విశాఖపట్నం/శ్రీకాకుళం, జూలై 9: సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ నగరంలో మంగళవారం నిరసనలు హోరెత్తాయి. కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి సమైక్యాంధ్రపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని లేని పక్షంలో ఇళ్ళ వద్ద సత్యాగ్రహం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర ప్రజాపోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు జిఏ నారాయణరావు హెచ్చరించారు. నిరసన తెలియచేస్తూ పురంధ్రీశ్వరికి చీర, సారె.. సుబ్బరామిరెడ్డికి కమండలం, విభూథి పార్శిల్ చేశారు. ప్రత్యేక తెలంగాణపై ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో అక్కడే ఉంటున్న పురంధ్రీశ్వరి, టిఎస్సార్‌లు సమైక్యాంధ్ర గురించి పట్టించుకోవడం లేదన్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద మంగళవారం సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి (14 యూనివర్శిటీల సంఘం) ఆధ్వర్యంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థి జేఏసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు నోరెత్తటం లేదన్నారు. స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే ఈ నెల 12న సామూహిక నిరాహారదీక్ష చేస్తామన్నారు. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రిని తెలంగాణపై రోడ్‌మ్యాప్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కోరటం తగదన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. అలాగే సమైక్యాంధ్రపై విధాన ప్రకటన చేయాలని కోరుతూ ఈ రెల 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో దీక్ష చేపట్టనున్నట్టు సమైక్యాంధ్ర యువజన జెఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ చెప్పారు. 14, 15 తేదీల్లో విశాఖలో భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. 12న కుల సంఘాలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదంటూ శ్రీకాకుళంలోని అంబేద్కర్ వర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం తరగతులు బహిష్కరించి, జాతీయ రహదారిపైకి చేరుకుని కెసిఆర్ డౌన్..డౌన్.., సమైక్యాంధ్రయే ముద్దు..తెలంగాణ వద్దంటూ నినాదాలతో ధర్నా సాగించారు. సమైక్యాంధ్ర ఫోరం అధ్యక్షులు బలగప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమబాటలో ఉద్యోగ జెఎసి
నాగార్జున యూనివర్సిటీ: ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం కాకుండా కాపాడటం కోసం అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలకు సైతం పూనుకుంటామని సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి కన్వీనర్ బి రాజశేఖర్ తెలిపారు. మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ తమ భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి, వారిని అరెస్టు చేయటం ద్వారా ప్రభుత్వం విద్యార్థులను వేధిస్తోందని అన్నారు. విద్యార్థులను వేధించటం వంటి నీచరాజకీయాలను స్వస్తి పలికి రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇప్పటివరకు ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్న విద్యార్థి జెఎసికి మద్దత్తుగా సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకుంటుందని హెచ్చరించారు.
అనంతలో నిరాహార దీక్షలు
అనంతపురం: అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటోంది. సమైక్యాంధ్ర కోసం వివిధ ప్రజా సంఘాలు, సమైక్యాంధ్ర నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితితో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు సమైక్యాంధ్ర కోసం వినూత్న రీతిలోకార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల బంద్, ర్యాలీలు, మేధావుల సదస్సులు, రచయితలు, కవుల సమావేశాలు, తీర్మానాలు, రాస్తారోకోలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు, రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
....................
కేంద్రమంత్రి పురంధ్రీశ్వరికి చీర, సారె..ఎంపీ సుబ్బరామిరెడ్డికి కమండలం విభూథి పంపిస్తున్న దృశ్యం. అనంతపురంలో జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు
.................
నామినేషన్లలో సెంటిమెంట్!
