Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘విలన్ ఆఫ్ ది మిలీనియం’

$
0
0

‘ప్రాణ్‌గా నా జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగింది. జీవితంలోని వొడిదుడుకుల్నీ.. కష్టసుఖాల్నీ.. అన్నింటినీ అనుభవించాను. రూపాయి కోసం వెతికిన సందర్భాలున్నాయి. లక్షల కొద్దీ రెమ్యునరేషన్ అందుకున్న రోజులూ ఉన్నాయి. వచ్చే జన్మలోకూడా ‘ప్రాణ్’గానే పుట్టాలనుకుంటా. నటుడిగా జీవించాలనుకుంటా’ అంటాడు. అదీ నటన పట్ల ప్రాణ్‌కున్న సిన్సియారిటీ.
=====================

చూపుల్లో కర్కశత్వం.. మాటల్లో కరకుదనం.. స్నేహం కోసం ప్రాణాన్ని ధారపోసే సున్నితత్వం.. వెరసి అతడే ‘ప్రాణ్’. చూట్టానికి విలనీ పోకడలు బోలెడన్ని స్పష్టాస్పష్టంగా కనిపించినప్పటికీ.. మనసు తేటగీతి. చిత్రపరిశ్రమలో ఎవర్ని అడిగినా పొల్లు పోకుండా ఇవే మాటలు చెబుతారు. ఇదే పాట పాడతారు -ప్రాణ్ గురించి. ఇక నటన గురించి చెప్పనక్కర్లేదు. ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులు. కథానుగుణంగా విలన్ కేరెక్టర్ లెంగ్త్ మరీ చాంతాడంత అయి.. ప్రతి ఫ్రేమ్‌లోనూ విలన్ కనిపిస్తూ కథానాయకుణ్ణి పక్కకి నెట్టేశాడు. ఇంకెవరైనా ఐతే పరిస్థితి ఏ విధంగా ఉండేదో? కానీ.. రాజ్‌కపూర్ మాత్రం ప్రాణ్ ‘విలనిజాన్ని’ ప్రశంసించాడు. అతడి అసమాన నటనా ప్రతిభ ముందు ఆ ఫ్రేమ్‌లో నేను కనిపించక పోతేనేం? అంటూ తన సహృదయతను చాటుకోవటమే కాదు.. విలన్ అంటే రేపటి తరానిక్కూడా అర్థమయ్యేట్టు ఆ బందిపోటు పాత్రకి మరిన్ని మెరుగులు అద్దాడు. అదీ ప్రాణ్‌లోని నటనకు గీటురాయి. ఇదొక మచ్చుతునక మాత్రమే. 1940 నుంచీ ప్రాణ్ జీవితంలో అటువంటి మైలురాళ్లు మజిలీలు ఎనె్నన్నో. లెక్కకు మించి.
పాత ఢిల్లీలోని కోట్‌ఘర్ ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో 1920, ఫిబ్రవరి 12న ప్రాణ్ ప్రాణం పోసుకున్నాడు. తండ్రి కేవల్ కృష్ణ సికంద్ సివిల్ ఇంజనీర్. అంతేకాదు - గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టర్ కూడా. ఉద్యోగరీత్యా తరచూ ట్రాన్స్‌ఫర్లు కావటంతో.. ప్రాణ్ చదువు సంధ్యలు మీరట్, కపుర్తలా, ఉనావ్, డెహ్రాడూన్, రాంపూర్‌ల మీదుగా సిమ్లా చేరాయి. చిన్నప్పట్నుంచీ కుక్కలంటే ప్రాణం పెట్టే ప్రాణ్‌కి ఆ హాబీతోపాటు ఫొటోగ్రఫీ కూడా అలవడింది. ఎ.దాస్ అండ్ కో లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా చేరాడు. ఫొటోగ్రఫీతోపాటు నటన అంటే ఏ మూలనో ఉన్న ఆసక్తి సిమ్లా థియేటర్ వైపు నడిచేట్టు చేసింది. ‘రామ్‌లీలా’ నాటకం. ఆ నాటకంలో సీత పాత్ర. పాత్ర ఏదైతేనేం.. నటించటం ముఖ్యం. అంతే! స్టేజ్‌పై ప్రాణ్ తన నటనకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఆ నాటకంలో రాముడికి మదన్‌పురి నటించటం కొసమెరుపు. స్వతహాగా పంజాబీ కావటంతో ‘యమ్లా జత్’ అనే పంజాబీ చిత్రంలో విలన్‌గా చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 1940-44 ప్రాంతంలో విలన్‌గా పంజాబీ చిత్రాల్లో ప్రాణ్ ఒక వెలుగు వెలిగాడు. 