బెంగళూరు, జూలై 19: ‘19 బాంబులతో విప్రో కార్యాలయంలోని ట్రైనింగ్ బ్లాక్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు, శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పేల్చివేస్తాం’ అని ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీకి శుక్రవారం సర్జాపూర్ పోలీసు స్టేషన్‌కు అందిన ఆకాశ రామన్న లేఖ కలకలం రేపింది. ‘ఈ లేఖ అందినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ హుటాహుటిన విప్రో ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తనిఖీలు ముమ్మరంగా చేసి ఎటువంటి బాంబులు లేవని తేల్చిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భద్రతా చర్యల్లో భాగంగా సర్జాపూర్ విప్రో ఆవరణలో తనిఖీలు నిర్వహించినట్లు విప్రో కంపెనీ కూడా తెలియచేసింది.
ఆర్‌ఐఎల్ నికర లాభం రూ.5,352 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 19: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ నెలల్లో నికర లాభం 19 శాతం పెరిగి 5,352 కోట్ల రూపాయలు సాధించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించింది. రిఫైనింగ్ మార్జిన్లు పెరగడం వల్ల గత సంవత్సరం కంటె నికర లాభం పెరిగిందని, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 4,503 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే కృష్ణా,గోదావరి (కెజి-డి6) చమురు క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోడంతో ఆదాయం 4.6 శాతం తగ్గి 90,589 కోట్ల రూపాయలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
కెజి డి-6లో ఉత్పత్తి 53 శాతం క్షీణించి ఈ త్రైమాసికంలో 49.2 బిలియన్ క్యుబెక్ అడుగులు మాత్రమే లభించింది.
హిందుస్తాన్ జింక్ నికర లాభం 5% వృద్ధి
న్యూఢిల్లీ, జూలై 19: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికర లాభం 5 శాతం పెరిగి 1660.45 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్ జింక్ తెలిపింది. అమ్మకాలు పెరిగి, ఉత్పత్తి వృద్ధి చెందినా మెటల్ ధరలు తక్కువగా ఉండడం వల్ల ఈ త్రైమాసికంలో నికర లాభం అంచనాలకు తగినట్లు లేదని కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,581.34 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. గత సంవ్సరం ఈ త్రైమాసికంలో అమ్మకాల వల్ల 2,712.67 కోట్ల రూపాయలు ఆర్జించగా ఈ ఏడాది నికర అమ్మకాలు 8.36 శాతం పెరిగి 2,939.41 కోట్లు సాధించినట్లు జింక్ పేర్కొంది. జింక్ ఉత్పత్తి 10 శాతం పెరిగి 1,73,000 టన్నులు సాధించగా లండన్ మెటల్ ఎక్స్చేంజిలో (ఎల్‌ఎంఇ) ధర ఈ త్రైమాసికంలో 5 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది.