ముంబయి, జూలై 19: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 34 శాతం పెరిగి 1,707.10 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి శుక్రవారం ప్రకటించింది. గత సంవత్సరం ఏప్రిల్-జూన్ నెలల్లో 1,275.86 కోట్ల రూపాయల మేర ఏకీకృత నికర లాభాన్ని సాధించినట్లు కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం 7,388.51 కోట్ల(కిందటేడు ఇదే త్రైమాసికంలో) నుంచి పెరిగి 8,482.85 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. ఏకీకృత నికర లాభంలో అనుబంధ సంస్థలైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి వెంచర్ క్యాపిటల్, గృహ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి. కాగా మాతృసంస్థ అయిన హెచ్‌డిఎఫ్‌సి సంస్థ ఒకటి గత సంవత్సరం ఈ త్రైమాసికంలో 1,001.91 కోట్ల రూపాయల నికర లాభాన్ని గడించగా ఈ త్రైమాసికంలో 17 శాతం వృద్ధి సాధించి 1,173.10 కోట్ల రూపాయలు ఆర్జించింది. మొత్తం ఆదాయం 4,934.95 కోట్ల నుంచి 5,556.94 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇది మార్కెట్ వర్గాల అంచనాలకు తగినట్లే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
* 34 శాతం పెరిగిన ఏకీకృత లాభం
english title:
hdfc
Date:
Saturday, July 20, 2013