ఎవరి గొప్పవారిదే..! - కథ
-ఎన్నవెళ్లి రాజవౌళి
నా నడకల్లో హొయలుంది. నా పరుగులో సరిగమ ధ్వనులున్నాయ్. నాలో తేనె తీపి ఉందని పశుపక్ష్యాదులు, మానవులు నన్ను తాగకుండా ఉండలేరు. నాకంటె గొప్ప ఈ పృథ్విలోనే ఏదీ లేదని గొప్పలు పోతూ మురిసిపోయింది నది.
వంకలు తిరుగుతూ, పాయలు పాయలు గా నవ్వుతూ వుండే నాకంటె- కొండరాజు ఏమి గొప్పనో చెప్పడానికి నా దగ్గరకు రమ్మనమని ప్రశ్నలు సంధిస్తూ గాలితో కబురంపింది నదీమతల్లి.
ఆ మాటలతో కొండరాజు దగ్గరకు చేరిన వాయువు-
‘కొండరాజా.. కొండరాజా.. మీరున్న దగ్గరనే ఉంటారట. కదలడు మెదలలేడుట. ఒడ్డూ పొడవూ వుండగానే సరిపోదు. ఓ పాట లేదు. మాట లేదు. నాతో ఎందులో సరితూగగలడో వచ్చి నాతో చెప్పమంటుంది నదీమతల్లి’ అంది.
ఆ మాటతో నవ్వి ఊరుకున్నాడు గిరిరాజు.
‘చెప్పరేం రాజా.. నేను మళ్లీ నదీమతల్లి దగ్గరకు వెళ్లక తప్పదు. నదీమతల్లి తన ప్రశ్నలకు జవాబు తేలేదని నా దప్పిక తీర్చదేమో?’
‘ఆవేశమొద్దని చెప్పు మలయమారుతమా! కాలమే నిర్ణయిస్తుందని నా మాటగా చెప్పు’
‘మంచిది ప్రభూ! వెళ్లొస్తా’ అంటూ మలయమారుతం నమస్కరించి నదీమ తల్లి వద్దకు వెళ్లింది.
కొండరాజు తొణకకుండా కూర్చున్న దగ్గర నుండి లేవకుండానే, నిర్ణయాన్ని కాలానికే వదిలేసిన సంగతి చెప్పడంతో-
గాలి చెప్పిన మాటలకు నదీమతల్లి గలగల నవ్వింది.
‘అందుకే నీ కబుర్లను గాలి కబుర్లని మానవులు ఎగతాళి చేస్తారు. కాలమట.. కాలం.. ఏంజేస్తుంది కాలం. చేతకాక, చావలేక, తన బరువు తనకే బరువై కూర్చున్న దగ్గర నుంచీ లేవలేక అన్న మాటలివి.
నీకు అడుగ రాలేదు. గిరి రాజుకు చెప్ప రాలేదు’ అని అంటుండగానే-
మలయమారుతానికి కోపం తీవ్రమైంది. మలయమారుతానికి దుమారం తోడైంది. గాలి దుమారం విసుర్లకు చెట్లు విరిగి పడ్డాయి. సముద్రం తుపానై పొంగింది. కుంభవృష్టి కురిసి నదిలో కలిసింది.
నది ఎముకలు విరిగేటట్లు పరుగును పెట్టించింది. తాళలేక వెళ్లి పర్వతుని పాదాలపై పడింది నది.
అక్కడ కొంత సేదతీరిన తర్వాత-
‘క్షమించు గిరిరాజా. నీ పరాక్రమం తెలియక మలయమారుతంతో ఏవేవో అవాకులు చెవాకులు పేలాను. నీ చేతులే నన్ను ఆపకుంటే నా ఎముకలన్నీ నీళ్లలా మారేవి’
‘ఇందులో క్షమించాల్సింది ఏమీ లేదు నదీమతల్లి. నా అవసరం నీకెంత ఉందో.. నీ అవసరం నాకు అంతగానే ఉంది’
‘నా అవసరమా? అదెటుల’
‘నీ స్పర్శతో నాపైన ఔషధ మొలకలు పులకరిస్తాయి. చెట్లు చిగురిస్తాయి. ఇవి మానవాళి మనుగడకు ఉపకరిస్తాయి.
ఇంతేకాక, పశుపక్ష్యాదులకు, క్రిమి కీటకాదులకు, జంతుజాలానికి ప్రాణం పోస్తాయి. వాతావరణ సమతుల్యానికి ఆయువు పట్టవుతుంది. అందుకే నిన్ను నదీమ ‘తల్లీ’ అని సంబోధిస్తారు.’
‘ప్రకృతితో నా సంబంధం ఇంతగా ముడిపడి ఉందా?’
