న్యూఢిల్లీ, జూలై 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ రంజీ క్రికెటర్ ప్రదీప్ సంగ్వాన్ ఎవరి మాటా వినడట. మూర్ఖంగా ప్రవర్తించడంలో అతనిని మించిన వారు లేరట. డోప్ పరీక్షలో పట్టుబడిన సంగ్వాన్ గురించి ఈ వ్యాఖ్యలు చేసింది ఆషామాషీ వ్యక్తికాదు. ఒకప్పుడు భారత క్రికెట్‌కు అల్‌రౌండర్‌గా అసాధారణ సేవలు అందించిన మనోజ్ ప్రభాకర్ చెప్పిన వాస్తవాలు. ఉత్ప్రేరకాలను వాడినట్టు డోప్ పరీక్షలో సంగ్వాన్ పట్టుబడడంపై ఢిల్లీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మనోజ్ తీవ్రంగా స్పందించాడు. అతనికి మంచి చెడులను చెప్పేందుకు ఎవరూ లేరని, దీనితో ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడని మనోజ్ అన్నాడు. శారీరంలో పైభాగాన్ని బలోపేతం చేసుకోవడానికి విపరీతంగా కష్టపడవద్దని, దీని వల్ల అసాధారణ బౌలర్‌గా ఎదిగే అవకాశాలు దెబ్బతింటాయని తాను సంగ్వాన్‌కు పలుమార్లు సూచించినట్టు తెలిపాడు. అయితే, తన సూచనలను అతను పట్టించుకోలేదని అన్నాడు. ‘సిక్స్ ప్యాక్ బాడీ’ అన్నది బాడీ బిల్డర్లకో, సినీ నటులకో బాగుంటుందిగానీ క్రికెటర్లకు కాదని మనోజ్ స్పష్టం చేశాడు. ఫ్యాషన్ వేరు.. క్రికెట్ వేరు అన్న వౌలిక అంశాన్ని సంగ్వాన్ గుర్తించలేదని చెప్పాడు. బౌలింగ్ కంటే నైట్ పార్టీలకే అతను ప్రాధాన్యం ఇచ్చేవాడని అన్నాడు. చాలాసార్లు తాను ఈ విషయంపై అతనిని నిలదీశానని మనోజ్ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చీర్ గరల్స్‌ను ప్రవేశపెట్టడం, అర్ధరాత్రి వరకూ ఆటగాళ్లకు పార్టీలను ఏర్పాటు చేయడం వల్లే ఇలాంటి ఉపద్రం ముంచుకొచ్చిందని విమర్శించాడు. క్రికెటర్లను ఫ్యాషన్ మోడల్స్‌గా తయారు చేస్తున్నదని ఐపిఎల్‌పై ధ్వజమెత్తాడు. సంగ్వాన్ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు కెరీర్‌ను చేతులారా దెబ్బతీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకానొక దశలో ఇశాంత్ శర్మ కంటే ముందుగానే సంగ్వాన్ జాతీయ జట్టు లో స్థానం సంపాదిస్తాడని తాను ఊహించినట్టు మనోజ్ చెప్పాడు.
డోపింగ్ క్షమార్హం కాదు: కోహ్లీ
న్యూఢిల్లీ, జూలై 19: డోపింగ్ క్షమార్హం కాదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని భారత యువ బ్యాట్స్ మన్, జింబాబ్వే పర్యటనకు వెళ్లే టీమిండియాకు నాయకత్వం వహించనున్న విరాట్ కోహ్లీ స్పష్టం చేశా డు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ క్రికెట్‌లోనూ డోపింగ్ సమస్య తలెత్తడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. ఇలాంటి పనులకు ఎవరు పాల్పడినా క్షమించరాదని చెప్పాడు. జిం బాబ్వేకు వెళ్లే జట్టు పటిష్టంగా ఉందని కోహ్లీ అన్నాడు. అక్కడ విజయాలను సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీ, విండీస్‌లో జరిగిన ట్రై సిరీస్‌లలో విజయాలను సాధించామని, జింబాబ్వేలోనూ గెలుస్తామని అతను ధీమా వ్యక్తం చేశాడు.
