విజయవాడ, జూలై 9: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు సహకరించాలని సబ్ కలెక్టర్ డి హరిచందన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి మార్గదర్శక సూత్రాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ డి హరిచందన ఆమె కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ నెల 27న పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ నెల 3 నుండి అమలులోవున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 31 వరకు అమలులో వుంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, దేవాలయాల వంటి ప్రదేశాలను వేదికలుగా ఉపయోగించరాదన్నారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి మాత్రమే ప్రచార సమయంలో వాహనం వినియోగించుకునేందుకు అనుమతించడం జరుగుతుందని, వాహనం తిరిగే సమయంలో అభ్యర్థి తప్పక వాహనంలో ఉండాలని, లేని పక్షంలో వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు వాహనాలను వినియోగించుకునేందుకు అనుమతిలేదని, వాహనాన్ని వినియోగించినట్లైతే వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. చౌకధరల దుకాణాల్లో కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఉంచిన అమ్మహస్తం సంచుల పంపిణీని తక్షణమే నిలిపివేసి సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకోవాలన్నారు. చౌకధరల దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏసిపిలు టి హరికృష్ణ, ఎస్‌కె షకీలాభాను, డివి నాగేశ్వరరావు, అర్బన్ తహశీల్దార్ ఆర్ శివరావు, జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎకె అన్సారి, నరహరశెట్టి శ్రీహరి, టిడిపి ప్రతినిధులు గోగుల రమణరావు, కె హనుమంతరావు, వి రాజేష్, వైఎస్సార్ సిపి ప్రతినిధులు తాడి శకుంతల, బిజెపి ప్రతినిధులు కె సుబ్రహ్మణ్య ఆర్ముగం, బండి కాళేశ్వరరావు,సిపిఐ ప్రతినిధి ఎం కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పంచాయతీ ఎన్నికలను
english title:
code
Date:
Wednesday, July 10, 2013