** సాహసం (ఫర్వాలేదు)
తారాగణం:
గోపీచంద్, తాప్సీ, సుమన్
శక్తికపూర్, అలీ, నారాయణరావు
వాసు తదితరులు.
కెమెరా: శ్యామ్‌దత్
సంగీతం: శ్రీ
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
చంద్రశేఖర్ ఏలేటి
చందమామ కథలంటే పిల్లలకు పెద్దలకు కూడా ఇష్టమే. అందులో కాస్త సాహసాలు దట్టించిన కథలంటే మరీనూ. అందుకే ఆధునిక కాలంలో కూడా అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో సాహసగాధలు తెరకెక్కుతుంటాయి. ఇలాంటి సాహసాలకు నిధి వేట లాంటి ఆకర్షణ తోడయితే, మరీ ఆసక్తికరంగా వుంటుంది. అయితే ఈ తరహా సినిమాలకు కాస్త వ్యయ ప్రయాసలు ఎక్కువ. అందుకే భారీ వ్యయానికి, వసూళ్లకు అవకాశం వున్న హాలీవుడ్‌లోనే ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మన దగ్గర అడపాదడపా కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి చేసిన అలాంటి ప్రయత్నమే ‘సాహసం’. ఇటీవల బాగా పాపులర్ అయిన గ్రాఫిక్ విన్యాసాలను జోడించి, నిధి వేటను సాగించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఆ వేట వెనకు విషయం ఏమిటంటే..
గౌతమ్ (గోపీచంద్) తాత (సుమన్)దేశ విభజన కాలంలో పెషావర్‌లో వజ్రాల వర్తకుడు. విభజన సమయంలో చెలరేగిన హింసకు భయపడి, తన సొత్తుతో పారిపోతూ, ఓ ఆలయంలో తలదాచుకుంటాడు. నిజానికి ఆ ఆలయం కింద కనిష్కుల కాలం నాటి నిధి వుంటుంది. అనుకోకుండా నిధి ద్వారం తెరుచుకుని, ఇతగాడి సొత్తు అందులో కలిసిపోతుంది. ఆ మాట వీలునామా రాసి, అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను డైరీగా రూపొందించి, ఓ లాకెట్‌తో కలిపి, రహస్యంగా దాచి చనిపోతాడు. ఆ తరువాత అతగాడి కొడుకు పేదరికంలోనే వుంటూ వస్తాడు. ఇది గతం.
ఇక వర్తమానానికి వస్తే, మనవడు గౌతమ్ (గోపీచంద్) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. డబ్బుల కోసం తహతహలాడుతుంటాడు. అలాంటి సమయంలో ఇంటి పైకప్పుకు కన్నపడి, ఈ నిధి సంగతి తెలుస్తుంది. కానీ ఆ ఆలయం పాకిస్తాన్‌లో పెషావర్ సమీపంలో వుండడంతో, శ్రీనిధి(తాప్సీ) సాయంతో అక్కడకు బయల్దేరతాడు. అక్కడ అదే నిధి కోసం వేటాడుతున్న సుల్తాన్ (శక్తికపూర్) బృందంతో ఢీకొంటాడు. చివరకు తన తాత సొత్తు ఎలా సంపాదించాడన్నది మిగిలిన కథ.
నిధి వేట సినిమా అంటే లొకేషన్లు, ఆపై సవాలుపై సవాలుగా ఎదురయ్యే సమస్యలతో కూడిన స్క్రిప్ట్ కీలకంగా వుంటాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’లో ఎడారి ప్రాంతం, ‘టక్కరిదొంగ’లో విదేశీ లొకేషన్లు కనువిందు చేస్తాయి. ‘సాహసం’ సినిమా కోసం పాకిస్తాన్ పెషావర్ ప్రాంతాన్ని తలపించే లఢక్ తదితర ప్రదేశాలను షూటింగ్ లొకేషన్లుగా ఎంచుకోవడం వరకు బాగానే వుంది. కానీ ఆపై నిధి వేట మొత్తాన్ని గ్రాఫిక్స్‌కు వదిలేసారు. అవి అత్యంత సహజంగానే వున్నా, సవాళ్లు సమస్యల చిక్కుముళ్లు ఇట్టే విడిపోతూ, సినిమా అలా అలా దిగుడుబాటలో బండిలా సాగిపోతుంది తప్ప, ఉత్కంఠకు గురిచేయదు. ఈ విషయంలో స్క్రిప్ట్ మరికాస్త బిగుతుగా వుంటే మరింత బాగుండేది. ఇక దర్శకుడు సినిమాను హాలీవుడ్ స్థాయిలో సీరియస్‌గా రన్ చేయాలని చూసాడు. తెలుగుసినిమా రొటీన్ వ్యవహారాలైన రొమాన్స్, డ్యూయట్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలీ, విలన్ క్యారెక్టర్ చేసిన శక్తి కపూర్‌ల ద్వారానే కాస్త ఫన్ పండించడానికి చూసారు. అది ఫలితం ఇచ్చింది కూడా. సాధారణంగా సినిమాకు సెకండాఫ్ ఆయువు పట్టుగా నిలుస్తుంది. ద్వితీయార్థం బాగుంటే, ప్రథమార్థంలో వ్యవహారాలు ప్రేక్షకులు ఇట్టే మర్చిపోతారు. ఈ సినిమాకు కూడా అదే జరిగింది. ఆ మర్చిపోవడం అన్నది సినిమాకు సంబంధించిన లాజిక్‌ల విషయంలో కూడా జరిగింది. అదే సెకండాఫ్ రంజుకా లేకుంటే, జనాలకు లాజిక్‌లు మిస్సయిన సంగతి గుర్తుకొచ్చేది. ప్రథమార్థంలో దర్శకుడి చాదస్తం కొంత ఇబ్బందికి గురిచేసినా, ద్వితీయార్థంలో కథ, నిధివేట, గ్రాఫిక్స్ ఆకట్టుకుని, సినిమాను గట్టెక్కించాయి.
గోపీచంద్ సినిమాకు అనుగుణంగా తన నటనను మార్చుకుని, చేసిన తీరు బాగుంది. తాప్సీకి పెద్దగా పాత్రమీ లేదు. ఉన్నంతలో ఓకె. విలన్‌గా శక్తికపూర్ బాగాచేసాడు, డబ్బింగ్ కూడా బాగుంది. అలీ కనిపించిన కాస్సేపు బాగానే నవ్వించాడు. మిగిలిన వారందరికీ చిన్న చిన్న పాత్రలే.
సినిమాకు నటీనటుల కన్నా సాంకేతిక నిపుణులే కీలకం. అందునా ఫొటోగ్రఫీ. శ్యామ్‌దత్ ఆ బాధ్యతను బాగా నిర్వహించాడు. కొత్త లొకేషన్లు, అక్కడి పోరాటాలు, చేజింగ్‌లు బాగా తెరపైకి తెచ్చాడు. ఇక చాన్నాళ్ల తరువాత శ్రీ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలకు పెద్దగా అవకాశం లేదు. రెండు పాటల్లో ఒకటి తన స్టయిల్‌లో చేసాడు. అది అతని స్టయిల్ నచ్చేవారికి ఓకె. రెగ్యులర్ పాటలే నచ్చేవారికి అంతగా నప్పదు.
మొత్తం మీద పాతిక కోట్ల ఖర్చుకు సాహసించిన నిర్మాత దర్శకులకు మంచి ఫలితమే ఇచ్చింది సాహసం.