసం 60 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువకులు విద్యార్ధులే మృతి చెందారని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజల మనోగతాన్ని అర్ధం చేసుకొని తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడితే.. తమను సంప్రదించకుండా తెలంగాణ ఎలా ఇస్తారని కెసిఆర్ కుమారుడు కెటిఆర్ ప్రశ్నించడం వెనుక అంతర్యం ఇదేనని అన్నారు. తెలంగాణ విషయమై జరుగుతున్న సంప్రదింపుల్లో భాగంగా ప్రజా సంఘాలమైన తమకూ కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిందని, ఈ నెల 10న ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, 11న హోంమంత్రి షిండే, ఆజాద్‌లను, 12న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎవరి వెంటాలేరని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వెంటే తెలంగాణ ప్రజలు ఉంటారని వారికి వివరిస్తామని తెలిపారు. తెలంగాణపై ముందడుగు వేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బ్రహ్మరధం పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు వెంకటేశం గౌడ్, చందు నాయక్, సంజీవ నాయక్, అరవింద్, ఆకుల విజయ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర ఏర్పాటు
english title:
kcr
Date:
Tuesday, July 9, 2013