హాకీ వీడియో అనలిస్టుగా
మహాధిక్ నియామకం
న్యూఢిల్లీ, జూలై 19: భారత పురుషుల హాకీ జట్టుకు వీడియో అనలిస్టుగా ధనంజయ్ మహాధిక్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) నియమించింది. తొలి హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో పాల్గొన్న ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు అతను వీడియో అనలిస్టుగా పని చేశాడు. మాజీ క్రీడాకారుడైన మహాధిక్ కెరీర్‌లో 64 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హాకీ రంగానికి వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నాడు. ఆధునిక హాకీలో, ప్రత్యర్థి జట్ల బలాబలాలను నిర్ధారించుకొని, వ్యూహ రచన చేసుకోవడానికి వీడియో అనాలిసిస్ కీలక భూమిక పోషిస్తున్నది. విదేశీ జట్లు ప్రత్యేకంగా వీడియో అనలిస్టులను నియమించుకొని, వారి సలహాలు, సూచనలతో జట్టు వ్యూహాలను ఖరారు చేస్తున్నాయి. హెచ్‌ఐ కూడా ఇదే పంథాను అనుసరించాలని నిర్ణయించి, మహాధిక్‌ను వీడియో అనలిస్టుగా నియమించింది.
23 నుంచి ఫెడరేషన్ కప్ హాకీ
న్యూఢిల్లీ, జూలై 19: భారత హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి ఫెడరేషన్ కప్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈనెల 28 వరకూ ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీలోని శివాజీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ఐహెచ్‌ఎఫ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ హాకీ సంఘం, హర్యానా హాకీ సంఘం సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహణ బాధ్యతలను స్వీకరించాయని పేర్కొంది.
స్వదేశానికి బుకానన్
వెల్లింగ్టన్, జూలై 19: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సి)లో క్రికెట్ డైరెక్టర్‌గా రెండేళ్లు సేవలు అందించిన ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ స్వదేశానికి వెళ్లనున్నాడు. క్రికెట్ డైరెక్టర్‌గా అతను సంతృప్తికరమైన సేవలు అందించాడని ఎన్‌జెడ్‌సి ఒక ప్రకటనలో తెలిపింది. అతను స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. వ్యక్తిగత కారణాల వల్ల తాను వెళ్లాల్సి వస్తున్నదని బుకానన్ తెలిపినట్టు ఆ ప్రకటనలో వివరించింది. అయితే, ఎన్‌జెడ్‌సిలోని కొంత మంది సభ్యులతో బుకానన్ విభేదిస్తున్నాడని, అందుకే అతనికి ఉద్వాసన పలికారని సమాచారం.
ఎన్‌సిఎలో శిక్షణకు
అమీర్‌ను అనుమతించండి
ఐసిసిని కోరిన పాక్ క్రికెట్ బోర్డు
కరాచీ, జూలై 19: స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా రుజువుకావడంతో లండన్ జైల్లో శిక్ష అనుభవించి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న యువ పేసర్ మహమ్మద్ అమీర్‌ను జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ)లో శిక్షణకు అనుమతించాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కోరింది. అమీర్‌ను ఎన్‌సిఎ శిక్షణకు ఐసిసి అనుమతించిందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను ఐసిసి ఖండించింది. అమీర్‌కు అలాంటి అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమీర్ తరఫున పిసిబి వకాల్తా పుచ్చుకుంది. తమ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొందేందుకు అతనిని అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అమీర్‌పై ఐసిసి ఐదేళ్ల నిషేధం విధించింది. దీనిని తర్వాత నాలుగుళ్లకు కుదించింది. వచ్చే ఏడాదికి అతని సస్పెన్షన్ కాలం పూర్తవుతుంది. ఈలోగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమీర్ ఆశిస్తున్నాడని ఐసిసికి రాసిన లేఖలో పిసిబి పేర్కొంది. ఇలావుంటే, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పిన్నర్ దనీష్ కనేరియా విషయంలో పిసిబి ఎలాంటి వినతి చేయకపోవడం గమనార్హం. ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌లో హిందువులకు జరుగుతున్న అన్యాయానికి ఇదో నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.