** భాగ్ మిల్కా భాగ్ (ఫర్వాలేదు)
తారాగణం:
ఫర్హాన్ అఖ్తర్, సోనమ్ కపూర్
రెబెకా బ్రీడ్స్, దలీప్ తాహిల్
ప్రకాష్‌రాజ్, పవన్ మల్హోత్రా
దివ్యాదత్తా తదితరులు
కథ: రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా
సినిమాటోగ్రఫీ: బినోద్ ప్రధాన్
సంగీతం: శంకర్ మహదేవన్
స్క్రీన్‌ప్లే: ప్రసూన్ జోషి
నిర్మాత, దర్శకత్వం:
రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా
చరిత్రని తెరకెక్కించటం మాటలు కాదు. ఒక జీవితకాలాన్ని కొద్ది గంటలకు కుదించటం అంటే ఆ జీవితంలోకి తొంగిచూసి తరచి తరచి శోధించి అనే్వషించి.. కొన్ని పేజీల్లోకి మార్చటం. ఏ అంశాన్ని ఉంచాలి? ఏ సంఘటనల్ని స్క్రిప్ట్‌లో రాయకూడదు? అన్నది ఆ వ్యక్తి జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే సాధ్యపడుతుంది. అయినప్పటికీ బేరీజు వేసుకొని.. యథాతథంగా సెల్యులాయిడ్‌పై చూపిస్తే.. అది డాక్యుమెంటరీ కావొచ్చు. విసుగు పుట్టించవచ్చు. కాబట్టి మెలోడ్రామా తప్పనిసరి. అన్ని జీవితాల్లోనూ అటువంటి నాటకీయత ఉండదు. కానీ మిల్కాసింగ్ లైఫ్ అందుకు మినహాయింపు. స్వతహాగా ‘మిల్కాసింగ్’ అథ్లెట్ అని మాత్రమే చాలామందికి తెలుసు. ఎక్కడ పుట్టాడో? ఎలాంటి జీవిత వేదనని అనుభవించాడో? క్లిష్ట పరిస్థితులకు ఎదురీది అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎలా ఎదిగాడో? చాలామందికి తెలీదు. ఆయా సంఘటనల్ని సన్నివేశాల రూపే ణా రాసుకొని.. మిల్కాసింగ్ తెర వెనుక జీవితాన్నీ.. ట్రాక్‌పై అతడి వేగాన్ని పట్టేశాడు దర్శకుడు రాకేష్.
కథ- ఒక పల్లెటూళ్లో పంజాబీ కుటుంబానికి చెందిన మిల్కా జీవితం ఆడుతూ పాడుతూ గడిచిపోతూంటుంది. ఇంత లో దేశ విభజన జరుగుతుంది. ముష్కరుల దాడిలో తన కుటుంబాన్ని కోల్పోతాడు మిల్కా. తనని ప్రాణంగా ప్రేమించే అక్క దూరమవుతుంది. శరణార్థ శిబిరంలో రొట్టె కోసం తగవు. కొద్దిరోజులకు అక్క, బావ ఆ శిబిరానికి చేరుకుంటారు. కానీ బావకి మిల్కా అంటే పడదు. అతడొక భారంగా భావిస్తాడు. విభజన గొడవలన్నీ సద్దుమణగటం.. మిల్కా ఆవారా గాళ్ల సావాసం చేయ టం ఒకేసారి జరుగుతాయి. రైల్లో బొగ్గు దొంగతనం చేస్తాడు. పేకాట ఆడతాడు. బొగ్గు దందాతోనే పెరిగి పెద్దవాడవుతాడు. అక్కడ ‘బిరో’ (సోనమ్ కపూర్) పరిచయమవుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఏనాటికైనా- దేశం గర్వించేట్టు బతుకుతానంటాడు. బొగ్గు దొంగిలించటం మానేస్తాడు. జీవనం కోసం ఆర్మీలో చేరతాడు. దాంతో అతడి జీవితమే మారిపోతుంది. పరుగు. అదే లక్ష్యం. అదే ట్రాక్. అదనంగా ఇచ్చే పాల కోసం పరుగు. మరో గుడ్డు కోసం తాపత్రయం. అతడిలోని కోరికని ‘ట్రాక్’పై పెట్టాలనుకుంటాడు సీనియర్ మిలిటరీ ఆఫీసర్. మిల్కాని ఢిల్లీ బెటాలియన్‌కి తీసుకెళతాడు. అక్కడ మిల్కా ‘ఇండియా’ ఎంబ్లమ్ ఉన్న కోటు వేసుకొన్న వ్యక్తికి గౌరవం ఇవ్వటం చూస్తాడు. ఎలాగైనా ఆ కోటు వేసుకోవాలి? దాని కోసం ఎన్నో అవమానాలు పొందుతాడు. ఆఖరికి ఆ పోటీలో క్వాలిఫై అయి.. జాతీయ రికార్డుని బద్దలు కొడతాడు. విజయంతోపాటే పతనమూ ఉన్నట్టే. ఒలింపిక్స్ కోసం రోమ్ వెళ్లిన అతణ్ణి పరాజయం వెక్కిరిస్తుంది. బీర్ తాగటం.. అమ్మాయితో నైట్ గడపటంతో తన లక్ష్యాన్ని మర్చిపోతాడు. దాంతో - మెడల్ చేజారిపోతుంది. కోచ్ కోప్పడతాడు. చివరికి వెనుదిరిగి వస్తూండగా.. ఇప్పటి వరకూ 400 మీటర్ల పరుగు పందెంలో రికార్డు ఏదని అడుగుతాడు మిల్కా తన కోచ్‌ని. 45.9 అని రాసిస్తాడు కోచ్. తను ఏం పోగొట్టుకున్నాడో? దేన్నయతే సాధించాలని జీవిత లక్ష్యంగా పెట్టుకొన్నాడో మరోసారి గుర్తు చేసుకొని.. దానికి తగ్గట్టు పరుగు ప్రాక్టీస్ చేస్తాడు. వరల్డ్ రికార్డు సాధిస్తాడు.
