జి.కొండూరు, జూలై 9: జి.కొం డూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం సిఐ బంగారురాజు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ బాధితుల్లో మైలవరానికి చెందిన పజ్జూరు నరసింహారావు (24) కిడ్నీని తొలగించారు. కిడ్నీని తొలగించని పక్షంలో నరసింహారావు ప్రాణాలకే ముప్పు ఏర్పడనున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కిడ్నీని తొలగించాల్సి వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రే నరసింహారావు కిడ్నీని తొలగించినట్లు తెలిసింది. కిడ్నీ తొలగించిన తర్వాత నరసింహారావు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. మైలవరానికి చెందిన సేదం కృష్ణారావు(42) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌పిహెచ్‌ఓ రవికుమార్ వెల్లడించారు. గుంటూరు నుంచి వైద్య నిపుణులు శస్తచ్రికిత్స చేసినా రక్తస్రావం ఆగటం లేదని వివరించారు. ఐసియులో ఉంచి వెంటిలేటర్‌పై కృష్ణారావుకు వైద్యం అందిస్తున్నారు. గుడిపూడి వెంకటరామయ్య(24), సింహాద్రి సూర్యనారయణ(45) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ప్రాథమిక నివేదిక అందజేశాం: ఎఎస్పీ
జి.కొండూరు, జూలై 9: జి.కొం డూరు పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనపై ప్రాథమిక నివేదికను ఎస్‌పికి అందచేసినట్లు ఎఎస్‌పి షిమోషి బాజ్‌పేయి వెల్లడించారు. ఆమె మంగళవారం సాయం త్రం స్థానిక పోలీస్టేషన్‌లో విచారణ కొనసాగించారు. పోలీస్టేషన్‌పై జరిగిన దాడి, కాల్పుల ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. విచారణ పూర్తయిన తర్వాత దర్యాప్తు వివరాలను తెలియచేస్తామని విలేఖరులకు తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు. నూజివీడులో బెజవాడ రాజేశ్వరి వాంగ్మూలాన్ని, జి.కొండూరులో రామకృష్ణ తల్లిదండ్రులు, బంధువుల వాంగ్మూలాలను, గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డ వారి వాంగ్మూలాలను నమోదు చేశామని స్పష్టం చేశారు. రామకృష్ణ మృతిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్తు వివరించారు. నూజివీడు డిఎస్‌పి ఎ శంకరరెడ్డి, నందిగామ డిఎస్‌పి డి సిహెచ్ హుస్సేన్, మైలవరం ఎస్‌ఐ సిహెచ్ నాగప్రసాద్ తదితరులు విచారణకు సహకరిస్తున్నారు. ఎన్నికల విధులను, పోలీస్టేషన్‌లో రోజు వారి కార్యకలాపాలను డిఎస్‌పి శంకరరెడ్డి ఆధ్వర్యంలో మైలవరం ఎస్‌ఐ నాగప్రసాద్ నిర్వర్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ వద్ద మోహరించిన అదనపు బలగాల సంఖ్యను తగ్గించారు. మరోపక్క విజయవాడ సబ్ కలెక్టర్ విచారణలో భాగంగా స్థానిక తహశీల్దార్ డి గిధ్యోన్ కోడూరులో మృతుడు రామకృష్ణ తల్లిదండ్రులు, బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.