హైదరాబాద్, బేగంపేట, చార్మినార్, జూలై 8: సిటీలైట్ హోటల్ ఘటనతో సహాయక చర్యల పేరిట హడావుడి చేసిన పోలీసులు ధ్వంధవైఖరితో అవలంభించారని అక్కడకు చేరుకున్న మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినా, కేవలం గంట వ్యవధిలో ప్రారంభమైన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసే అంశంపై కనబర్చాల్సిన శ్రద్ధను పోలీసులు ముందుగా ట్రాఫిక్ ఆంక్షల అమలుపైనే ప్రదర్శించారన్న విమర్శ విన్పించింది. సహాయక చర్యల నిమిత్తమే ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నానమి చెప్పుకొస్తున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చిన రాజకీయ నేతలు, అమాత్యులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల బందోబస్తుకే పరిమితమయ్యారు. ఒక మాజీ మంత్రి వెంట దాదాపు యాభై మంది ఆయన అనుచరులు, గల్లీలీడర్లు సైతం గుంపులు గుంపులుగా వచ్చి సహాయక చర్యలకు ఆటంకాలు కల్గించినా, పట్టించుకోని పోలీసులు తమవారేమై పోయారోనన్న ఆందోళనతో రోధిస్తూ అక్కడకు వచ్చిన మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను ఏ మాత్రం జాలి, దయ లేకుండా తరమివేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వచ్చినపుడు ఆయా పార్టీలకు చెందిన నేతలకు దండాలు కొట్టి మరీ పోలీసులు ఘటనస్థలానికి అనుమతించటం పలువురితో వాగ్వాదానికి దారి తీసింది. పగలంతా బైబిల్ హౌజ్ వరకు ట్రాఫిక్‌ను అనుమతించిన అధికారులు సాయంత్రం కవాడిగూడ నుంచి సిటీలైట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బన్సీలాల్‌పేట నుంచి దారి మళ్లించారు. సోమవారం అమవాస్య, ఆపై ట్రాఫిక్‌ను దారి మళ్లించటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమై, దుకాణాలు మూతపడ్డాయి. ఫలితంగా వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులకు, ఘటన స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన నేతలకు కనీసం తాగునీరు కూడా లభించక ఇబ్బందులెదుర్కొన్నారు.
ఎలా కూలింది?
సికింద్రాబాద్‌లో అతి పురాతనమైన, పేరుగాంచిన సుమారు 87 ఏళ్ల చరిత్ర కల్గిన సిటీ హోటల్ ఇక కనుమరుగైంది. బతుకుదెరువు కోసం ఇక్కడ మోండామార్కెట్, బంగారు నగలను విక్రయించే పాట్ మార్కెట్, యంత్రాల విడి భాగాల కోసం రాణిగంజ్‌కు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హమాలీగా పనిచేసే వారెక్కువ మందికి సిటీలైట్ హోటల్ ఓ చక్కటి ల్యాండ్‌మార్క్. పై అంతస్తుల్లో అధిక మొత్తంలో హలీం తయారీ కోసం అయిదారు బట్టీలు నిర్మించటం వల్లే హోటల్ కుప్పకూలిందని మున్సిపల్ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు నిర్థారించారు. భవనానికి పిల్లర్లు లేకపోవటం, గోడలపైనే స్లాబ్‌ను నిర్మించటం భవనం కూలేందుకు ప్రధాన కారణాలని వ్యాఖ్యానించారు.
మర్రి శశిధర్‌రెడ్డి సందర్శన
సికిందరాబాద్‌లోని సిటీలైట్ హోటల్ కుప్పకూలడంతో పలువురు మృతి చెందిన సంఘటన స్థలాన్ని స్థానిక సనత్‌నగర్ ఎమ్మెల్యే, జాతీయ విపత్తుల నివారణ కమిటీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి సందర్శించారు. తన నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ సంఘటన తెలిసిన వెంటనే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్లు దేవేనంద్, కిరణ్‌మయి, మహేశ్వరి, స్థానిక నేతలు శ్రీహరి, కిషోర్‌కుమార్,దయానంద్, సుదర్శన్, పూర్ణానందం, బాలకృష్ణ ఉన్నారు.
సిటీలైట్ హోటల్ ఘటనతో సహాయక చర్యల పేరిట హడావుడి చేసిన
english title:
kanniiti paryantham
Date:
Tuesday, July 9, 2013