కథలో ఎనె్నన్నో అంశాల్ని స్పృశించాడు దర్శకుడు. మిల్కాసింగ్ బాల్యాన్నీ.. దేశ విభజన కారణంగా మిల్కా కుటుంబం ఎలా ఛిన్నాభిన్నమైందో? జీవితంలో ‘ప్రేమ’ జారిపోవటం.. ట్రాక్‌పై పరుగు - ఒక్కోటి ఎంతో స్పష్టంగా సెల్యులాయిడ్‌పై చూపాడు. మిల్కా శారీరక మానసిక పరిస్థితులను కళ్లకి కట్టాడు. ట్రైన్‌లో దొంగతనం చేయటం.. రెండు కేన్ల నెయ్యిని పోలీస్ నుంచీ తప్పించటం కోసం - ఆ నెయ్యి తాగి.. బస్కీలు తీయటం.. మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయి ‘ఆర్ యూ రిలాక్సింగ్’ అని ప్రశ్నిస్తే.. ‘నహీ జీ ఐయామ్ మిల్కా సింగ్’ అనటం వెనుక అతడికి ఇంగ్లీష్ రాదన్న నిజాన్ని తెలియజేయటం.. 400 మీటర్ల పరుగు పందెంలో ఒక అమ్మాయిపై మోజు కారణంగా వదలుకోవటం.. అదే రికార్డుని మళ్లీ సాధించటం.. జవహర్‌లాల్ నెహ్రూ నుంచీ ప్రశంసలందుకోవటమే కాదు - పాకిస్తాన్ ఆటల పోటీల్లో ప్రత్యేక ప్రతినిధిగా నియమితుడు కావటం - ఇలా అనేకానేక మిల్కా సింగ్ జీవిత మలుపుల్ని చక్కగా పట్టేశాడు. ఏ ఒక్క కీలకమైన అంశాన్నీ మిస్ చేయలేదు. ఇక నటనాపరంగా - ఫర్హాన్ అఖ్తర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ పరుగు పెట్టించాడు. తన చిరకాల కోరిక అయిన ‘ఇండియా’ ఎంబ్లమ్ కోటుని కుట్టించుకుంటున్నప్పుడు అతడి మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అదే కోటుతో అక్క దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె మొహంలో సంతోషం - ఇలా భావోద్వేగ పూరితమైన సన్నివేశాలెన్నో మనసుని కదిలిస్తాయి. వొళ్లు గగుర్పొడుస్తుంది.
ప్రకాష్ రాజ్ పాత్ర పరిధి తక్కువ. కోచ్ జావేద్‌గా నవాబ్ షా, మిల్కా అక్కగా దివ్యాదత్తా - ఇలా ఎవరి పాత్ర మేరకు వారు ప్రతి సన్నివేశాన్నీ పండించారు. నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. ఫర్హాన్ అఖ్తర్ దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ తనేమిటో నిరూపించాడు. చక్కటి స్క్రీన్‌ప్లేతో.. దర్శకత్వ ప్రతిభతో సెల్యులాయిడ్‌పై అలరించిన ఈ బయోగ్రఫీ చిత్రం అటు అథ్లెట్ అభిమానులకే కాదు.. మిల్కా చరిత్ర తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.
రివ్యూతో సంబంధం లేకపోయినా - చిత్ర ప్రేరణకు స్ఫూర్తిని కలిగించిన రియల్ లైఫ్ హీరో - ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ తెర వెనుక జీవితం గురించి కొన్ని మాటలు చెప్పుకోవటం భావ్యం అనిపించింది. మారుమూల పల్లెటూరి వాడూ.. అస్సలు ‘ట్రాక్’ అంటే ఏమిటో? ఒలింపిక్స్‌కి అర్థం సైతం తెలీనివాడూ.. ఒక చెరిగిపోని శిలాక్షరాల్ని రాసాడంటే అతడి అకుంఠిత దీక్ష- ఆ కృషి వెనుక పట్టుదల మాటల్లో చెప్పేది కాదు. ఎంతగా ఎదిగాడో అంతగా వొదిగి ఉన్నాడనటానికి అతడి జీవితమే ఉదాహరణ. తను రాసిన ఆటోబయోగ్రఫీ ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ (రచనలో కూతురు సోనియా సాన్‌వాల్కా సహకారం కూడా ఉంది.) ఆధారితంగా ‘్భగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని తీశారు. అందుకుగాను మిల్కా తీసుకున్న రెమ్యునరేషన్ ఒక్క రూపాయి. ఒకవేళ లాభాలు కనుక వస్తే.. తన వాటాగా వచ్చే సొమ్ముని ‘మిల్కాసింగ్ ఛారిటబుల్ ట్రస్ట్’కి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. 2003లో ప్రారంభించిన ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేదలను ఆదుకోవటం.. ఆటల్లో నైపుణ్యం చూపేవారికి ఆర్థిక సహాయాన్ని అందించటం. ప్రస్తుతం ఛండీఘర్‌లో మిల్కా నివాసం.