మాటా మంతీ లేకుండా కలిసి భోంచేస్తున్న ఈ జంటవైపే కొన్ని జతల కళ్లు చూస్తున్నాయని తేలిపోయింది. స్టేర్ చేసేవాళ్లంటే కిరణ్మయికి చిరాకు.
‘‘హంపీ రావటం ఇదేనా?’’
కిరణ్మయి ప్రశ్నాస్త్రం సూటిగా తనమీద సంధిస్తుందనుకోలేదు ప్రత్యగాత్మ. తన దృష్టి మళ్లించటానికే అలా అంటోంది. చుట్టూ చూడగానే తనకీ విషయం అర్థమైపోయింది.
‘‘ఎప్పుడో చిన్నతనంలో మా అమ్మా నాన్నలు తీసుకువచ్చారు. కాని, ఈసారి అడుగుపెట్టగా ఒళ్లంతా పులకరించిందనుకోండి. రాగానే ఓ పుస్తకం కొని చదివాను. రాత్రంతా నిద్రపట్టలేదు. ఈ హంపీ నా స్వంతం అన్న ఫీలింగ్ నన్ను బాగా కుదిపేసింది. కాళిదాసులా ఆసు కవిత్వం తన్నుకువచ్చేసింది.
‘‘ఈ పంపా తీరం
ఇదివరకే పరిచయం
ఎప్పుడూ? ఎలా? చెప్పలేను
ఈ పచ్చిక బయళ్లూ
పరిమళపు గుభాళింపులు
రెల్లు భామల నిట్టూర్పులు
తీరం చాటు దీపం వెలుతురూ
ఏ గతానికి స్వాగతమో!’’
కిరణ్మయి ఈసారి గట్టిగానే నవ్వేసింది. ఇప్పుడు తమని ఎవరూ పట్టించుకోవటంలేదు. ఇంటినుంచి పారిపోయిన జంటలా చూట్టంలేదు.
‘‘ఎందుకు నవ్వుతున్నారు? నా కవిత్వం అంత చండాలంగా వుందా?’’
‘‘ఉత్తి బడిపంతులేననుకున్నాను, కవి పండితులన్నమాట’’
‘‘దెబ్బతిన్నారు. నేను పంతుల్ని కాదు. ఆ కవిత్వం నాది కాదు’’
‘‘ఎవరిది?’’
‘‘ఎవరిదైనా అనుభూతి మాత్రం ఇద్దరిదీ.
ఖాళీ బల్ల కోసం దేవులాడుతున్న ఓ జంట కనిపించగానే ఇద్దరూ లేచారు.
‘‘ఈ రోజు ఖాళీయేనా?’’
మొగమాటం లేకుండా అడిగేసింది కిరణ్మయి. సంబంధం సాప్తపదీనం.
‘‘ఎక్కడికి వెళ్లాలి?’’
‘‘పదండి చెబుతా’’
అరగంటలో మళ్లీ కిరణ్మయి కీలుగుర్రం ఎక్కటం మేనేజర్ కంట పడింది. టూరిస్టు హోమ్ సరిహద్దు దాటగానే ప్రత్యగాత్మ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
‘‘మేడమ్‌గారూ! ఇప్పడు చెప్పండి. ఎటు వెళ్లమంటారు?’
‘‘మీ ఇష్టం’’ అన్నది లైటు వెలిగినందుకు మురిపెంగా. ఇప్పుడు తను చెప్పినట్టు అతను వినాలి. వింటున్నాడు కూడా.
‘‘ఉదయం క్వీన్స్ బాత్ చూచారా. హంపీ వచ్చాక పంపా సరోవరం చూడాల్సిందే. చరిత్రకు అన్యాయం జరగకూడదు.’’
అలాగేనన్నది కిరణ్మయి. తుంగభద్ర గట్లు ఒరుసుకుని ప్రవహిస్తున్నది. గడ్డమీద స్కూటర్ ఆగింది. క్రింద ఉద్ధృతంగా పారుతున్న పంపానది చూడగానే కిరణ్మయి బిత్తరపోయింది.
‘‘అయ్యబాబోయ్ ఏరు దాడటం నావల్ల కాదు’’ కాని అక్కడి దృశ్యాలు వెంటనే ఆకట్టుకొన్నాయి. బుట్టలో కూచుని గిరగిర తిరుగుతూ నదికి ఏటవాలుగా పల్లీయులు చిన్నా పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా ఆవలిగట్టు చేరుకుంటున్నారు.
