తోట్లవల్లూరు, జూలై 9: మండలంలో పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. పార్టీ రహిత ఎన్నికలైనా పార్టీలు బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్ పదవికి పోటీ చేయటం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలు ఒక పునాదిగా ఉంటాయని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకబడి ఉంది. నామినేషన్ల పర్వం మంగళవారం మొదలవ్వగా చాలా గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల ఎంపికి ఒక కొలిక్కి రాలేదు. అధికార పార్టీ తరపున ఎమ్మెల్యే డివై దాస్ ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో వెనుకబడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా ఉన్న నాయకులు వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్లటం కాంగ్రెస్‌కు లోటుగా మారింది. ముఖ్యంగా మండల కేంద్రం తోట్లవల్లూరులో నాలుగు రోజుల నుంచి నాయకులు సమావేశవౌతూ నువ్వు పోటీచేయి అంటే నువ్వు పోటీ చేయి అంటూ ఎవరికి వారు వెనుకంజ వేస్తున్నారు. రొయ్యూరులో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి కలసి ఉమ్మడిగా సర్పంచ్ అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నాయి. ఇక్కడ ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. పాములలంకను ఎమ్మెల్యే దాస్ ఎంతో అభివృద్ధి చేసినా అక్కడ కూడా పోటీకి కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావటంలేదు. చినపులిపాకలో సర్పంచ్ అభ్యర్థి ఎంపిక జరగలేదు. బొడ్డపాడులో పంచాయతీ మాజీ సభ్యుడు మూడే శివశంకర్ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ గ్రామంలో కాంగ్రెస్ కాస్త బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వల్లూరుపాలెంలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయటం లేదని తెలుస్తోంది. భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి, గుర్విందపల్లి, పెనమకూరు, కనకవల్లి, గరికపర్రు గ్రామాల్లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా తయారయింది. ఆయా గ్రామాల్లో నాయకులున్నా కార్యకర్తల బలం లేని విషయం స్పష్టమవుతోంది. ఐలూరులో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే పరిస్థితి ఉందని చెపుతున్నారు. ఇక్కడ సుంకర రాఘవరావు బ్రదర్స్, కాపులు, దళితుల మద్దతు కాంగ్రెస్‌కు బలంగా ఉంది. ఏదిఏమైనా పంచాయతీ ఎన్నికలకు టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి దూకుడుగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నత్తనడకన నడుస్తోంది. వైఎస్‌ఆర్‌సిపిలోకి కాంగ్రెస్ ముఖ్య నాయకులు వెళ్ళగా ఆ లోటును భర్తీ చేయలేకపోవటంతో ఇపుడు ఈ పరిస్థితి ఎదురవుతోందని కొందరు కార్యకర్తలు వాపోతున్నారు.
మండలంలో పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు
english title:
congress
Date:
Wednesday, July 10, 2013