వాస్తుశాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. చాలామంది మహర్షులు ఈ శాస్త్రాన్ని వారివారి గ్రంథాలయిన సంహితలలో ఉటంకించారు. రామాయణ, భారత, పురాణాలలో కూడా మనకు వాస్తు శాస్త్ర రీత్యా గృహ నిర్మాణాలు జరిపిన అంశాలు ఉటంకింపబడినవి.
దేవశిల్పి విశ్వకర్మ మనకు ఇతిహాస పురాణాలలో దేవతలకు గృహ నిర్మాణములు చేయించి ఇచ్చిన దృష్టాంతాలు ఎక్కువగా కనపడుతుంటాయి. తర్వాత స్థానం మయునిది. అంతటి గొప్ప శాస్త్రం ప్రకారం మనం ఇల్లు నిర్మించుకుంటే మనకు జాతకంలో వున్న చెడు యోగాలు పోవడం, మంచి యోగాలు రావడం జరుగుతాయా? అంటే బ్రహ్మ లిఖితం ప్రకారం వున్న యోగాలు పోవు కానీ చెడు సమయంలో వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది.
ప్రశాంత జీవనం కోసమే మనవారు శాస్త్రాల రూపాలలో వాస్తు శాస్త్రం, రత్నశాస్త్రం, యోగశాస్త్రం, వేదాంత శాస్త్రం, రుద్రాక్ష ధారణ, యంత్రముల గొర్చి ఆగమశాస్త్రం వంటివి యిచ్చారు. ఇవి అన్నీ మనిషికి ప్రశాంతతను అందిస్తాయి. కానీ లలాట లిఖితం మార్చదు. విశ్వకర్మ వాస్తుమయ వాస్తు గ్రంథాలు సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. రాముడు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి జాతక యోగం ప్రకారం 14.10.2015న వివాహం అని ఉన్నది. అతను వాస్తు సరిగా లేని ఇంట ఉన్నాడు. అతనికి 2013 నుండి 2015 వరకు అనేక సంబంధాలు చూసి అవి ఏవీ కుదరక చివరకు వాడికి వివాహం కాదేమో అని భయపడి ఎన్నో పూజలు వ్రతాలు చేసి చాలా ఖర్చు చేసి విసుగు పొంది చివరకు 14.10.2015న వివాహం చేస్తారు. ఒకవేళ రాముడు వాస్తు ప్రకారం వున్న ఇంటిలో వుంటే చాలా సరదాగా సింపుల్‌గా ఒకటి లేదా రెండు సంబంధాలు చూసి 2015 అక్టోబర్ వరకు వివాహం కాలేదు అనే నిరాశ చెందక ఎటువంటి అనవసర ప్రయత్నాలు చేయకుండానే 14.10.2015న వివాహం చేసుకుంటాడు. వాస్తు ప్రకారం దాని ప్రభావం రాముడి మీద చూపించక మానదు. కానీ రాముడి జాతకంలో రాసి వున్న బ్రహ్మ లిఖితం మాత్రం మారదు. గమనించండి.
మరొక ఉదాహరణ. కృష్ణ అనే వ్యక్తికి అప్పులు వున్నాయి అనుకుందాం. అతడు వాస్తు బాగా వున్న ఇంటిలో వున్నాడు. అతడి జాతకరీత్యా 2018 నవంబర్‌కు అప్పులు తీరే అవకాశం లేదు. అలాంటప్పుడు అతడికి వాస్తు బాగా పనిచేసి అప్పులు ఇచ్చిన వారి నుండి ఏ విధమైన ప్రతిబంధకాలు రాకుండా వత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవనం చేసే అవకాశం వాస్తు గృహం కలుగజేస్తుంది. అదే ఒకవేళ వాస్తు బాగాలేని ఇంటిలో కృష్ణ నివసిస్తే అతడికి అప్పులు ఇచ్చినవారు అందరూ అతడి మీద వత్తిడి తీసుకురావడం, అతడికి ప్రశాంతత లేకుండా చేయడం, అంతేకాక చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా అతడి జాతకరీత్యా రాసి వున్న విధంగా 2018 నవంబర్‌కు అప్పులు తీరుస్తాడు. అప్పులు తీర్చే డేట్ మారదు.
వాస్తు ప్రభావంగా అప్పులు తీరేవరకు ప్రశాంతత, అశాంతి అనేవి వత్తిడి అనేది వాస్తు ప్రకారం ఉంటాయి. ప్రతి మానవుడికీ స్థానబలము చాలా అవసరం. రోజువారీ జరిగే ఘటనల ప్రభావంగా మనిషి నడవడి మారుతుంది. దానికి వాస్తు ప్రభావం పని చేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ ఫలసిద్ధయే - శీతవాతాది రక్షార్థం వాస్తుపూర్ణ గృహే భవేత్ - మనిషి ప్రశాంతతకే వాస్తు కానీ మన లలాట లిఖితం కానీ యోగాలు వాస్తు ద్వారా మనకు అందవు. వాస్తు బాగున్న ఇంటిలో అందరూ సంతానవంతులు కానివారు ఉంటారు. అందరూ విద్యావంతులు కాని వారు ఉంటారు. వృత్తిరీత్యా స్థిరపడని వారుంటారు. అలాంటి దృష్టాంతాలలో బ్రహ్మలిఖితం తప్పదు అనే వాదన వస్తుంది.
అయితే ప్రతి మనిషి మీదా ఎంతవరకు వాస్తు ప్రభావం ఉంటుంది అనే విషయమై శాస్త్రాన్ని పూర్తిగా శోధించాలి. వాస్తురీత్యా ఇల్లు కట్టుకుంటే ఆయుర్దాయం పెరగడం, వాస్తురీత్యా కట్టకపోతే ఆయుర్దాయం తగ్గడం వంటివి వుండవు. పుట్టిననాడే ఆయుర్నిర్ణయం జరిగిపోతుంది. అలాగే ఆయుష్కాలం యొక్క ప్రశాంత జీవనానికి వాస్తు శాస్త్రం ఉపయోగపడుతుంది. *
సందేహాలు - సమాధానాలు
సుదర్శన్
ప్రశ్న: నేను ఏ దిశ సింహద్వారం వున్న ఇల్లు తీసుకోవాలి?
జ: పడమర ముఖంగా ఇంటి నుండి బయటకు వచ్చే విధంగా వున్న ఇల్లు మీకు బాగా నప్పుతుంది. అంటే పడమర సింహద్వారం నప్పుతుంది.
రాజేష్ (హైదరాబాద్)
ప్రశ్న: నైరుతిలో బీరువా తప్పక ఉంచాలా?
జ: ధనం నిల్వ వుంచే బీరువా అయితే నైరుతికి ప్రాధాన్యం లేదు. కేవలం బట్టలు, బీరువా, ఎత్తు కోసం, బరువు కోసం నైరుతిలో వుంచడం ప్రాధాన్యం చేశారు.
లక్ష్మి (నెల్లూరు)
ప్రశ్న: బాగా ఎత్తుగా ఉండే గేటు తూర్పు వైపు ఉంచవచ్చా?
జ: ‘అంతర్ద్వారాత్ బహిర్ద్వారం నోచ్ఛం నసంకటం’ అని శాస్త్రం. అనగా సింహద్వారం కంటే ప్రహరీ ద్వారం (గేటు) ఎత్తు ఉండకూడదు. అలాగే వెడల్పు తక్కువ వుండకూడదు. అందువల్ల ఇంటిలో వున్న ద్వారం కంటే ఎత్తు తక్కువగా వుండే ప్రహరీ ద్వారం ఉంచవచ్చు. ప్రహరీ ఎత్తుకంటే ఎక్కువ ఎత్తుగా ఉండే గేటు పెట్టరాదు.