క్రూరమైన నిర్లక్ష్యం కోరలు కరకరమని నమిలి మింగిన దారుణ మారణ ధ్వనులు మానవత్వం మచ్చుకైనా మిగిలిన ప్రతిహృదయాన్ని కలచివేస్తున్నాయి! ఇరవై ఇద్దరు చంటిపిల్లలు ఈ క్రూరమైన నిర్లక్ష్యానికి బలైపోయారు. మొగ్గలుగానే రాలిపోయారు. నిజాలను నిగ్గు తేల్చడానికి నడుములను బిగించిన అధికార రాజకీయ నాయకుల గుండెలలో మానవత్వం మచ్చుకైనా మిగిలి లేదన్నది విషంగా మారిన బడి భోజనం ఆవిష్కరించిన వికృత విషాద వాస్తవం. బీహార్‌లోని శరణ్ జిల్లా చప్రా గ్రామంలోని ధర్మసతి గందావన్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం ఈ విషాన్ని తినవలసి వచ్చిన విద్యార్థులను హత్య చేసింది ఘోరమైన నిర్లక్ష్యం మాత్రమే. ఈ నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వ మానవశక్తి వనరుల మంత్రిత్వ కార్యాలయం నుండి దేశంలోని అన్ని బడుల ప్రాంగణాల వరకు రాష్ట్ర ప్రభుత్వాల సచివాలయాల నుండి బడుల వంట స్థలాల వరకు దశాబ్దులుగా వ్యాపించిపోయింది. సోయాబీన్స్ కూర ‘‘బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర’’- ఇరవై ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న బడి భోజనం విషపూరితం కావడానికి ఏది కారణం కావచ్చునన్న చర్చ మొదలైపోయింది. రెండూ కారణాలు కావచ్చు. అంటే బీహార్‌లోని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఐక్య జనతాదళ్ పార్టీని అప్రతిష్ఠపాలు చేయదలచిన వారు నిర్దాక్షిణ్యంగా ఈ హత్యలు చేయించి ఉండవచ్చునట. లేదా కాలుష్య జీవరసాయనాలతో విషపూరితమైన సోయా చిక్కుడు గింజలను సరఫరా చేసిన వారు బడిపిల్లల బతుకులను నిర్లక్ష్యంగా చంపి ఉండవచ్చు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయగలవారెవరు? కూల్చడానికో, అప్రతిష్ఠను ఆపాదించడానికో యత్నిస్తున్న వీరు ఇలా బడి భోజనంలో, రాజకీయాలతోకాని, లౌకిక దౌష్ట్యంతోకాని సంబం ధం లేని పసికందులు తినే మధ్యాహ్న భోజనంలో విషం కలిపే రాక్షసత్వానికి పూనుకున్నారా? పూనుకున్నారని బీహార్ విద్యామంత్రి పీకే సాహీ ఆరోపించడం ఈ విషాద సంఘటనకు సంబంధించిన అతిఘోరమైన నిర్లక్ష్యం. దశాబ్దుల పాటు దేశంలోని అన్ని పాఠశాలలోని వంటశాలల్లో సభలు తీరిన నిర్లక్ష్యం ఫలితం ఈ పసిపాపలు, బాలలు బలైపోవడం... కానీ నిర్లక్ష్యానికి సైతం రాజకీయ రంగు పులిమి సానుభూతి సంపాదించగలుగుతున్న వారు కుట్ర జరిగిందని చెబుతున్న సిద్ధాంతవాదులు నిర్లక్ష్యానికి నిజమైన రూపాలు. పిల్లలను కోల్పోయి తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులను ఓదార్చడం మాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు ప్రతిపక్షాల వారు పరస్పరం నిందించుకుంటూ ఉండటం మానవత్వాన్ని అపహాస్యం పాలు చేస్తున్న మాలిన్యం.
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయదలచినవారు ఇలా ఒక బడిలో పిల్లలు తినే తిండిలో విషం కలపరు. ఎందుకంటె అలాంటి రాక్షస చర్యవల్ల పిల్లలు అకాల మృత్యుగ్రస్తులవుతారు తప్ప ప్రభుత్వానికి కొత్తగా వచ్చే చెడ్డపేరు ఉండదు. అందువల్ల కుట్ర జరినట్టు ముందు వెనకల ఆలోచించకుండా ఆరోపించడం నైతిక నిర్లక్ష్యం. ఒకవేళ రాజకీయ లాభాలకోసం ముక్కుపచ్చలారని ముద్దుపాపలను చంపడానికి సైతం వెనుదీయని మానవరూప పిశాచాలు ఉన్నట్టయితే వాటిని నాయయస్థానం ముందు నిలబెట్టి ఉరికంబమెక్కించాలి. కానీ ఎలాంటి ఆధారలు లేకుండానే బీహార్ మంత్రి కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. నిజాన్ని దర్యాప్తు సంస్థల వారు పరిశోధించి కనిపెడతారని మళ్ళీ ఆయనే చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు కనిపెట్టే వరకూ ఎందుకని ఆగలేదు? మధ్యాహ్నం పనె్నండున్నర గంటలకు కలుషితాహారం తిన్న వెంటనే పిల్లలు తీవ్రంగా అస్వస్థులయ్యారు. వారికి చికిత్స కోసం తరలించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు కాని మంది కాని లేకపోవడం వల్ల ఎక్కువ మంది చిన్నారులు అసువులు బాసారు. మిగిలిన వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వైద్య శకటాలు లేవు. అందువల్ల బస్సుల్లో పిల్లలను కుక్కి జిల్లా కేంద్రానికి తీసుకుపోయారు. మధ్యలో ఈ బస్సుకు సాంకేతిక లోపం ఏర్పడి కూలబడిందట. ఆ తరువాత జిల్లా వైద్యాలయంలో కూడ సరైన చికిత్సా సదుపాయాలు లేని కారణంగా అస్వస్థ అర్భకులను పాట్నాకు తరలించవలసి వచ్చిందట. మధ్యాహ్న భోజనం కాలుష్యగ్రస్తం కావడానికి అవకాశం ఉన్నట్టు దేశమంతటా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటె ఈ పథకం ‘అధ్వాన్న భోజనం’గా మారిపోయి చాలా ఏళ్ళయింది. కానీ ప్రాణాపాయం ఏర్పడే సమయంలో కాపాడే వైద్య వ్యవస్థ సుదూర ప్రాంతంలో కానీ లేదు. ఇదంతా ఒకనాటి నిర్లక్ష్యం కాదు. విషం తిన్న బుడుతలకు సాయంత్రం ఆరున్నర గంటలకు కాని వైద్య చికిత్స జరగలేదు... నిర్లక్ష్య వాటికలో నిజం నడుం విరిగి పడివుంది.