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు/ఒంగోలు/చిత్తూరు, జూలై 9: రెండేళ్ల ఆలస్యంగా ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తొలిరోజు స్పందన చాలా తక్కువగా కనిపించింది. అసలే ఆషాఢమాసం, శుద్ధ పాడ్యమి, ఆపై మంగళవారం కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు అమంగళమని భావించారు. అభ్యర్థులు ముహూర్తం చూసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాల్లో 931 పంచాయతీలకుగాను కేవలం 31 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. తొలిరోజున సర్పంచుల్లో నాలుగుశాతం కూడా దాఖలు కాలేదని ఓరకంగా విశే్లషించాలి. పంచాయతీ వార్డులు జిల్లావ్యాప్తంగా 8834కు ఉండగా కేవలం 32 నామినేషన్లు మాత్రమే తొలి రోజు దాఖలయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఒక్కశాతానికి కూడా వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదని చెప్పాలి. ముత్తుకూరు మండలంలో పొట్టేంపాడు పంచాయతీకి ఓ వికలాంగ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లాల్లో తొలిరోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మందకొడిగా సాగింది. ఒంగోలు డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 29, వార్డు మెంబర్లకు 34 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలో తొలివితడగా తిరుపతి డివిజన్‌లోని 14మండలాల్లోని 399 పంచాయతీల్లో సర్పంచ్‌కు 48 నామినేషన్లు దాఖలయ్యాయి. 3,586 వార్డులకు 67 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో
ఖమ్మం/గుంటూరు/కృష్ణా: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం మంగళవారం ప్రారంభమైంది. ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సర్పంచ్ పదవులకు 129 నామినేషన్లు, వార్డు మెంబర్లకు 246 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం జిల్లాలో సర్పంచ్ పదవులకు పది, వార్డు మెంబర్ల పదవులకు 23 మంది నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లాలో సర్పంచ్ పదవులకు 58, వార్డు మెంబర్ల పదవులకు 108 మంది నామినేషన్లు వేశారు. కృష్ణా జిల్లాలో సర్పంచ్ పదవులకు 61, వార్డు మెంబర్ల పదవులకు 115 మంది తమతమ నామినేషన్లు దాఖలు చేశారు.
గోదావరి జిల్లాల్లో ..
కాకినాడ/ఏలూరు: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాలో తొలి రోజైన మంగళవారం సర్పంచ్ పదవులకు 225 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పు గోదావరిలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 134 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు సభ్యులకు సంబంధించి 383 నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ డివిజన్‌లో 22 సర్పంచ్ నామినేషన్లు, 40 వార్డు సభ్యుల నామినేషన్లు, పెద్దాపురం డివిజన్‌లో 37 సర్పంచ్, 126 వార్డు సభ్యుల నామినేషన్లు, రంపచోడవరం డివిజన్‌లో 9 సర్పంచ్‌లు, 23 వార్డు సభ్యుల నామినేషన్లు, అమలాపురం డివిజన్‌లో 22 సర్పంచ్‌లు, 55 వార్డు సభ్యుల, రాజమండ్రి డివిజన్‌లో 44 సర్పంచ్‌లు, 139 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి రోజు సర్పంచ్ పదవులకు 91 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యత్వ పదవులకు 206 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో మొత్తం నాలుగు డివిజన్లలోని 884 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
వైకాపా అభ్యర్థి కిడ్నాప్?
బొబ్బిలి (రూరల్), జూలై 9: విశాఖ జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామంలో వైఎస్సార్‌సిపి మద్దతు అభ్యర్థిగా పంచాయతీ బరిలోకి దిగాలనుకుంటున్న ఎ రామసూర్య ప్రతాపనాయుడు మంగళవారం కిడ్నాప్‌కు గురైనట్టు సమాచారం. ఈయన ఆదర్శ రైతుగా పనిచేస్తున్నాడు. విజయనగరంలోని వ్యవసాయశాఖ జెడి ఇంటికి వెళ్తుండగా, కారులో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. అయితే ఆ తరువాత రంగరాయపురం గ్రామానికే చెందిన మరో ఆదర్శ రైతు వి సత్యారావుతో ప్రతాపనాయుడు ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. 13న సాయంత్రం తనను విడిచి పెడతానన్నారని, రంగరాయపురంలో ఎవరైనా నామినేషన్ వేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించినట్టు ప్రతాపనాయుడు తెలిపారు.
