తార్నాక, జూలై 8: క్షతగాత్రులు ఆర్తనాదాలు మృతుల బంధువుల రోదనలు నాయకుల పరామర్శలతో సోమవారం గాంధీ ఆసుపత్రి దద్దరిల్లిపోయింది. సిటిలైట్ హోటల్ సికింద్రాబాద్‌లో ఇంతకాలం ల్యాండ్‌మార్క్‌గా నిలిచినప్పటికీ తాజాగా ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని పైగా ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ పెద్దలు అధికారుల స్పందన సహాయ కార్యక్రమాలు సరిగ్గాలేవని బాధితుల బంధువులు సిఎం రాకను తెలుసుకుని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేయడం తలకు మించిన భారంగా మారిపోయింది. ముఖ్యమంత్రి నేరుగా వచ్చి కొద్ది నిముషాల వ్యవధిలోనే వెళ్లిపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. దుర్ఘటన జరిగిన సోమవారం ఉదయం సంఘటన స్థలంలోనే 12మంది మృత్యువాత పడగా మరొక వ్యక్తి చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. తీవ్రమైన గాయాలతో 19 మంది ఆసుపత్రిలో చేరగా అందులో నలుగురు మాత్రం చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
చచ్చుపడిన పాలన... అనుభవం లేని సిఎం: బాబు
ముఖ్యమంత్రి అనుభవారాహిత్యంతో రాష్ట్రంలో పాలన చచ్చుబడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. సోమవారం సికింద్రాబాద్‌లోని సిటిలైట్ ఘటనాస్థలానికి చేరుకున్న చంద్రబాబు అటు నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి వచ్చారు. మృతుల కుటుంబాలను క్షతగాత్రుల బంధువులను పరామర్శించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆసుపత్రిలోనే గడిపి అనుచరవర్గాన్ని సహాయక చర్యలకు పురమాయించారు. ఆసుపత్రి అంతా కలియదిరుగుతూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు వేగవంతం చేశారు. మార్చురీలోనికి కూడా వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిస్సహాయత పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. వైపరీత్యాల సంగతి ప్రక్కనపెడితే ఇప్పటి పాలకులే ప్రజలకు పెద్ద వైపరీత్యంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. భవనం కూలి అక్కడికక్కడే 12 మంది ప్రాణాలు కోల్పోయి మరో 20 మంది ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి, అనుచర మంత్రులకు సమావేశాలే ముఖ్యమయ్యాయని, ఇది పాలకుల సిగ్గుమాలిన చర్యకు నిదర్శనంగా పేర్కొన్నారు. బాధితులను పరామర్శించి వారిని ఆదుకొనే చర్యలను పర్యవేక్షించాల్సిన సిఎం చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడం, మంత్రులు, అధికారులు ఒక్కరు కూడా ఆసుపత్రిలో లేకపోవడం విచారకరమని అన్నారు. 80 సంవత్సరాలకుపైగా ఉన్న భవంతిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో జిహెచ్‌ఎంసి అధికారులు విఫలమయ్యారని, ఈ ప్రమాదానికి పూర్తికారణం ప్రభుత్వానిదేనని అన్నారు. ఒక ఏడాదిలో ఐదు సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
* సిటీలైట్ వద్ద పోలీసుల అత్యుత్సాహం * తండోపతండాలుగా తరలివచ్చిన జనం * ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు బేజార్ * గాంధీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చంద్రబాబు పరామర్శ
english title:
gandhi
Date:
Tuesday, July 9, 2013