మచిలీపట్నం, జూలై 9: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలిరోజు మంగళవారం జిల్లాలో స్వల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 9న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ 13వరకు జరగనుంది. తొలిరోజు జిల్లాలో 61 సర్పంచ్ పదవులకు, 115 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నం డివిజన్‌లో 17 సర్పంచ్ పదవులకు, వార్డు పదవులకు 51 మంది నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 11 మంది, వార్డు సభ్యుల పదవులకు 15 మంది, నూజివీడు డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 18 మంది, వార్డు సభ్యుల పదవులకు 33 మంది, గుడివాడ డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 15 మంది, వార్డు సభ్యుల పదవులకు 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ దశలో స్వల్పంగా నామినేషన్లు దాఖలు కాగా రానురాను ఈ సంఖ్య పెరగనుంది. అమావాస్య ఘడియలు మంగళవారం కూడా ఉండటంతో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. అలాగే పలు గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు మంతనాలు సాగుతున్నాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో రాజీ బేరాలు సాగుతున్నాయి. ఒకే అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల బుజ్జగింపులు మరోపక్క కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో తొలిరోజు నామినేషన్‌లు స్వల్ప మొత్తంలో దాఖలయ్యాయి.
* వార్డు సభ్యులకు 115..
english title:
sarpanch posts
Date:
Wednesday, July 10, 2013