పారిశ్రామికవేత్త ప్రసాద్ అదృశ్యం
యానాం, జూలై 9: ప్రముఖ పారిశ్రామికవేత్త, కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని ఆనంద్ రీజెన్సీ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకరప్రసాద్ (54) అదృశ్యమయ్యారు. యానాంలోని హోటల్ పర్యవేక్షణకు వచ్చిన ఆయన సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లి, తిరిగి రాలేదు. ఈ మేరకు రవిశంకరప్రసాద్‌కు వ్యాపార భాగస్వామి, సోదరుడి వరసైన పి కిరణ్ సోమవారం సాయంత్రం యానాం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని యానాం సిఐ కపిలగురు తెలిపారు. చెన్నైలో జెమిని గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టరైన రవిశంకరప్రసాద్ వారి వ్యాపార సంస్ధలలో ఒకటైన రీజెన్సీ హొటల్‌ను పరిశీలించేందుకు ఆదివారం యానాం వచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు హోటల్ నుండి మార్నింగ్ వాకింగ్‌కని వెళ్లిన ఆయన 3.22 నిమిషాలకు యానాం టోల్‌గేటు దాటినట్లు సిసి టివిల పుటేజ్ ద్వారా గుర్తించారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని సిఐ కపిలగురు తెలిపారు. ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తుచేస్తున్నామన్నారు. యానాం గోదావరి తీరంలో బోట్లపై గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుండి రవిశంకర్ బంధువులు యానాం ఆనంద్ రీజెన్సీకి చేరుకున్నారని ఆయనకు ఎవరైనా శత్రువులున్నారా అనే కోణంలో బంధువుల నుండి సమాచారం సేకరిస్తున్నామని సిఐ తెలిపారు..
మోడీ ప్రధాని కావాలి
బిజెపి నేత వెంకయ్యనాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 9: దేశంలో సుస్థిర పాలన, సమర్థవంతమైన నాయకత్వం కోసం రానున్న సాధారణ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే సమస్యలు పరిష్కరించగలరని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామని, కామన్ సివిల్‌కోడ్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. నదులు అనుసంధానం చేస్తామని, స్విస్ బ్యాంకు నుంచి నల్లదనం రాబడతామని స్పష్టం చేశారు. మంగళవారం విజయనగరంలో జరిగిన ఆ పార్టీ ప్రజా చైతన్య సదస్సు, ఆత్మీయ సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ధరలు అదుపు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 33సార్లు పెట్రోలు ధరలు, 14 సార్లు ఎరువుల ధరలు పెంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశంలోను, ప్రజలు పాతాళంలోకి నెట్టబడ్డారని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా కుంభకోణాలే కన్పిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి పదవి ఉన్నా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సరిహద్దు దేశాలతో దౌత్య సంబంధాలుగానీ, అంతర్గత సమస్యలనుగానీ పరిష్కరించలేని స్థితిలో ప్రధాని ఉన్నారని ఆరోపించారు. దేశంలో ద్రవ్యలోటు, రాబడి లోటు, తాజా కరెంట్ లోటు, వాణిజ్యలోటు, పరిపాలన లోటు ఇలా.. అన్నింటా లోటు ఏర్పడిందన్నారు. ఎన్డీఏ హయాంలో డాలర్ విలువ 42 రూపాయలు కాగా, కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత 61 రూపాయలకు పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం విద్యుత్ కోతలతో రాష్ట్రం అల్లాడుతోందన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్న 60 లక్షల కోట్ల రూపాయల నల్లదనాన్ని రాబట్టడంలో కేంద్రం విఫలమైందన్నారు. నక్సల్స్ దమన కాండ పెరిగిపోయిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటిని పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి తెలంగాణ విభజనకు కట్టుబడి ఉందన్నారు.