‘‘పదండి’’
ప్రత్యగాత్మ దిగి కిరణ్మయికి చెయ్యి అందిచ్చాడు. మెల్లగా దిగింది. ఇసుకలో గట్టుదాకా నడవటం తనకి కాస్త ఇబ్బందిగానే వుంది. తన పేరు ఎలా తెలుసుకున్నాడో ఏంటో అడగాలనిపించింది కిరణ్మయికి. అడగ్గానే గట్టిగా నవ్వాడు ప్రత్యగాత్మ.
‘‘చెప్పమంటే నవ్వుతారేం?’’
‘‘వెరీ సింపుల్. నా పేరు ఆత్మారామ్. ఆత్మ అంటే సూర్యుడు. తెల్లవారగానే కిరణాలతో ప్రపంచాన్ని ముంచెత్తటం సూర్యుడి అలవాటు. మీ పేరు అయితే సూర్యకుమారి కాకపోతే కిరణ్మయి అయి వుండాలి. నాకు నచ్చిన పేరుతో పిలుస్తాను. పేలుతుంది అనే నమ్మకం’’.
తనని ఫూల్ చేస్తున్నాడు ఈ ఆత్మారాముడు.
‘‘పేరు అడిగితే ఇంత తిరకాసు పెట్టారు. అంచేత మీకై మీరు చెబితే వింటాను. యామై రైట్ ఆర్ రాంగ్’’
ఆర్‌టిసి బస్సు కండక్టర్‌లా రైట్ అనేసి ఈల వెయ్యాలనిపించింది కిరణ్మయికి. రేవు అంచును నిలబడ్డ ఈ జంట కనిపించగానే, ఓ కుర్రాడు గబగబా తెడ్డు వేసి పుట్టిని ఇటుకేసి పరుగెత్తించాడు. ఓ అంచు ఒడ్డు తాకుతున్నా పుట్టి ప్రవాహానికి అటూ ఇటూ ఊగిసలాడుతూనే వున్నది. ప్రత్యగాత్మ ఒక అంగలో పుట్టిలో దిగాడు. కిరణ్మయి తటపటాయించటం చూచి పుట్టి అబ్బాయి పళ్లికిలించాడు. రోషంతో ప్రత్యగాత్మ చెయ్యి పట్టుకోకుండా పుట్టిలో అడుగు వేసింది. ఓ పెద్ద అల తాకిడికి తట్టుకోలేక పుట్టి ఓ అంగుళం వెనక్కి జారింది. కిరణ్మయి కాలు జారి నీళ్లళ్లో పడిపోయింది. ప్రత్యగాత్మ గబుక్కున దిగి పైకి లేపాడు.
‘‘అయ్యో! చీర తడిచిపోయింది. వెనక్కి పోదాం’’ అన్నాడు కంగారుగా. కిరణ్మయి వినిపించుకోలేదు.
****
‘‘ఏంటమ్మగోరూ! దబ్బున పడిపోయారు’’
పుట్టబ్బాయి నవ్వుతూంటే కిరణ్మయికి ఒళ్లు మండుతున్నది.
తిరిగి వెళ్లటానికి ఒప్పుకోలేదు అందుకే.
‘‘నువ్వు దిగి పుట్టిని గట్టుకు ఒత్తిపట్టుకోవోయ్’’- ప్రత్యగాత్మ కోప్పడగానే కుర్రాడు దిగి పట్టుకున్నాడు. కిరణ్మయి కాలు మోపి క్షేపంగా పుట్టిలో కూచున్నది.
‘‘మెల్లగాపోనీ’’ వార్నింగ్ ఇచ్చేశాడు పుట్టి అబ్బాయికి తనూ ఎక్కి కూచుని. పుట్టి కదిలింది. సూర్య కిరణాలు తళతళామంటూ తరంగాలతో ఆడుకుంటున్నాయి. తడిసిన కుచ్చెళ్ళలో తనువు జలదరించింది కిరణ్మయికి.
- ఇంకాఉంది
మాటా మంతీ లేకుండా కలిసి భోంచేస్తున్న
english title:
daily serial
Date:
Thursday, July 18, 2013