ముంబయి, జూలై 19: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెనె్సక్స్ శుక్రవారం 21 పాయింట్లు వృద్ధి చెంది దాదాపు నిలకడగా సాగింది. అయితే ఇన్ఫోసిస్‌లా టిసిఎస్ కూడా తొలి త్రైమాసిక ఫలితాల్లో చక్కటి లాభాలను ఆర్జించడంతో దాని ప్రభావం వల్ల వరుసగా మూడవ రోజూ లాభపడి ఆరు వారాల గరిష్ఠ స్థాయికి ముగిసింది. కాగా బిహెచ్‌ఇఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోడంతో సెనె్సక్స్ పెద్దగా లాభపడకపోయినా ఐటి, ఆటో రంగ స్టాక్స్ లాభపడడంతో మార్కెట్ అనుకూల ధోరణిలోనే సాగింది. త్రైమాసిక ఫలితాలను త్వరలో ప్రకటించనున్న ఆర్‌ఐఎల్ షేరు 0.7 శాతం లాభపడింది. గత రెండు సెషన్స్‌లో 277 పాయింట్లు లాభపడిన సెనె్సక్స్ మూడవ రోజైన శుక్రవారం కూడా 21.44 పాయింట్లు వృద్ధి చెంది 0.11 శాతం పెరిగి 20,149.85 వద్ద ముగిసి రెండు నెలల గరిష్ఠ స్థాయి అయిన 20,256.60 దరిదాపులకు చేరింది. మదుపరులు కొన్ని స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు పాల్పడడంతో లాభాలు తగ్గాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ తరహాలోనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తొలి త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని బ్రోకర్లు తెలిపారు. ఈ త్రైమాసికంలో టిసిఎస్ మొత్తం ఆదాయం 14,869 కోట్ల రూపాయల నుంచి 21 శాతం వృద్ధి చెంది 17,987 కోట్లకు చేరింది. దాంతో శుక్రవారం ఆ కంపెనీ షేరు 4.92 శాతం లాభపడి 1740.10 రూపాయల నుంచి పెరిగి 1755 రూపాయలకు చేరింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ స్వల్పంగా 8.55 పాయింట్లు వృద్ధి చెంది 0.15 శాతం పెరిగి 6,029.20 వద్ద ముగిసింది. ఒక దశలో నిఫ్టీ 6,066.85 గరిష్ఠ స్థాయికి చేరింది. సెనె్సక్స్‌లో 16 కంపెనీల స్టాక్స్ లాభపడగా 14 నష్టాలతో ముగిసాయి. బాగా లాభపడిన స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీల్యాబ్స్, హీరో మోటార్ కార్పొరేషన్, ఒఎన్‌జిసి కంపెనీలున్నాయి. ఇంకో వైపు ఉన్న ఆర్డర్లు రద్దయ్యి, మాంద్యం వల్ల కొత్త ఆర్డర్లు లభించకపోవడంతో బిహెచ్‌ఇఎల్ షేరు 8 శాతం నష్టపోయింది. హెచ్‌డిఎఫ్‌సి తొలి త్రైమాసికంలో 34 శాతం నికరలాభాన్ని ఆర్జించినప్పటికీ, అంచనాలకు తగ్గట్లు ఫలితాలు రాకపోవడంతో దాని షేరు 2.35 శాతం క్షీణించింది. సెక్టార్‌పరంగా ఐటి 2.81 శాతం, టెక్ ఇండెక్స్ 2.20 శాతం, ఆటో ఇండెక్స్ 1.66 శాతం, చమురు, గ్యాస్ ఇండెక్స్ 0.67 శాతం లాభపడింది.
బలపడిన రూపాయి
ముంబయి, జూలై 19: రెండు రోజుల నష్టం నుంచి రూపాయి శుక్రవారం కోలుకుని 32 పైసలు బలపడి డాలర్ విలువతో 59.35పైసల వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు, కొంత మంది బ్యాంకర్లు తాజాగా డాలర్లను అమ్మడంతో డాలర్ క్షీణించి రూపాయి బలపడింది. అంతేకాక స్టాక్ మార్కెట్‌లోకి 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి చేరింది. ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలో రూపాయి 59.30 గరిష్ఠానికి చేరగా బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో 0.54 శాతం పెరిగి 59.35 వద్ద రూపాయి స్థిర పడింది.
వడ్డీరేట్లు తగ్గించిన పంజాబ్, సింధ్ బ్యాంక్
న్యూఢిల్లీ, జూలై 19: రుణాలపై కనీస వడ్డీరేటును 0.26 శాతం తగ్గిస్తున్నట్లు పంజాబ్, సింధ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. దీని వల్ల వినియోగదారుల ఇఎంఐ ఇతర వడ్డీరేట్లు తగ్గుతాయి. గతంలో ఉన్న కనీస వడ్డీరేటు 10.25 శాతం నుంచి 9.99 శాతానికి చేరుతుంది. ఆగస్టు 1 నుంచి ఈ రేటు అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలియచేసింది.
వొడాఫోన్ ఆదాయంలో 13 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జూలై 19: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్ నెలల్లో భారతదేశంలో తమ కార్యకలాపాల వల్ల వచ్చే ఆదాయం 13 శాతం పెరిగి 9,933.42 కోట్ల రూపాయలు(జిబిపి 1,091 మిలియన్లు) సాధించినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలికాం కంపెనీ వొడాఫోన్ శుక్రవారం తెలియచేసింది.
మనదేశంలో 11,217 కోట్ల రూపాయల పన్ను వివాదంలో కంపెనీ చిక్కుకుంది. ‘స్థిరమైన ధరల వాతావరణం భారత్‌లో నెలకొనడం, కస్టమర్ల వెరిఫికేషన్ విధానం మెరుగవడం, డేటా రాబడి పెరగడం వల్ల ఆదాయం పెరిగింది’ అని వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ త్రైమాసికంలో మొబైల్ ఇంటర్‌నెట్ వినియోగం కూడా 29 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది.