మచిలీపట్నం, జూలై 9: గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పిగా మారాయి. ఒకే పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు పోటీకి కాలుదువ్వుతుండటంతో నాయకుల పరిస్థితి కరవమంటే కప్పకు.. వదలమంటే పాముకు కోపం.. అన్న చందంగా తయారైంది. గ్రామస్థాయిలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు పోటీలోకి దిగటం వల్ల పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయా పార్టీల నాయకులు బెంబేలెత్తుతున్నారు. సాధ్యమైనంత వరకు రాజీ చేసేందుకు రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఒక కొలిక్కిరావటం లేదు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమై 13వ తేదీతో ముగియనుంది. ఒక్కో గ్రామంలో ఒక్కో అభ్యర్థినే బరిలోకి దింపేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులు గ్రామాల్లో తిష్టవేసి పరిస్థితిని సానుకూలంగా మలుచుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీకి చెందినవారు పెద్దమొత్తంలో పోటీకి దిగుతున్నారు. ఈ క్రమంలో పార్టీపరంగా ఎవరిని సమర్ధించాలనే ప్రశ్న ఎదురవుతోంది. అన్ని రాజకీయ పార్టీలను ఈ సమస్య వెంటాడుతోంది. అందుకుతగ్గట్టు గ్రూపు రాజకీయాలు కూడా బలంగా పని చేస్తున్నాయి. పైస్థాయి నాయకులు తమ అనుచరులను బరిలోకి దించేందుకు ఊతమిస్తున్నారు. తెరవెనుక రాజకీయాల వల్ల గ్రామాల్లో పట్టుకోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందన్న భావన ఆయా పార్టీల జిల్లా స్థాయి నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీకి చెందిన వారు ఇద్దరు నుంచి ఐదుగురు వరకు పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిని బుజ్జగింజలేక తలప్రాణం తోకకు వస్తోందని నాయకులు చెబుతున్నారు. ఏకతాటిపైకి తీసుకురాకపోతే దీని ప్రభావం సాధారణ ఎన్నికలపై గణనీయంగా పడే అవకాశం ఉంది. ఈ వైషమ్యాల వల్ల ఓట్లు చెల్లాచెదురై నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు. ఈనేపథ్యంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థులను బుజ్జగించి ఒక్కరు మాత్రమే బరిలో ఉండేవిధంగా రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల నాయకులకు
english title:
bujjagimpulu
Date:
Wednesday, July 10, 2013