విజయవాడ, జూలై 9: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల వద్ద ప్రార్థనలను నిర్వహించుకునే ముస్లింలకు అవసరమైన వౌలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఏర్పాటు చేయవలసిన వౌలిక వసతులపై మంగళవారం సాయంత్రం కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంజాన్ ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. నెల రోజుల పాటు ఉదయం నెలవంకను చూసిన అనంతరం తిరిగి సాయంత్రం నెలవంకను చూసే వరకు కఠోరమైన ఉపవాస దీక్షను ఆచరిస్తారన్నారు. మసీదుల వద్ద వందలాది మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలను నిర్వహించుకుంటారన్నారు. ప్రార్థనల సమయంలో మసీదుల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం ఉపవాప దీక్షను విరమించి సమాజ్ అనంతరం ముస్లింలు ఆహార పానీయాలను సేవించడం జరుగుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా ముస్లింలకు మసీదుల వద్ద అవసరమైన ఆహార పదార్థాల అమ్మకాలను నిర్వహించేలా ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేయాలని కార్మిక శాఖాధికారులను ఆదేశించారు. మసీదు పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఏర్పాట్లను ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, పారిశుద్ధ్య పనులను పంచాయతీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ కమిషన్లు పర్యవేక్షించాలన్నారు. వర్షాకాలం సందర్భంగా మసీదులు, పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వర్షపు నీరు నిలువ వుండకుండా పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని పంచాయతీ శాఖాధికారులను ఆదేశించారు. మసీదుల మరమ్మతులకు, నిర్వహణకు అవసరమైన నిధులను వక్ఫ్‌బోర్డు అధికారులు సమకూర్చాలన్నారు. పౌర సరఫరాల అధికారులు ముస్లింలకు పంచదార, గోధుమ వంటి సరుకులు చౌక ధరల దుకాణాలు, బహిరంగ మార్కెట్‌లలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. నమాజ్ నిర్వహించుకోవడంలో మసీదుల వద్ద ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముస్లింలు వారి సమస్యలను 0866 2570206 నందు తెలియజేస్తే తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్‌కుమార్, డిసిపి ఖాన్, మైనార్టీ కార్పొరేషన్ ఇడి సాంబశివరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ బి మోహనకృష్ణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సత్యపాల్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వి చిట్టిబాబు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు, తిరువూరు మున్సిపల్ కమిషనర్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల వద్ద
english title:
ramzan
Date:
Wednesday, July 10, 2013