ఈ సుగ్రీవుణ్ణి మా అన్న రావణుడు కని సంతోషిస్తాడు అని తలపోస్తూ లంకలోపలికి కొనిపోయినాడు. అది కాలాగ్ని కాలమేఘాన్ని కూల్చి గుహకు కొంపోయినట్లు తోచింది. దేవతలు అందరూ ఆజిలో సుగ్రీవుడు ఈ విధంగా మూర్ఛపోయినాడే అని విచారించారు. ఆ కుంభకర్ణుడి లావు, చలము, లాఘవములను రాక్షసులు అందరూ సన్నుతించారు. సుగ్రీవుణ్ణి విడిపించలేక వానరులు హాహాకారాలు చేశారు.
శరభుడు, ఋషభుడు, ధూమ్రుడు, జాంబవంతుడు, కేసరి, పృథరోముడు, హరిరోముడు, పావకాక్షుడు ద్వివిదుడు, మైందుడు, గవయుడు, శతబలి, గవాక్షుడు, గజుడు, కుముదుడు, జ్యోతిర్ముఖుడు, సుషేణుడు, దధిముఖుడు, ధూమ్రుడు, గంధమాదనుడు, తారుడు, ఆదిగాగల వీరవానరులు, ఉదగ్ర విక్రములు, దారుణకారులై తరువులు, శైలములు కైకొని ఆకసానికి ఎగసి, అట్టహాసాలు, సింహనాదాలతో దశదిశలు అట్టిట్టుగా బ్రహ్మాండము పగుల, ఏ రీతిగా నయినా సుగ్రీవుని విడిపింతము అని తలపోసి కుంభకర్ణుడిని చుట్టముట్ట తలచినపుడు హనుమంతుడు చేయెత్తి వద్దని వానరుల్ని వారించి ‘‘సుగ్రీవుడు ఉద్భట శూరుడు. మూర్ఛపోయి వున్నాడు అంతే. తెలివి వచ్చిన వెంటనే ఆ వీరాధివీరుడు తిరిగి వస్తాడు. అందువల్ల మనం అసుర నుంచి విడిపించినట్లయితే జీవితాంతమూ విచారిస్తాడు. ఇది మనకు కర్తవ్యం కాదు. కొలది సమయం వేచి చూడండి. ఈ లోపల వానరేశ్వరుడు రాకున్న కుటిలురయిన రావణ కుంభకర్ణులను, చటుల విక్రములైన రాక్షస సేనలను తీవ్ర ముష్టిఘాతాలతో సంహరించి, బంగారు కాంతులు విలసిల్లే ఏడు కోట్లను, లంకను సర్వనాశనం చేసి సుగ్రీవుణ్ణి విడిపించుకొని రావచ్చును’’ అని వాకొన్నాడు.
అప్పుడు వానరులు హనుమంతుడి వాక్యాలు ఆకర్ణించి, మనముల సంతసించి, కుంభకర్ణుడి వెనుక పోవ, కుంభకర్ణుడు గణింపక సుగ్రీవుడితో కడువడిగా లంకలో ప్రవేశించాడు. కుంభకర్ణుడు ఆ రీతిగా వెడలుతుండగా రాజమార్గాలతో గోపురాలనుంచి సౌధాల మీద నుంచి పురకాంతలు పుష్పవృష్టి కురిపించారు.
సుగ్రీవుడు- కుంభకర్ణుడిని విరూపుని చేయుట
ఆ పూలవాన సౌరభాలకు సుగ్రీవుడికి మెల్లగా మెలకువ వచ్చింది. కన్నులు తెరచి చూశాడు. లంకానగరం రాజవీధి అని గుర్తించాడు. తెలతెల్లపోయాడు. ఈ రీతిగా ఈ రాక్షసుడికి పట్టువడి మూర్ఛపోయాను అని తలచాడు తన కరాలతో ఆ రాక్షసవీరుడి చెవులు పెనవైచి తమ్మెలతో కలిపి పెరికివేశాడు. ముక్కుపుటాలతో బోసిపోయే విధంగా కరచి, కుంభకర్ణుడు మీదికి ఎగిరాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడి కాళ్లు పట్టి నేలపై విసరబోయాడు. సుగ్రీవుడు ఆకాశంలోకి ఎగిరి రామవిభుడి వద్దకి వచ్చాడు. దేవతలు సుగ్రీవుడు రావడం కాంచి ఆశ్చర్యపోయారు. వానరులందరూ తమ ఏలికను కాంచి నమస్కరించారు. సుగ్రీవుడు వానరులతో రామవిభుడికి ప్రణమిల్లాడు. రామవిభుడు సుగ్రీవుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకొన్నాడు.
అంత కుంభకర్ణుడు ఆ విధంగా ముక్కులు, చెవులు పోగొట్టుకొని ఇంతకు పూర్వం తన చెల్లెలు శూర్పణఖకు కలిగిన భంగపాటే తనకూ కల్గినందుకు సిగ్గుపడి, ఈ వికృత రూపంతో రాక్షసేశ్వరుడి కడకు ఏమని, ఎట్లని వెతాను’’ అని తలచి యుద్ధం చేయపోవడం బాగు బాగు అని భావించాడు. పురమునుండి వెనుదిరిగాడు. రక్త ప్రవాహాలు దేహం అంతా నిండి ఉద్దండ వర్తనుడు కుంభకర్ణుడు ఘనతమ రోషంతో జేగురు చాయల సేలయేరులు ప్రవహించే నల్లని కాటుక కొండ కైవడి కనవస్తూ ఇతడు యుగాంతం నాటి తీవ్రాగ్ని జ్వాలయా అన రణస్థలికి ఏతెంచాడు. ఆ విధంగా ఏతెంచుతూనే ఉగ్రరూపం ధరించి వానర సైన్యం మీద విరచుకొని పడ్డాడు. భీషణంగా వానరుల కడ కాళ్లు పట్టుకొని వేగంగా తిప్పి తిప్పి అవనిపై పడవేసినాడు. కొందరను వెలికి ప్రేగులు రాలిపడ పిడికిళ్లతో పొడిచాడు. అత్యుదడ్రై మరికొందరి గుండెలు పగిలి వెలికివచ్చిపడే రీతిని పాదాలతో త్రొక్కివేశాడు.
- ఇంకాఉంది