1942లో ‘ఖాన్‌దాన్’ అనే హిందీ చిత్రంతో తన కెరీర్‌ని హీరోగా మొదలుపెట్టాడు. ఆ చిత్రంలో పాకిస్తానీ గాయని నూర్జహాన్ హీరోయిన్. 1942 - 1946 మధ్య 21 పంజాబీ చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన ప్రాణ్‌కి దేశ విభజన అవరోధంగా నిలిచింది. దాంతో పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయాడు.
నటుడిగా స్థిరపడటానికి ముంబై చేరాడు. ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్నాడు. మొదటిగా తాజ్‌మహల్ హోటల్‌లో బస చేసిన ప్రాణ్ - ఇటు పని అటు మనీ రెండూ లేకపోవటంతో ఆఖరికి చిన్న హోటల్‌కి మారాడు. అక్కడ్నుంచీ తెలిసిన వాళ్ల గెస్ట్ హౌస్‌లో. 1954లో సెంట్రల్ ముంబైలోని పాలీ హిల్స్ అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లోకి మారాడు. హిందీ చిత్రాల్లో అవకాశాలు అంత తేలిగ్గా దొరకలేదు. ఫొటోగ్రాఫర్‌గా నెలసరి 200 రూపాయల ఆదాయం కాస్తా పోయి.. పదుల సంఖ్య రాబడిలో పడ్డాడు. ఐనా తనదైన నటనను వదులుకో దల్చుకోలేదు. అదే అతణ్ణి చివరి వరకూ నిలిపింది. ఒక ఇంటర్వ్యూలో ‘వచ్చే జన్మలో ఏం కావాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నిస్తే - ‘ప్రాణ్‌గా నా జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగింది. జీవితంలోని వొడిదుడుకుల్నీ.. కష్టసుఖాల్నీ.. అన్నింటినీ అనుభవించాను. రూపాయి కోసం వెతికిన సందర్భాలున్నాయి. లక్షల కొద్దీ రెమ్యునరేషన్ అందుకున్న రోజులూ ఉన్నాయి. వచ్చే జన్మలో కూడా ‘ప్రాణ్’గానే పుట్టాలనుకుంటా. నటుడిగా జీవించాలనుకుంటా’ అంటాడు. అదీ నటన పట్ల ప్రాణ్‌కున్న సిన్సియారిటీ.
1948లో ‘జిద్దీ’ చిత్రంతో ప్రాణ్ విలన్‌గా అవతరించాడు. విలన్‌గా, కేరెక్టర్ యాక్టర్‌గా, హాస్య నటుడిగా 350 పైగా చిత్రాల్లో నటించి విలన్‌గా ఎదురులేని మనిషి అనిపించుకున్నాడు. నిన్నటి తరానికి ప్రాణ్ గురించి చెప్పనక్కర్లేదుగానీ.. ‘షేర్‌ఖాన్’ అంటే రేపటి యువతకి కూడా గుర్తుండిపోయే నటనను అందించి - బాలీవుడ్ సినీ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1968- 1992 మధ్యకాలంలో 13 సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ.. ఆ తర్వాత్తర్వాత పాజిటివ్ రోల్స్ వేస్తూ వచ్చాడు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగానూ అతడ్ని ఎవరూ ఇంతవరకూ అధిగమించలేదు. 1969 ప్రాంతంలో రాజేష్‌ఖన్నా పారితోషికాన్ని భరించటానికి నిర్మాతలు కొద్దిగా మొహమాట పడేవారు. అయితే - ప్రాణ్ విషయానికి వస్తే.. లక్షల కొద్దీ కుమ్మరించటానికి సంసిద్ధతను వ్యక్తం చేసేవారంటే అతడిలోని నటనకు ఇంతకంటే ఆనవాళ్లు ఏం కావాలి.
