శాంతాకారం భజగశయనం, పద్మనాభం... అంటూమహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలిఏకాదశి. ఎందుకంటే సంవత్సరం పొడవునా వచ్చే ఏకాదశులన్నింటిలోకి ఆషాడమాసాన, ధనుర్మాసాన వచ్చే ఏకాదశులకు ప్రత్యేకత ఉంది కనుక. ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని, కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ, హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని ఈ ఏకాదశికి వివిధ పేర్లు పరిగణన లోకి వచ్చాయ పైగా ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. దానివల్లకూడా ప్రత్యక్షనారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి శయనైకాదశిగాభావిస్తారు.
ఈ ఏకాదశి ఉపవాసం గురించి భవిషోత్తర పురాణం ఉద్ఘాటిస్తోంది. ఏకాదశీవ్రత ప్రాధాన్యాన్ని బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు. రుక్మాంగద మహారాజు, అంబరీషుడు ఈ వ్రతాచరణంతో విశేషఖ్యాతి పొందారు. ఏకాదశి తెల్లవారు ఝాముననే అభ్యంగన స్నానపానాదులను చేసి బ్రహ్మచర్య దీక్ష వహించి సదా శ్రీహరినే ధ్యానించాలి. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.
విష్ణ్భుగవానుడు అలంకారప్రియుడు కనుక పూలతో సుగంధ ద్రవ్యాలతో,పరమ భక్తితో ఆ మహావిష్ణువును ఈరోజు అమిత శోభాయమానంగా అలంకరిస్తారు. పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. ఈ రోజంతా ఉపవాసం చేసి హరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. శ్రీమన్నానారాయణ మంత్రోచ్చారణ చేస్తూ భక్తవత్సలుడైన శ్రీహరిని కొలవడమే ఈ వ్రతవిశేషం. అందుకే ఈ వత్రాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారికి మహావిష్ణువు సమస్త బాధలనుంచి ఉపశమనం కలిగించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడని హరిభక్తుల విశ్వాసం. ఈ దినాన వైష్ణవాలయాల్లో జాజిపూలతో స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.
ఇక వర్షాకాలం ఆరంభం కనుక వ్యవసాయదారులు నేటినుంచి వ్యవసాయ పనులను శ్రీకారం చుడ్తారు. గోదావరి జిల్లాలో పాలెళ్ల పండుగలా ఈ తొలికాదశిని నిర్వహింపచేస్తారు. కొత్త పాలేర్లను పనిలోకి తీసుకోవడం , వారికి పంచభక్షపరమాన్నలతో విందుచేయడం, కొత్తబట్టలను ఇచ్చి గౌరవించడం లాంటి ఆచారాలు అక్కడ ఉన్నాయ. నెల్లూరు ప్రాంతంలోనూ వ్యవసాయపు పనులను మొదలుపెడ్తారు. తెలుగు వారి పండుగలన్నీ కూడా ఇపుడే ఆరంభమవుతాయ కనుక ఏకాశి ఎత్తుకొస్తుంది ఉగాది ఊడ్చుకువెళ్తుంది అన్న సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.
మనకు గోవు పరమపవిత్రం. గోముఖభాగమందు వేదాలు, కొమ్మలందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి, అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు ఉన్నట్లుగా మనం భావిస్తాం. గోవుగురించి అధర్వణవేదంలోనూ, బ్రహ్మాండ , పద్మపురాణాలలోనూ, మహాభారతంలోనూ ఏన్నో గాథలున్నాయి. గోవిశిష్టతను పురస్కరించుకుని తొలేకాదశినాడు గోపద్మవ్రతం ఆచరిస్తారు. గోశాలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాలముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి విధివిధానానుసరించి పూజచేస్తారు. పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలతో ఇస్తారు. ఇంకా తులసికోట వద్ద పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి జామ, ఖర్జూర, చెరుకు, సీతాఫలాలను నివేదిస్తారు. సేవాభావం, పరులను గౌరవించడం లాంటి నియమాలను పాటించడం ఈ వత్రాచరణలో ముఖ్యం. నేటినుంచి కామక్రోధాదులకు తలొగ్గకుండా శాంతంతో కూరిమి చేయాలని శాస్త్ర వచనం.
మంచిమాట
english title:
toli ekadasi
Date:
Thursday, July 18, 2013