పాలకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆధీనంలోని విద్యారంగంలో ప్రమాణాలు అంతకంతకూ పతనమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నా చట్టాలమీద చట్టాలు తెస్తున్నా లక్ష్యానికి చేరువకాలేకపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అందరికీ విద్యనందించాలనే ఆశయంతో విద్యా హక్కు చట్టాన్ని అమలుచేస్తున్నామని చెప్పుకుంటున్నా ఆశించిన ఫలితాలు కనబడటంలేదు. ఎన్ని చేసినా విద్య అందని అంగడి సరుకుగా మారిపోయింది. ఉన్న వారికి నాణ్యమైన విద్య, లేని వారికి నాసి రకం విద్య అన్నట్లుగా తయారైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చాలీచాలని వసతులు కూర్చునేందుకు బల్లలు లేని పరిస్థితి. మరుగుదొడ్లు అందుబాటు లేని మంచినీరు. వస్తారో రారో తెలియని గురువులు. వీటన్నింటిని మించి గట్టిగా వానొచ్చినా కూర్చునేందుకు అనువుగా లేని భవనాలతో ప్రాథమిక విద్య కొట్టుమిట్టాడుతున్నది. మమీ, డాడీ చదువులు వచ్చిన తర్వాత ప్రైవేట్ విద్యకు, ప్రభుత్వ విద్యకు వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. సర్కారు బడిలో చదువు చదవటం నామోషీ పడే రోజులు దాపురించాయి. విద్యారంగంపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
పూర్వవైభవం సాధ్యమేనా?
తెలుగుదేశం అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో తమ ‘వస్తున్నా మీకోసం’ ముగింపు సభలో ప్రస్తుత కాంగ్రెస్ అవినీతి, అసమర్ధ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని, సామాన్య జనం కష్టాలు చూసి తాను మనస్తాపం చెందినట్లు, ప్రజలు ఈసారి తె.దే.పాని గెలిపిస్తే తాను ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చి అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లి పేదవారు లేకుండా చేసేదాకా నిద్రపోనని, అన్ని వర్గాల వారికి ప్రయోజనాలు పొందేట్టు అవినీతి రహిత పాలన అందిస్తానని వరాల జల్లు కురిపించడమేగాక, అందమైన స్వప్నలోకానికి తీసుకెళ్లారు. 9 ఏళ్ల పాలన చేసిన ముఖ్యమంత్రిగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తి బాధలు, సమస్యలు లేకుండా చేయడం అసాధ్యమని ఆయనకు తెలుసు. ‘ఒక్కడే’ ఈ సమాజాన్ని సినిమాలో మార్చగలడేమోకాని వాస్తవంగా అసాధ్యం.
- జి.వి.రత్నాకరరావు, వరంగల్
మందు తాగండి..ప్రభుత్వాన్ని నిలపండి
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి తనదైన శైలిలో మద్యం వ్యాపారుల పట్ల విశాల హృదయాన్ని ప్రదర్శించింది. విశాల హృదయాన్ని ప్రదర్శించడమే కాకుండా తమ పర్మిట్ రూంలను కూడ విశాలం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. రిటైల్ వైన్ షాపులో కూడ కూర్చొని తాగడానికి కుర్చీలు వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ‘‘ఫ్రెండ్లీ పాలసీ’’ అని కొత్తగా నామకరణం చేసి బెల్టు షాపులకు అ(న)్ధకారికంగా అనుమతి ఇచ్చినట్లయింది. ప్రభుత్వ పాలసీ ద్వారా ప్రజలకు (మగవారికి) చెప్పేదేమిటంటే‘చేతిలో మద్యం సీసాపట్టు’, ప్రభుత్వాన్ని చక్కబెట్టు’ అనే చందంగా తయారైంది. మీరు బాగా తాగి ప్రభుత్వాన్ని, నాయకులను చక్కపెడితే మీ కుటుంబాలు బాగుపడటానికి మహిళలకు వడ్డీలేని రుణం ఇస్తాం అన్న చందంగా తయారైంది. ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ రకరకాల పేర్లతో అమలుకు సాధ్యంకాని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అక్రమ మార్గాల ద్వారా ప్రజల సంపాదనను దోచుకుంటూ ‘‘కుక్కకు బొక్క వేసే’’ చందంగా తయారైంది ప్రజలు ఓటుకు నోటు, నోరుకు బీరు ఆశపడకుండా మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటే మనకు మనం మేలుచేసుకున్న వాళ్ళమవుతాం.
- మూర్తి ఆనంద్‌కుమార్, రామాయంపేట
బంద్‌ల వల్ల తీరని నష్టం
గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో బందులు, సమ్మెలు ఎక్కువగా జరగడంవలన ఎన్నో విలువైన పని గంటలు, విద్యార్థులకు పాఠశాలలో తగ్గింపు బోధనా సమయం ఇంకా ఎన్నో ఇతర విలువైన సమయం నష్టం జరిగింది. ప్రజాస్వామ్యంలో సమ్మె అనేది చాలా అరుదుగా, ఒక సమస్యకు పరిష్కార దిశగా మారాలి తప్ప ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, ఇంకా కొంతమందికి రోజూ పనికి ఆటంకం కారాదు. మన రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడే మొదలైన విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలి. పాఠశాలలు, కాలేజీలు మరియు విశ్వవిద్యాలయాలు సమ్మెకు గురికావడం ఆందోళనకరమైన విషయం. తల్లిదండ్రులు ఎంతో శ్రమ తో వారి పిల్లలను, పాఠశాలలకు ఎంతో డబ్బు చెల్లించిన తరువాత సమ్మెలవలన పాఠశాలలు మూసివేస్తే వారి దుఃఖానికి కొలమానం ఏది. రాజకీయ నేతలు, విద్యాధికులు, ఇంకా ఎంతోమంది ఈ సమస్యను పరిష్కరించాలి,
- మేడవరం జితామిత్ర, హైదరాబాద్