హైదరాబాద్, జూలై 8: రాష్ట్ర ఎన్నికల కమీషన్ స్పష్టమైన ఆదేశాలు నిర్దేశించిన నియమాలను సూచించినప్పటికి అధికారుల అలసత్వం, వారి తప్పిదాల కారణంగా ఉమర్‌ఖాన్ దాయిరా(సంఘీనగర్)లో లేని ఓటర్ల సంఖ్య కనిపిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పంచాయతీలో సుమారు వేయ్య మంది ఓటర్లకంటే ఎక్కువ ఉండరని స్థానికలు పేర్కొంటున్నా పక్క గ్రామ పంచాయతీల పరిధిలోని సర్వే నెంబర్లలో నిర్మించుకున్న ఇండ్లలో నివసించే సుమారు 2,053 మంది ఓటర్లను ఉమర్‌ఖాన్ దాయిరా పంచాయతీలో లెక్క చూపిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేసినా స్థానిక మండల ఎన్నికల అధికారి స్పందించకపోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి పంచాయతీ పరిధిలో నివసించే జనాభా, దానికి ఆధారంగా పరిధిలోని ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకంగా ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్)కు ఆనుకుని ఉన్న కోహెడ, అనాజ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లను తమ పంచాయతీ పరిధిలో లెక్కగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్) గ్రామ పంచాయతీ ఏర్పాటు సమయంలో నిర్దిష్టమైన హద్దులు ఏర్పాటుచేసి రెండువేల జనాభా 50.59 హెక్టార్ల పరిధిని ఖరారు చేస్తూ జీవో ఎంఎస్ నెం.323, తేది: 21.06.1991న జారీచేసింది. దానికి భిన్నంగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సమయంలో స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారులు తమ గోడును వినకుండా అనాజ్‌పూర్, కోహెడ గ్రామాల పరిధిలోని సుమారు 1106 ఇళ్లలో నివశించే 2,053 మంది ఓటర్లను ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్) గ్రామ పంచాయతీ పరిధిలో నివశిస్తున్నట్టుగా ధృవీకరిస్తూ తుది ఓటర్ల జాబితా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తంచేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోహెడ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్) గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 10 నుండి 42 వరకు ఉన్న విస్తీర్ణాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా నిర్దేశించినా అందుకు భిన్నంగా సర్వే నెంబరు 442, అనాజ్‌పూర్‌లోని 184 ఇండ్లలో నివశించే 419 మంది ఓటర్లు, కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలోని 542 సర్వే నెంబర్‌లోని 697 ఇళ్లలో నివశించే 1163 మంది ఓటర్లను ఉమర్‌ఖాన్ దాయిరా ఓటర్ల జాబితాలో ప్రకటించడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం జారీచేసిన గెజిట్ ఆధారంగా పరిధిని నిర్దేశించి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు అందుకు భిన్నంగా నిన్నటివరకు ఇంటి అనుమతులు, ప్రక్క గ్రామం నుండి పొందినా సదరు ఇళ్లల్లో నివశించే ఓటర్లు మాత్రం ఉమర్‌ఖాన్ దాయిరా జాబితాలో ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. ఇదే పంచాయతీలో ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు ఉండడం, సంఘీనగర్‌లో మూతపడ్డ పరిశ్రమలో అప్పుడు పనిచేసే కార్మికులకు సంబంధించిన సుమారు 400 మంది పేర్లను ఓటర్ల జాబితాలోనుండి తొలగించక పోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయలోని అధికారులతో పాటు, మండల స్థాయ అధికా రులు ఏ ఒక్కరోజుకూడా ఓటర్ల జాబితాను పరిశీలించ లేదని, గ్రామంలో పర్యటించి వివరాలు తెలుసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఉదాహరణకు ఓటర్ల జాబితాలోని ఓటర్ క్రమ సంఖ్యల 1937, 1938, 1941, 1942కు సంబంధించిన ఓట్లు యూసుఫ్ పోమపాలలీ అనే వ్యక్తి పేరు మీద వయస్సు తేడా ఉందే తప్ప ఫొటో ఒక్కరిదేనని స్థానికులు ఓటర్ల జాబితాను చూపించారు. ఈ జాబితాలో ఇలాంటి ఓట్ల సంఖ్య సుమారు 200 వరకు ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామ పంచాయతీలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాజీ పార్లమెంటు సభ్యులు గిరీష్ సంఘీ నివాసంలో నలుగురు ఓటర్లు ఉన్నా 17 మంది ఉన్నట్లుగా ఓటర్ల జాబితాలో పేర్లు ప్రకటించారని, వారిలో నలుగురు మినహా మిగిలిన వారంతా పదేళ్ల క్రితమే నగరానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని గ్రామస్థులు వివరించారు. ఈ గ్రామ పంచాయతీలో అసలు ఉన్న ఓటర్లు ఎంతమంది? బయటవారు ఎంతమంది? ఈ జాబితాను గత పదేళ్లుగా పరిశీలించకుండానే తుది జాబితాను ప్రకటించడంపై అధికారుల నిర్లక్ష్యం ఎంతమేరకు ఉందో అర్థమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఓటర్ల జాబితాను పరిశీలించి సవరించాలని, తప్పును గుర్తించి దానికి కారణమై అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను స్థానికులు అభ్యర్థిస్తున్నారు.
* ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు * జాబితాలో పత్తాలేని వారి పేర్లు * పన్నులు చెల్లించేది ఒక పంచాయతీలో.. ఓట్లు వేసేది మరో పంచాయతీలో?
english title:
sanghi nagar
Date:
Tuesday, July 9, 2013