వికారాబాద్, జూలై 8: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే వారు తప్పకుండా నిబంధనలు పాటించాలని వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం స్థానిక రవీంద్రమండపంలో డివిజన్‌లోని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేసే వారికోసం ఒక్క రోజులో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. రిజర్వేషన్‌ల కేటాయింపు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరిగాయని, వాటి విషయం ముగిసిందన్నారు. రేషన్‌డీలర్లు, సహకార సంఘ కార్యాలయం ఆఫీస్ బేరర్లు ఎన్నికల్లో పోటీచేయవచ్చన్నారు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని, కాంట్రాక్ట్ పద్దతిన పనిచేసే వారు పోటీ చేయవచ్చన్నారు. వికారాబాద్ డిఎస్పీ నర్సింలు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్, డిఎస్పీ, ఇతర పార్టీల పోలీసులను మోహరిస్తామన్నారు. వికారాబాద్ ఎంపిడివో వినయ్‌కుమార్ మాట్లాడుతూ మంగళవారం నుండి నామినేషన్లు స్వీకరించేందుకు క్లస్టర్‌లలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సిద్దంగా ఉంటారన్నారు. 9న ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ 13తో ముగుస్తుందని తెలిపారు. 14న నామినేషన్ల పరిశీలన, 15న అప్పీలు, 16న జాబితా విడుదల, 17న ఉపసంహరణలు, 19న తుదిజాబితా, గుర్తు కేటాయింపు జరుగుతుందన్నారు. సమావేశంలో తాండూర్ మార్కెట్ కమిటి చైర్మన్ రమేష్, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి కె.శివరాజ్, వికారాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు జాఫర్, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి విజయ్‌కుమార్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బస్వలింగం, పట్టణ పార్టీ అధ్యక్షుడు రాములు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్వర్‌షరీఫ్, డిఎల్‌పివో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి గ్రామ పంచాయతీ ఎన్నికల సమావేశానికి డివిజనల్ పంచాయతీ అధికారి అరగంట ఆలస్యంగా రావడం గమనార్హం. డివిజన్ స్థాయి సమావేశానికి కేవలం వికారాబాద్ సబ్‌డివిజన్ పోలీసులు మాత్రమే హాజరయ్యాయి. తాండూరు సబ్‌డివిజన్ పోలీసులు హాజరుకాకపోవడం విచిత్రం.
వైఎస్ ఆశయ సాధనకు పాటుపడాలి
మేడ్చల్, జూలై 8: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మేడ్చల్ నియోజకవర్గ వైకాపా సమన్వయ కర్త హరివర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జన్మదిన వేడుకలను మండలంలోని డబీల్‌పూర్, గౌడవెళ్లి, గిర్మాపూర్ తదితర గ్రామాలలో వైకాపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, అశోక్, జగన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: పేదల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేసి అన్ని వర్గాల లబ్ధి చేకూర్చిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్ అన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను సోమవారం జరిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు నల్లగారి భానుప్రకాష్, నందం గణేష్‌బాబు, రహమాన్, నరేందర్, ఎల్లస్వామి, శ్రీనివాస్, ప్రభాకర్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు సంజయ్‌కుమార్, డక్కి రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌లో..
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దివంగత నేత, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 64వ జయంతి వేడుకలను వైఎస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. సర్కిల్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో కూన కృష్ణగౌడ్, మహాలక్ష్మి ట్రస్టు చైర్మన్ కూన శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘణంగా నివాళులర్పించారు. మండల పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని పల్లవి వృద్ధుల, వితంతువుల, మెంటల్లీ రిటార్డెడ్ ఆశ్రమంలో జయంతి సందర్భంగా అనాథలకు కూన శ్రీశైలంగౌడ్ దుప్పట్లు, బియ్యంతో పాచు వంట సామాగ్రిని అందజేశారు. గాగిల్లాపూర్ లో వైఎస్సార్ జయంతి పురస్కరించుకొని జన్మదిన కేక్‌ను కట్‌చేసి పంచారు. విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఉప్పల్‌లో..
ఉప్పల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఉప్పల్, చిల్కానగర్, రామంతాపూర్, హబ్సిగూడలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పోగుల గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నేతలు ధన్‌పాల్‌రెడ్డి, జంపన ప్రతాప్, హరివర్ధన్‌రెడ్డి, అరుణ్, సత్తయ్య, రజనీకాంత్‌రెడ్డి పాల్గొని వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అకస్మాత్తుగా మృతి చెందిన రాఘవరెడ్డి కుటుంబానికి రూ.10వేలు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
పేద ప్రజల గుండె చప్పుడు
సరూర్‌నగర్: పేద ప్రజల గుండె చప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఆర్‌కెపురం డివిజన్ కార్పొరేటర్ దేప సురేఖా భాస్కర్‌రెడ్డి అన్నారు. రాజశేఖర్‌రెడ్డి 64వ జయంతి సందర్భంగా డివిజన్‌లోని చిత్రాలేవుట్ కాలనీలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి సోమవారం ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు డక్కియార్ నాయక్, చిలుకా ఉపేందర్‌రెడ్డి, గట్ల రవీందర్, పగడాల ఎల్లయ్య పాల్గొన్నారు.