జీవితాంతం శ్రమిస్తూ, నీతిగా నిక్కచ్చిగా సంపాదిస్తే ‘‘అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకు సరిపోయిందనే’’ సామెత సామాన్య మధ్యతరగతి, కార్మికులు, వ్యవసాయ కూలీలు, కాయకష్టం చేసే శ్రమజీవులకు వర్తిస్తుంది. డబ్బు సంపాదన జీవిత గమనానికి అవసరమే. అవసరానికంటే ఎక్కువ ఆర్జించి ప్రోదిచేసుకోవడం ఆర్థిక వ్యభిచారమని... గాంధీజీ ఒకచోట వ్యాఖ్యానించారు. సులభార్జన పట్ల మక్కువ జోరెత్తుతుండటంతో విద్యార్థులు, యువతరమే ప్రధాన లక్ష్యంగా క్రికెట్ బెట్టింగ్‌లు, జూదం గ్యాంబ్లింగ్ నిర్వహణలతో, అనూహ్య లబ్దిని ఆశచూపి టోకున టోపీ పెట్టే మోసకారి సంస్థల దగాకు ప్రజలు నిలువెత్తునా మునిగిపోతున్నారు.
రాష్ట్ర రాజధానిలో బెట్టింగ్ దందా నెరపుతున్న అంతరాష్ట్ర ముఠా ఒకటి ఇటీవల పోలీసుల వలలో చిక్కడం బెట్టింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉందనే ఋజువు లభించింది. అయిదేళ్ళ క్రితం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జైపూర్‌లో ఐపీఎల్ పోటీ ఆరంభం కావడానికి ముందు కోల్‌కత్తాలో అంతరాష్ట్ర బెట్టింగ్ ముఠా పట్టుబడడం గగ్గోలు పుట్టించింది. అప్పట్లో వారివద్ద నుంచి మొబైల్ ఫోన్లు, స్కోర్ షీట్లు, వివిధ ప్రాంతాల వ్యక్తులతో ఫోన్ సంభాషణల్ని నమోదుచేసే యంత్ర పరికరాలు దొరకడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం భాగ్యనగరానికి అలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవస్థ వ్యాపించిందని గచ్చిబౌలీ ముఠా ఉదంతం నిరూపిస్తోంది. రాష్ట్ర రాజధానిలోనే కాకుండా గుడివాడ, రేపల్లె, హిందూపురం, తాడిపత్రి, ధర్మవరం, చిత్తూరు, వాటికి అనుబంధాలైన మున్సిపాలిటీలు, చిన్న పట్టణాలలో సైతం బెట్టింగ్ భూతం ఆవహించి బెట్టింగ్ భూతాలా నర్తనలు మిన్నుముట్టాయి. అందినకాడికి అడపా దడపా, పోలీసులకు అడ్డగా చిక్కిపోయారు. అంతేకాకుండా ప్రధాన నగర శివార్లలోని రిసార్టులు, డాబాలు, మద్యశాలలు భారీ తెరపై క్రికెట్ వీక్షణాల మాటున లక్షలకు లక్షలు చేతులు మారుతున్నాయి.
ముంబై, దుబాయ్‌లకు చెందిన బడా ముఠాల కనుసన్నల్లో పనిచేసే బుకీలు, వారి మనుషులు జిల్లాల వారిగా తమ వ్యాపారాన్ని చాపకింద నీరులా విస్తరించుకుపోతున్నట్లు కథనాలు, విశే్లషణలు చాటుతున్నాయి. కోట్ల రూపాయల స్థాయికి ఎగబాకిన బెట్టింగ్‌లో క్రీడాకారులకు ప్రమేయం ఉండబోదన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమంటూ జస్టిస్ చంద్రచూడ్ కమిటీ పేర్కొన్న విషయాల్ని కొట్టిపారేయలేనివే. కృష్ణా జిల్లాలో పోలీసు యంత్రాంగానికి లక్షల రూపాయల నెలవారి ముడుపుల్ని ముట్టజెప్పి యదేచ్ఛగా సాగించిన సింగిల్ నెంబరు లాటరీ భాగోతం సమాజంలో జూదప్రక్రియకు అద్దం పట్టేదే. అంతేకాకుండా వివిధ జిల్లాలలో లాటరీ టికెట్లు నేరుగా అందజేయకుండా నెంబర్లను మాత్రం లాటరీ జూదరులకు అందజేసే వినూత్న ప్రక్రియ కార్మిక, మధ్యతరగతి, బీదల కుటుంబాల్ని నట్టేట ముంచుతోంది. ఈ ప్రక్రియతో లాటరీలు నిర్వహిస్తున్నారని ఆయా పట్టణాలలోని స్థానిక పోలీసులకు తెలిసినా ముడు పులు స్వీకరించడం వల్ల నోరు మెదపడంలేదు.
నగరాలు, పట్టణాలలో గంజాయి, హెరాయిన్ విచ్చలవిడిగా లభ్యమవుతూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నాయి. చైనా, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు మరణశిక్షలు అమలు జరుపుతుంటే మన దేశంలో నిక్షేపంగా అక్రమ రవాణా, విక్రయాలు పెద్దఎత్తున సాగిస్తూ లాభార్జన బాటలో నిక్షేపంగా మనగలుగుతున్నారు. దేశంలో ఎటువంటి ఆర్థిక నేరాలు, కుంభకోణాలు పునరావృత్తం కాకుండా ఉండటానికి వెనువెంటనే బాధ్యుల్ని గుర్తించి శిక్షించాలని, వ్యవస్థాపరమైన లోటుపాట్లను తక్షణం పరిహరించాలని డాక్టర్ రంగరాజన్ కమిటీ ఏనాడో సిఫార్సుచేసింది. వ్యసనాలను ఆర్థిక వనరులుగా మలచుకోవాలన్న అత్యాశ, మానసిక దౌర్భల్యం మనుషులను పెడదారి పట్టించి అవినీతి ఊబిలోకి లాగుతున్న వైనాన్ని ప్రభుత్వాలు వెంటనే గుర్తించి, అడ్డుకట్టవేయకపోతే సామాజిక పరిణామాలు పెడదారి పట్టి దేశ ప్రగతికి గొడ్డలి పెట్టులా మారుతుంది.
సబ్ ఫీచర్
english title:
corruption
Date:
Friday, July 19, 2013