పాతబస్తీ, జూలై 9: నైరుతీ రుతు పవనాలు రైతుల పాలిట ఏరువాకగా మారగా అదే రుతుపవనాలు కూరగాయల తోటలు చీడ పీడలను తట్టుకొని దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. గతనెల మొదటివారంలో కిలో రూ.30 అమ్మిన వంకాయలు నేడు కిలో కేవలం రూ.8లకే లభిస్తున్నాయి. మంగళవారం విజయవాడ నగరంలోని అన్ని రైతుబజారుల్లో కూరగాయలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. నగర వీధుల్లో తోపుడు బండ్ల నిండా బీరకాయలు, వంకాయలు, దొండ, బెండకాయలే కల్పిస్తున్నాయి. గులాబి వంకాయలు కిలో రూ.8, కాంతులు వంకాయలు కిలో రూ.6లకే లభిస్తున్నాయి. రూ.13కి అమ్మిన బెండకాయలు నేడు రూ.8లకే అమ్ముతున్నారు. పచ్చిమిర్చికి కిలో రూ.28 గతనెల్లో అమ్మగా నేడు కిలో రూ.11లకే అమ్ముతున్నారు. బీర రూ.20 నుండి 11లకు, దొండ కిలో రూ.12 నుండి నేడు రూ.6లకు అమ్ముతున్నారు. రూ.26 అమ్మిన కాకర నేడు కిలో రూ.10లకే లభిస్తున్నాయి. చామదుంప కిలో రూ.32 నుండి ధర తగ్గి రూ.24కి చేరింది. కిలో రూ.16 నుండి 20 అమ్మిన దోసకాయలు నేడు కిలో రూ.10లకు, గోరుచిక్కుడు కిలో రూ.28 నుండి రూ.18కి తగ్గింది. బీన్స్ కిలో రూ.84 నుండి ధరలు తగ్గి రూ.38కి లభిస్తున్నాయి. బంగాళ దుంపలు మాత్రం ధర నిలకడగా రూ.16 మీద ఉంది. టమాటా, క్యారెట్స్ మాత్రం ధరలు ఇంకా అందని ద్రాక్షాగానే మిగిలాయి. టమాటా కిలో రూ.34, క్యారెట్ రూ.46లుగా నిలకడగా ఉంది. సామాన్యులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అల్లం మాత్రం ఘాటు తగ్గి కిలో రూ.184 నుండి దిగివచ్చి నేడు కిలో రూ.152లకే అమ్ముతున్నారు. వంటనూనె నేడు ధరతగ్గి లీటరు రూ.93లకి దిగింది. టమాటా, క్యారెట్ మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుండి దిగుబడి చేసుకోవడంలో వాటి ధరలు తగ్గడం లేదని వ్యాపారులు తెలిపారు. ఈ నెలాఖరుకి కృష్ణానది ఆయకట్టు ప్రాంతాలు కృష్ణా, గుంటూరు జిల్లాలోని పంట అందుబాటులోకి వస్తుందని అప్పటి వరకూ వాటి ధరలు తగ్గవంటున్నారు.
నైరుతీ రుతు పవనాలు రైతుల పాలిట ఏరువాకగా మారగా అదే రుతుపవనాలు
english title:
vegitables
Date:
Wednesday, July 10, 2013