2013 జూలైలో గంగానదికి వరదలు వచ్చి కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రిలలో వేల మంది కొట్టుకుపోయి మరణించారు. కానీ సుమారు రెండు వందల ఏళ్ల క్రితం లండన్ నగరంలో వచ్చిన ఓ వరదలో తొమ్మిది మంది మరణించారు. అది నీటి వరద కాదు, బీర్ వరద!
లండన్‌లోని సెయింట్ గైల్స్ అనే చోట టోటెన్ హేమ్ కోర్ట్ రోడ్‌లో ‘మ్యూక్స్ అండ్ కంపెనీ బ్రూవరీ’ ఉండేది. అందులో బ్రిటీష్ రాజు, రాణిల వినియోగం కోసం మూడు లక్షల ఇరవై మూడు వేల గేలన్ల (14 లక్షల 70 వేల లీటర్లు) బీర్ నిల్వ ఉంది. ఆ బ్రూవరీ బీదవారి నివాస గృహ సముదాయంలో వుండేది. సెంట్రల్ లండన్‌లోని ఆ బ్రూవరీలో ఇరవై అడుగుల ఎత్తుగల బీర్ పీపాలు వందల కొద్దీ ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి. ప్రతీ పీపాలో 3555 బేరల్స్ ఏల్ (ఒక రకం బీర్) నిల్వ ఉండేది. వాటన్నిటినీ కలిపి ఇరవై తొమ్మిది లోహపు చైన్లతో కట్టారు.
అక్టోబర్ 17, 1814న ఓ పీపాకి కట్టిన చైన్ తెగింది. తర్వాత మరొకటి. ఆ రెండు పీపాలు పగిలిన శబ్దం ఐదు మైళ్ల దూరం దాకా వినిపించింది. ఆ తాకిడికి మిగిలిన పీపాలన్నీ కూడా పేలిపోయి వాటిలో నిలవ వున్న మొత్తం బీర్ ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల ఇటుక గోడ మీంచి రద్దీగా ఉండే సెయింట్ గైల్స్‌లోని ఇళ్ల మీదికి పారింది. అక్కడ చాలా బీద కుటుంబాలు ఒకే గదిలో నివసించేవి. బీర్‌ని చూసి చాలామంది అటకలు ఎక్కి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. కానీ బేస్‌మెంట్‌లో ఉన్నవారు ఆ బీర్‌లో మునిగి ఊపిరాడక మరణించారు. కొందరు అదృష్టవంతులు పైకి పరిగెత్తి ఇళ్ల కప్పుల మీదికి ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. బ్రూవరీలోని ఓ ఉద్యోగి తన సోదరుణ్ణి బీర్‌లో పడి కొట్టుకుపోకుండా రక్షించాడు. ఐతే మరో ఉద్యోగిని మాత్రం మరణించింది. ఆ బీర్ ప్రవాహ వేగానికి ఇళ్లన్నీ నాశనమయ్యాయి. క్రమేపీ బీర్ లండన్ నగర రోడ్ల మీదకి వెళ్లి డ్రైనేజీలో కలిసిపోయింది.
ఐతే చాలామంది నడుం దాకా బీర్ వచ్చేదాకా ఆగి, దాన్లోకి దిగి మగ్గుల్లో, బక్కెట్లలో ఆ బీర్‌ని నింపి తాగారు. అది రాజవంశం కోసం చేసి, ప్రత్యేకంగా రెండేళ్ల పాటు ఓక్ పీపాల్లో నిల్వ ఉంచింది కాబట్టి సాధారణ ప్రజలు అంతదాకా రుచి చూడని అద్భుతమైన బీర్ అది కాబట్టి ఎగబడి తాగారు.
మొత్తం ఆరు వందల టన్నుల బరువుగల ఆ బీర్ పదిహేను అడుగుల ఎత్తులో ప్రవహించింది. ఆ ఇళ్లల్లోని ఆరుగురు ముసలి వాళ్లు, పిల్లలు మరణించారు. మరణించిన బ్రేవరీలోని ఓ ఉద్యోగిని వయసు పధ్నాలుగే. సమీపంలోని టాలిస్టాక్ ఆమ్స్ పబ్ అనే బార్ కూడా ఆ బీర్ తాకిడికి నాశనమైంది.
మరణించిన ఎనిమిదో వ్యక్తి మర్నాడు ఆల్కహాల్ పాయిజన్‌తో మృతి చెందాడు. బీర్‌ని అధికంగా తాగి స్పృహ తప్పిన అతన్ని హాస్పిటల్‌లో చేర్పించిన కొద్ది గంటలకే అతడు మరణించాడు. అతన్నించి వచ్చిన బీర్ వాసనకి హాస్పిటల్‌లోని ఇతర రోగులు హాస్పిటల్‌లో బీర్ పార్టీ జరుగుతోందని భావించారు. నర్సులు కాదని చెప్పినా మర్నాడు దినపత్రికల్లో చదివితే కానీ వారు నమ్మలేదు. బీర్ వరదల్లో మరణించిన తమ బంధువులని కొందరు బీద ప్రజలు కొంత రుసుము వసూలు చేసి చూపించారు. లండన్ ప్రజలు క్యూలో నిలబడి మరీ వారి మృతదేహాలను ఆసక్తిగా చూశారు. ఇది తెలిసిన పోలీసులు వచ్చి ఆ ప్రదర్శనని నిలిపివేశారు. ఈ ప్రమాదం సాయంత్రం పూట జరిగింది. అంతా అది బీర్ తాగే సమయం కాబట్టి బీర్ వాసన వస్తూంటే బీర్ వరద వస్తోందని గ్రహించక పక్కగదిలో బీర్ ఒలికిందని భావించారు. చాలా వారాలపాటు వారు తమ ఇళ్లల్లోని బీర్‌ని ఎత్తి బయట పోస్తూనే ఉన్నారు. కొన్ని నెలల దాకా ఆ ప్రాంతంలోని బీర్ వాసన పోలేదు.
బ్రేవరీ మీద కొందరు నష్టపరిహారం కోసం కోర్టుకెక్కారు. జడ్జి, జ్యూరీ సభ్యులు దాన్ని ‘ఏక్ట్ ఆఫ్ గాడ్’గా భావిస్తూ ఎవర్నీ బాధ్యులను చేయలేదు. ఆ బ్రేవరీకి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లడంతో, అప్పటికే నష్టపోయిన బీర్ మీద చెల్లించిన డ్యూటీని పార్లమెంట్ తిరిగి వారికి ఇచ్చేయడమేగాక, వారి వ్యాపార లైసెన్స్‌ని రద్దు చేయలేదు. ఆ బ్రేవరీని తిరిగి నిర్మించారు. 1922 దాకా ఇది నడిచింది. ఆ తర్వాత లండన్ నగర నియమాల ప్రకారం వెస్ట్‌లండన్‌లోని కొత్త ప్రదేశానికి దీన్ని తరలించారు. 1956లో మ్యూక్స్ బ్రేవరీ ఫ్రియారీ బ్రీవరీతో కలిసిపోయి ‘ఫ్రియారీ మ్యూక్ బ్రేవరీ’గా మారింది.
బీర్ వరద వచ్చిన ఆ ప్రదేశంలో ప్రస్తుతం డొమినియం థియేటర్ అనే నాటక శాల నడుస్తోంది. 800 పౌన్ల బరువుగల ఇనుప గొలుసుని పీపాలలోని బీర్ ఎలా తెంచేసిందా అన్నది నేటికీ అంతుపట్టడం లేదే. కొందరు శాస్తజ్ఞ్రులు దీని మీద అనేక ఊహాగానాలు చేశారు. ఈ సంఘటన మీద అనేక కథలు, నవలలు కూడా వెలువడ్డాయి. మరణించిన వారిలో అతి తక్కువ వయసుగల వ్యక్తి మూడేళ్ల థామస్ ముల్వే. అతి ఎక్కువ వయసుగల వ్యక్తి అరవై మూడేళ్ల కేథరిన్ బట్లర్. పధ్నాలుగేళ్ల బ్రేవరీ ఉద్యోగిని పేరు ఎలినార్ కూపర్.
నేటికీ సందర్శకులని పూర్వం బీర్ వరద వచ్చిన ఈ ప్రాంతానికి తీసుకువెళ్లే టూర్ నిర్వహింపబడుతోంది. లండన్ చరిత్ర పుటల్లో అనేక బీభత్సాలు జరిగాయి. లండన్ ప్లేగువ్యాధి, లండన్ నగరం అంటుకుని మండిపోవడం, లండన్ బీర్ వరద మొదలైనవి లండన్ వాసులకే కాక ప్రపంచానికి కూడా గుర్తుండిపోయిన దుర్ఘటనలు. (చిత్రం) లండన్‌లో బీరు వరద
*
నమ్మండి ! ఇదినిజం!
english title:
nammandi idi nijam
Date:
Sunday, July 21, 2013