బడి పంతుళ్ళకు, పంతులమ్మలకు వంట వారికి వడ్డించే వారికి కూడ మధ్యాహ్న భోజన గ్రస్తులంటే సహజంగానే మంట. ఈ మంటకు కారణం ఈ పథకం పట్ల తమకు అదనంగా లభించే ఆర్థిక ప్రయోజనం లేకపోవడం. వంట చేసి వడ్డించే వారికి కూడ జీతాలు చాలవు. అందువల్ల మధ్యాహ్న భోజన సామగ్రిలో కొంత తస్కరించడం మామూలైంది. హెడ్‌మాస్టర్లు సైతం తమ ఇళ్ళలో అందరికీ సరిపడా భోజనాన్ని క్యారియర్లలో పెట్టి తీసుకెళ్ళిన, వెడుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. జరుగుతున్న ఆర్భాటానికి దీటుగా పౌష్టిక భోజనం పెట్టడానికి నిధులు చాలవు. రోజూ బియ్యానికి రూపా యి, మిగిలిన తతంగానికి- కూరలు, కుంపట్ల సహా- రెండు రూపాయల చొప్పు న ప్రతి విద్యార్థికీ మంజూరయినప్పుడు శుచిగా పుష్టిగా భోజనం ఎలా తయారవుతుంది? అందులోనే అవినీతిపరులు కొంత కాజేస్తున్నారు. ఈ సంగతులు తెలిసిన ప్రభువులు నిధులను పెంచకపోవడం కొనసాగుతున్న నిర్లక్ష్యం. ఇప్పుడు బీహార్‌లో జరిగిన ఘటన మొదటిది కాదు. దేశమంతటా వందలాది పాఠశాలల్లో ఇలా భోజన కాలుష్యం ఏర్పడిపోవడం దశాబ్దుల కథ. మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోను, అనంతపురం జిల్లాలోను, గత నెలలో ఈ నెలలో మధ్యాహ్న భోజనం కలుషితమైన ఉదంతాలు బయటపడ్డాయి. ఇప్పుడు ధర్మశతి పాఠశాలలో విషాహారం ఘటన జరిగిన మరునాడే బీహార్‌లోని మధువని జిల్లాలో మరో యాబయిమంది పిల్లలకు ‘మధ్యాహ్న’ కాలుష్యం సోకిందట. ఘటనలు జరిగిన తరువాత మాత్రమే మేలుకుంటున్న రాజకీయవేత్తలకు అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకంటె నిదర్శనం ఎందుకు?
ధర్మశతి పాఠశాలలో భోజనం వడ్డించగానే రుచి చూసిన పిల్లలు ఒక్కొక్కరుగా విచిత్రమైన వికారమైన వాసన గురించి, రుచి గురించి ఫిర్యాదు చేశారట. కానీ ‘‘మీరంతే...మీకు రుచించదు...ఉత్తిగా వస్తోంది కాబట్టి ఈ తిండి అలుసైపోయింది’’-ఇలాంటి దీవెనలతో పెద్దపంతులమ్మ పిల్లలను తిట్టిపోసిందట. అందువల్ల ఆ పిల్లలు ఆ తిండిని కుక్కుకున్నారట. కొందరు పిల్లలు పడిపోయిన తరువాత ఆనుమానించిన వంటలక్క సోయా చిక్కుడు కూర రుచి చూసిందట. అమె కూడా అస్వస్థురాలై పడిపోయిందట. ఈ పదార్ధపరంపరను సరఫరా చేసే కిరాణకొట్టువాడు పెద్ద పంతులమ్మ మీనాదేవి మొగుడట. ఆయన అమ్మిన సోయాచిక్కుడు విత్తనాలు ఎక్కడివి? దిగుమతి అయినవా? లేక అక్కడనే పండినవా? దిగుమతి అవుతున్న చిక్కుడు గింజలలో బిటి రసాయన విషం ఉందని ఏళ్ళ క్రితమే బయటపడింది!
సంపాదకీయం
english title:
editorial
Date:
Friday, July 19, 2013