2000లో ‘విలన్ ఆఫ్ ది మిలీనియం’ అంటూ స్టార్‌డస్ట్ ప్రకటించటం.. ఆ తర్వాత పద్మభూషణ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఇలాంటి పురస్కారాలెన్నో ప్రాణ్‌ని వరించాయి. సిఎన్‌ఎన్ టాప్ 25 ఏషియన్ యాక్టర్స్‌లో అతడొకడు. ‘ఖాన్‌దాన్’ ‘పిల్‌పిలి సాహెబ్’ ‘హలకు’ ‘మధుమతి’ ‘ఉప్‌కార్’ ‘షాహీద్’ ‘ఆంసూ బన్ గయే ఫూల్’ ‘జానీ మేరా నామ్’ ‘విక్టోరియా నెం.203’ ‘బే-ఇనామ్’ ‘జంజీర్’ ‘డాన్’ ‘దునియా’ ఇలా చెప్పుకున్న కొద్దీ అతడి హిట్‌లిస్ట్ ఎంతో.
చదువు మెట్రిక్యులేషన్‌తో ఆగిపోయింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా అతడి కెరీర్ అర్థంతరంగా ముగిసింది. ప్రాణ్‌ని నటుడిగా చూట్టం తండ్రికి ఇష్టం లేదు. ఆయనకు మల్లే ఇంజనీర్‌గానో.. పైస్థాయి అధికారిగానో చూడాలనుకున్నారు. కానీ ఇవేవీ ప్రాణ్‌కి వొంటబట్టలేదు. ఆఖరికి నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో - మొదటి ఇంటర్వ్యూ వార్తాపత్రికల్లో రావటం తండ్రి ఎక్కడ చూస్తాడోనని.. పత్రికల్ని దాచేయమని అక్కలకు పురమాయించాట్ట. ఆ తర్వాత్తర్వాత తండ్రి అర్థం చేసుకోవటంతో పరిస్థితి కాస్తంత సద్దుమణిగింది. ఒక్కోసారి అనుకోని సంఘటనలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ప్రాణ్ జీవితంలోనూ అలాంటి ఘట్టం ఒకటి. ఓ రోజు లాహోర్‌లోని హీరా మండీ అనే షాప్‌కి వెళ్లాడు. అక్కడ ఏదో కొంటూండగా.. రచయిత వలీ మహమ్మద్ వలీ అతణ్ణి చూట్టం.. అప్పటికే వలీ దల్‌సుఖ్ ఎం.పంచోలీ చిత్రానికి పని చేస్తూండటంతో - అతడికి కావలసిన నటుడు దొరికినట్టయింది. ‘ఏం బాబూ లడ్డూ కావాలా?’ అన్నట్టు.. ప్రాణ్‌ని వలీ అడిగాడు. అదే ‘యమ్లా జత్7 చిత్రం. మోతీ బి.గిద్వాన్ దర్శకత్వంలో నిర్మితమైన ఆ చిత్రంలో నూర్జహాన్, దుర్గాఖోటే లాంటి ప్రముఖులు నటించారు. నూర్జహాన్‌కీ.. ప్రాణ్‌కీ మధ్య పదిహేనేళ్ల వయసు తేడా ఉండటంతో ‘ఖాన్‌దాన్’ చిత్రంలో కొన్ని క్లోజప్ షాట్స్ తీయటానికి నూర్జహాన్‌ని ఎతె్తైన ఇటుకల మీద నిలబెట్టార్ట. ఇలాంటి సంఘటనలతో అతడు ఎదుగుతూ వచ్చాడు. ఎనె్నన్నో మజిలీలు దాటుకొని మరిన్ని పురస్కారాలను అందుకున్నాడు.
‘షేర్‌ఖాన్’ అంటే ‘ప్రాణ్’ ‘ప్రాణ్’ అంటే షేర్‌ఖాన్ అన్నట్టు అంతగా ఆ పాత్రలో లీనమై నటించి.. ఎవరికీ తెలీని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ జ్ఞాపకాలను మదిలో తొలుస్తూండగానే.
*

చూపుల్లో కర్కశత్వం.. మాటల్లో కరకుదనం..
english title: 
pan

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles