అప్పుడే తెల్లారింది. ఇంకా పూర్తిగా మెలకువ రాలేదు. ఇంతలో ఫోన్ మోగింది. అలా పడుకునే సెల్ అందుకుని ‘హలో’ అన్నాడు సత్యం.
‘ఒరే, సత్యం, పొద్దునే్న నిద్ర లేపి ఒక విషాద వార్త చెప్పాల్సి వచ్చింది. ఈ రోజు ఉదయానే్న మీ బామ్మ పోయిందిరా. నిన్న రాత్రి వరకు బాగానే ఉంది. రాత్రి ఫలహారం చేసి పడుకున్నాక, ‘ఒరే, రాముడూ! కొంచెం ఆయాసంగా ఉందిరా’ అంది. ఎసిడిటీ అయ్యుంటుందని వెంటనే రెండు చెంచాలు ఏంటేసిడ్ పట్టాను. మళ్లా పడుకుంది. తెల్లారే నాలుగో గంటకి లేచిపోయి తన పనులు చేసుకుంటుంది. అలాంటిది ఇంకా లేవలేదేమిటి చెప్మా అని వెళ్లి చూస్తే ఊపిరాడ్డం లేదు. కదిపి చూశాను. ఉలుకూ పలుకూ లేదు. ఎందుకైనా మంచిదని పక్కింట్లో డాక్టరు చదువుతున్న అబ్బాయుంటే పిలిచి చూపించేను. ప్రాణం పోయి చాలాసేపయ్యిందని చెప్పేడు. నిద్దట్లోనే సునాయాసంగా చనిపోయింది పుణ్యాత్మురాలు. మనకే కష్టం మిగిల్చింది’ బామ్మ చావుని వివరించి చెప్పేడు రామం చిన్నాన్న. నిద్ర బద్ధకమంతా వదిలిపోయింది. స్థాణువులా కూర్చుండిపోయాడు.
‘హలో, హలో వింటున్నావా?’ అన్నాడు చిన్నాన్న.
‘ఆ..ఆ’ అన్నాను. అంతకు మించి మరే మాటా నోటి వెంట రాలేదు.
‘రాత్రి చాలాసార్లు నినే్న తలచుకుంది. తల్లీ దండ్రిలేని పిల్లాడు. ఒక్కడే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో పాపం. చూసి చాలా రోజులయ్యింది. ఒక్కసారి రమ్మని చెప్పరా రామం అని కంటతడి పెట్టుకుంది’ తరువాత ఏవేవో చెప్పేడు చిన్నాన్న. అన్నిటికీ ఊ.. ఆ అంటున్నాడే తప్ప ఏవీ బుర్రలోకి ఎక్కడం లేదు. బామ్మ ఆలోచనలతోనే మనస్సంతా నిండిపోయింది.
* * *
అదొక పల్లెటూరు. బ్రాహ్మణ వీధిలో సత్యం తండ్రి సుబ్బారావు, చిన్నాన్న రామారావు కలిసి ఒక పెద్ద పెంకుటింట్లో ఉండేవారు.
సుబ్బారావుకి ఒక్కడే కొడుకు సత్యం. సత్యం హైస్కూల్‌లో చదువుతూండగానే తల్లి తండ్రి అంటువ్యాధి సోకి చనిపోయారు. అప్పట్నించీ చిన్నాన్న దగ్గరే పెరిగాడు. వాళ్లకి ఒక్కత్తె కూతురు. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపేశారు. సత్యంకి బామ్మ దగ్గర చనువెక్కువ. బామ్మకి కూడా సత్యం అంటే ప్రాణం. ఎంత అల్లరి చేసినా భరించేది. పెద్దవాళ్లెవరైనా కోప్పడితే ఒప్పుకునేది కాదు. ఒకసారి బామ్మ స్నానం చేసి మడికట్టుకుని దేవుడి గదిలో పూజ చేసుకుంటోంది. సత్యం పరిగెత్తుకుంటూ వచ్చి బామ్మని వెనక నించీ పట్టుకుని ఊపుతూ
‘బామ్మా! బామ్మా! ముందు నాకు ప్రసాదం చేతిలో పెట్టి తరువాత పూజ చేసుకో. నేను వీధిలో ఆడుకోడానికి వెళ్లిపోవాలి’ అని మారాం చెయ్యడం మొదలుపెట్టాడు.
‘ఓరి భడవకానా! ఉండరా! మడిలో ఉన్నప్పుడు నన్ను ముట్టుకోకురా అంటే వినవు కదా! ఉండు మళ్లా స్నానం చేసి వచ్చి నీకు ప్రసాదం ఇస్తాను. అందాకా ప్రసాదం ముట్టుకోకు’ ఇదంతా చూసిన తండ్రి సత్యం వీపు మీద రెండు దెబ్బలు వేసి,
‘ఏరా! బామ్మ మడిలో ఉండగా ముట్టుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాలిరా! నువ్వు చేసిన పనికి చూడు ముసల్ది రెండోసారి మళ్లీ చన్నీళ్ల స్నానం చేస్తోంది. ఇప్పుడే ఆటలూ పాటలూ వద్దు. వెళ్లి పుస్తకం తీసి చదువుకో. రోజురోజుకీ నీ ముద్దు మరీ ఎక్కువై పోతోంది’ అని కేకలేశాడు.
‘ఒరే సుబ్బూ! వాణ్ణేం అనకురా. పసివాడు, వాడికేం తెలుస్తుంది మన మడులూ తడులూ. చూడు పాపం ఎలా ఏడుపు మొహం పెట్టాడో!’
‘ఆ.. అన్నీ వేషాలే. వాడికన్నీ తెలుసు. నువ్వనుకున్నంత అమాయకుడేం కాదు. అనవసరంగా ముద్దు చేసి వాణ్ణి మొద్దులా తయారుచేస్తున్నావు’ అని అక్కడ్నించి వెళ్లిపోయాడు తండ్రి.
తల్లిదండ్రుల దగ్గరకన్నా బామ్మ దగ్గరే పిల్లలిద్దరి బాల్యమంతా గడిచిపోయింది. వాళ్లకి అన్నం కలిపి ముద్దలు చేసి తినిపించేది. కథలు చెప్తూ జోలపాటలు పాడుతూ వాళ్లని పడుకోబెట్టేది. ఒకసారి మండువాలో చూరు కింద ఉన్న భోషాణం పెట్టె చూస్తూ సత్యం బామ్మని అడిగేడు.
‘బామ్మా! అంత పెద్ద పెట్టె మనింట్లోకి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చేరు’
‘్భడవా! తెలిసే అడుగుతున్నావా? నా నోటినించి వినాలని మళ్లీ మళ్లీ అడుగుతుంటావు’
‘లేదు బామ్మా! ఒట్టు. నాకు నిజంగా తెలీదు. ఇంతకు ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు నిద్రొచ్చింది. పడుకున్నాను. సరిగ్గా వినలేదు’
‘బామ్మా! బామ్మా! చెప్పవూ!’ సత్యం చెల్లి కూడా వంత పాడింది.
‘సరే, మీ సరదా ఎందుక్కాదనాలి. అది మీ తాతగారికి మా పుట్టింటి వాళ్లు పెట్టిన సారెతో వచ్చింది’
‘అంత పెద్ద పెట్టెందుకు? చిన్న సూట్‌కేసులు ఇవ్వొచ్చు కదా. ఎంచక్కా వాటిలో బట్టలూ, బొమ్మలూ పెట్టుకోవచ్చు కదా! ఇంత పెద్ద పెట్టె మూత కూడా తియ్యలేక పోతున్నాం’ అన్నాడు సత్యం.
‘అది బొమ్మలు, బట్టలు పెట్టుకోడానికి కాదురా! ఇత్తడి, కంచు సామాన్లు అవసరమైతే ధాన్యం పప్పులూ ఉప్పులూ దాచుకోవడానికి’
‘అంత పెద్ద పెట్టి తాతగారు ఎలా తీసుకొచ్చారు?’
‘అసలు తాతగారు వద్దనే అన్నారురా. అయినా మా వాళ్లు వినలేదు. అది మన సంప్రదాయం. భోషాణంతోపాటు సారె పంపకపోతే మా ఊళ్లో ఎంతో నామోషీ. నలుగురూ నానా రకాలుగా అనుకుంటారు అని పది మంది మనుషుల్ని సాయం ఇచ్చి మరీ పంపించారు. అదిగో అలాగొచ్చింది భోషాణం మనింటికి’
‘అయితే తాతగారి మాట నువ్వు వినలేదన్నమాట’ వెక్కిరించినట్టుగా అన్నాడు సత్యం.
‘నేను వినడమేమిటిరా భడవా! పెద్దవాళ్లు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. మధ్య నేనెవర్తిని. చచ్చి ఏ లోకంలో ఉన్నాడో మహానుభావుడు. నన్నిలా ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు. ఆ భోషాణాన్ని చూస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఏదో ఇలా గడిపేస్తున్నాను’
‘మేమందరం ఉన్నాం కదా! నువ్వొంటరి దానివెలా అయ్యావు?’ మనవడి మాటలకి మురిసిపోయిన ముసల్ది రెండు బుగ్గల మీదా ముద్దులు కురిపిస్తూ
‘అవునర్రా! మీరందరూ ఉండబట్టే నా ప్రాణం వెనక్కి లాగేస్తోంది. లేకుంటే ఎప్పుడో వెళ్లిపోయి మీ తాతగారిని కలుసుకొని ఉండేదాన్ని.
* * *
వెంటనే సెలవు కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. రెండు మూడు నెలలు పోయాక ఒకసారి ఆ ఊరు వెళ్లి వద్దామని బయల్దేరాడు. దారిలో అంతా బామ్మ గురించి తలచుకుంటూనే ఉన్నాడు. బామ్మ లేకపోయినా కనీసం భోషాణం చూస్తే బామ్మని చూసినట్లుగా ఉంటుందని అనుకున్నాడు. పది ఆరు మూడు అడుగుల భోషాణం మూత పైకి లేపాలంటే ముచ్చటగా ముగ్గురైనా ఉండాలి. బావురుకప్ప లాంటి పెద్ద ఇత్తడి తాళం. అది తెరవడానికి బారెడు పొడవైన చెవి. అన్ని పక్కలా ఇత్తడి నగిషీలు. ఇంటికొక అలంకారంగా ఉండేది.
చిన్ననాటి ఊరికి చేరువలోకి వచ్చేశాడు. అదిగో అదే వీధి. వీధి ముందు పెద్ద బావి. బావి చుట్టూ పచ్చని వృక్షాలు. చిన్నప్పుడూ ఊగుతూ ఆడుకొనే ఊడలమర్రి. ఇంకా అలాగే మరిన్ని ఊడలతో ఆహ్లాదంగా ఉంది. వృక్షాలను నరికేసే అన్యాయపు అభివృద్ధి ఛాయలు ఇంకా ఈ పల్లెకు చేరనందుకు సంతోషించాడు సత్యం. ఆడవాళ్లందరూ బావి చుట్టూ చేరి చేదలతో నీళ్లు తోడుకొని బిందెలు నింపుకుంటున్నారు. ఎవరితో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదుగాని నవ్వులూ ఎకసెక్కాలతో అంతా గోలగా ఉంది. సత్యం అటువేపు రావడం చూసి వాతావరణం ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ అతని వేపే చూస్తూ చెవులు కొరుక్కోవటం మొదలెట్టేరు. వాళ్ల చూపుల తూపులని తప్పించుకుంటూ గుసగుసల ప్రశ్నార్థకాలని వినీ విననట్టు నటిస్తూ, తన అంతరాంతరాల్లో నిత్యం విహరించే వీధిలోకి అడుగుపెట్టాడు సత్యం. అదిగో అదే ఇల్లు. పెద్దపెద్ద స్తంభాలూ, వెను వరండా లోగిలి, ముంగిట ముచ్చటైన ముగ్గులతో, జిగేలుమంటున్న జేగురు రంగు మెట్లతో పసిడి ఛాయతో మెరిసిపోతున్న గుమ్మం. దారుశిల్పాలతో ధగధగలాడుతున్న ద్వారం. కచేరీ చావడి దాటి మండువా లోగిలిలోకి అడుగుపెట్టాడు. అటూ ఇటూ చూచాడు. భోషాణం ఉండవలసిన జాగా బోసిపోయి ఉంది. నిరాశా, నిస్పృహ, నిస్త్రాణతో కుర్చీలో కూలబడ్డాడు. ఇంతలో పిన్ని వంటింట్లోంచి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి నీళ్లందించింది. చిన్నాన్న కూడా వీధిలోంచి వచ్చి
‘ఏరా! ఇప్పుడేనా రావడం? ముందుగా కబురు పంపించి వుంటే ఎవర్నైనా బండి ఇచ్చి స్టేషనుకి పంపించి ఉండేవాణ్ణి కదా! ఎండలో ఇంత దూరం నడుచుకొని వచ్చావా?’ పలకరించాడు.
‘్ఫర్వాలేదు చిన్నాన్నా. అనుకోకుండా సెలవు దొరికింది. వెంటనే బయల్దేరి వచ్చేశాను. అయినా నాకు తెలియని ఊరా ఏమిటి. పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ అన్నీ అలానే ఉన్నాయా ఏమైనా మార్పు వచ్చిందా అని చూసుకుంటూ తాపీగా వచ్చేను’
‘సరే స్నానం చేసిరా. భోజనం చేద్దువుగాని. ఏ వేళప్పుడు తిన్నావో ఏమిటో?’ అంది పిన్ని.
స్నానం చేసి, భోజనాలయ్యాక అప్పుడు తాపీగా భోషాణం గురించి అడిగేడు సత్యం. వినసొంపుగా లేని వింత కథ చెప్పాడు చిన్నాన్న.
‘్భషాణంలో పాత్రలు ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నార్రా. అందుకని అవి అలా దాచి ఉంచడం ఎందుకని పెళ్లిళ్లకి, శుభకార్యాలకి వంటలు చేసే లక్ష్మాజీ అడిగితే అమ్మేసేను’ ఇంతలో పిన్ని అందుకుంది.
‘మన దగ్గర పనిచేసేవాడు పాలేరు అప్పిగాడు నీకు తెలుసు కదా! వాడి కూతురికి పెళ్లి సంబంధం కుదిరితే సారెగా ఇవ్వడానికి భోషాణం కావాలని అడిగేడు. మనం ఎలాగూ వాడటం లేదుకదా. పోనీ ఈ విధంగానేనా ఒక ఆడపిల్లకి సారెగా ఇస్తే పుణ్యమొస్తుందని వాడికిచ్చేశాం’
‘వాడికి ఊరికే ఇచ్చుండరు. ఎంతో కొంత వసూలు చేసే ఉంటారు’ అనుకున్నాడు సత్యం.
‘్భషాణం గురించి అడుగుతున్నావు. కొంపతీసి నీగ్గాని కావాలేమిట్రా చెప్పు. ఇక్కడ ఇంకెవరి దగ్గరన్నా ఉంటే తీసుకుంటాను’ అన్నాడు చిన్నాన్న.
‘ఏం లేదు చిన్నాన్నా. దాన్నిచూస్తే బామ్మని చూసినట్టుగా ఉంటుందని అలా అడిగేను. అంతేకానీ అపార్ట్‌మెంట్‌లో చిన్న ఫ్లాట్‌లో ఉంటున్న నేను భోషాణం ఎక్కడ పెట్టుకుంటాను. అది సరే పాలేరు అప్పిగాడు ఊరి చివర ఆ ఇంట్లోనే ఉంటున్నాడా?’
‘ఆ.. అక్కడే ఉంటున్నాడు. కానీ భోషాణం పిల్లకి సారెగా పంపించేసి ఉంటాడు. అది నీకెక్కడ కనిపిస్తుంది’ ప్రయత్నించడం అనవసరం అన్నట్టుగా మాట్లాడేడు చిన్నాన్న.
‘సరే నా ప్రయత్నం నేను చేస్తాను. భోషాణం ఒక్కసారి చూడాలని ఉంది’ అని పాలేరు ఇంటికి బయల్దేరేడు. పాలేరు అప్పిగాడు అది ఎంత కష్టం మీద పిల్లతో పంపించేడో వివరిస్తూ ఆ ఊరు ఎక్కడుందో చెప్పేడు. అది ఈ ఊరికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒక అద్దె సైకిల్ తీసుకుని ఆ ఊరికి బయల్దేరాడు సత్యం. అక్కడ వాకబు చేసుకుంటూ ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ఇంటి లోపలి నుంచి ఒక పెద్ద మనిషి బయటికొచ్చి
‘ఎవరు కావాలి బాబూ?’ అని అడిగేడు. సత్యం పాలేరు పేరు చెప్పి అతను సారెగా ఇచ్చిన భోషాణం ఒక్కసారి చూసి పోదామని వచ్చేనని చెప్పేడు.
‘బోసానం సూడాలని ఉందా? సరే రా’ అని ఇంటి వెనక వైపు తీసికెళ్లాడు.
‘అదిగో అయే బోసానం బల్లలు. కొంపలో దాసుకోడానికి జాగా నేక ఆ పెట్టిని బయట్నే ఉంచీసినాం. ఎండకి ఎండి, ఓనకి తడిసి పాడైపోతూంతే సూడనేక ఇదిగో ఇనాగ కుర్చీలు, బల్లలూ సేస్తున్నాం’ అన్నాడు ఆ పెద్దమనిషి.
నీడనిచ్చి, పర్యావరణాన్ని రక్షించే వందల ఏళ్లనాటి పచ్చని చెట్లని నగరాభివృద్ధి నెపంతో మునిసిపాలిటీ వాళ్లు నిర్దాక్షిణ్యంగా, దుర్మార్గంగా నరికేస్తుంటే ఎంత బాధ పడ్డాడో మళ్లా అలాంటి బాధే ఇవాళ అనుభవించాడు సత్యం. భోషాణం భాగాలని రంపంతో కోస్తుంటే, బామ్మ శరీరాన్ని కోసేస్తున్నట్టుగా అనిపించి ఆ దృశ్యాన్ని చూడలేక, అక్కడ ఉండలేక వచ్చేశాడు సత్యం.
బామ్మని తలచుకుంటూ, భోషాణం విషాద గాథని జీర్ణించుకోలేక చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ ఆ ఊరితో రుణం తీరిపోయిందని నిట్టూరుస్తూ బరువెక్కిన హృదయంతో తిరుగు ప్రయాణం కట్టాడు. *
డా.దేవరకొండ సహదేవరావు
103, కుటీర్ అపార్ట్‌మెంట్స్, 9-29-22/1, బాలాజీనగర్,
సిరిపురం, విశాఖపట్నం - 530 003.
0891-2703129, 9393331562