‘ప్రకృతితో నీ, నా సంబంధాలే కాక, సముద్రుడు, గాలి, సూర్యుడు, నేల, ఆకాశం కూడా ఉంటుంది. కాని నీలా ఏవీ విర్రవీగినా ప్రకృతి నాశనానికేగాని, శుభానికి కాదని గ్రహించాలి’
‘క్షమించు గిరిరాజా! చచ్చిన పామును చంపకు. నీ మాటలు ఈటెల్లా నాకు గుచ్చుకున్నాయి. మళ్లీ ఎప్పుడూ గర్వపడను’ అంటూ నదీమతల్లి వంకలలో, ఒర్రెలలో కలుస్తూ మెల్లగా సాగిపోతుండగా- గిరిరాజు వెళుతున్న నదీమతల్లిని చూస్తూ తనలో తనే ముసిముసిగా నవ్వుకున్నాడు. *
స్ఫూర్తి
పంజరం
ప్రతిజ్ఞ వేసవి సెలవుల్లో ఓ రోజు తన తల్లిదండ్రులతో నెహ్రూ జూపార్క్ చూడడానికి వచ్చింది. తల్లి ఇంటి దగ్గరే వండి, హాట్ బాక్స్‌లో లంచ్ తీసుకువచ్చింది.
అక్వేరియంలోని రంగురంగుల చేపలని, ఎన్‌క్లోజర్స్‌లోని మొసళ్లని, పాములని ఇంకా కుందేళ్లు, తెల్లటి ఎలుకలు, గినియా పిగ్స్‌ని చూశాక ప్రతిజ్ఞ తండ్రి చెప్పాడు.
‘ఇప్పుడు అడవి జంతువులని చూద్దాం పదండి’
వివిధ ఎన్‌క్లోజర్స్‌లోని పులులు, చిరుతలు, జీబ్రాలు, ఏనుగులు, నక్కలు, జింకలు, అడవి పిల్లులు.. ఇంకా అనేక ఇతర వన్య మృగాలని చూశాక వాళ్లు తిరిగి వస్తూ ఓ పంజరంలోని బాల్డ్ ఈగిల్‌ని చూసారు. నార్త్ అమెరికా ఖండానికి చెందిన అది గాయపడిందని, దాని పక్కన గల బోర్డు మీద రాసి ఉంది. అది చదివిన ప్రతిజ్ఞ చెప్పింది.
‘అరె పాపం! ఒంటరిగా ఉంది’
‘దానికి బాగయ్యాక తిరిగి ఇతర బాల్డ్ ఈగిల్స్ ఎన్‌క్లోజర్‌లో దాన్ని ఉంచుతారు’ ప్రతిజ్ఞ తల్లి చెప్పింది.
అంతా ఓ బెంచీ మీద కూర్చున్న ప్రతిజ్ఞ తల్లి డిస్పోజబుల్ ప్లేట్స్‌లో కాటీ రోల్స్ (గుజరాతీ వంటకం) వడ్డిస్తూంటే తండ్రి చెప్పాడు.
‘కొందరు మనుషులు కూడా పంజరాల్లో ఉంటారు’
‘నిజంగా? ఏరీ? లంచ్ అయ్యాక అక్కడికి తీసుకెళ్లి వాళ్లని చూపించు నాన్నా’ ప్రతిజ్ఞ ఆసక్తిగా అడిగింది.
‘జూలో అలాంటి మనుషులు లేరు. నేను పోల్చి చెప్పానంతే’
‘వివరంగా చెప్పు నాన్నా’
‘మనుషులు పాపం అనే పంజరంలో చిక్కుకుని కష్టాలని అనుభవిస్తూంటారు. ఆ పంజరం ఊచలని వంచేది ఒక్కటే. పుణ్యం. చెడ్డ పనులు చేస్తే దాని ఫలితంగా ఏర్పడే పంజరంలో మనిషి చిక్కుకుంటూంటాడు. మంచి పనులు చేస్తే ఫలితంగా లభించే పుణ్యం ఆ పంజరాన్ని ఛిన్నాభిన్నం చేసేస్తుంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి?’
‘పాపపు పనులు చేయకుండా పుణ్యపు పనులు మాత్రమే చెయ్యాలి కదా?’
‘అవును’
‘ఐతే అమ్మకి పుణ్యం రాదు. జూకి వస్తూ ఇక్కడి కోతులకి తినిపించడానికి వేరుశెనగ పప్పు తెద్దామంటే అమ్మ వద్దంది’ ప్రతిజ్ఞ చెప్పింది.
‘తెచ్చి వాటికి తినిపిస్తే మనకి పాపం వచ్చేది. వాటికి అవసరమైన ఆహారాన్ని జూ వాళ్లే పెడతారు. సందర్శకులు తమకు తోచింది తాము తెచ్చి ఇష్టం వచ్చినట్లు పెడుతూంటే, వాటికి అనారోగ్యం చేస్తుంది. అది పాపమే అవుతుంది. అందుకే ‘డోంట్ ఫీడ్ ఏనిమల్స్’ అనే బోర్డుని జూలో ఉంచారు’ తండ్రి చెప్పాడు.
‘దీన్నిబట్టి నువ్వో పాఠం నేర్చుకోవచ్చు. మనం పాపం ఎందుకు చేస్తాం? అది మనకి ఆనందాన్ని ఇస్తుందని చేస్తాం. ఐతే అది ఇతరులకి దుఃఖాన్ని ఇస్తుందన్న సంగతి గ్రహించం. అందువల్లే మనుషులు పాపం అనే పంజరంలో చిక్కుపడుతుంటారు. ఏ పనైనా జాగ్రత్తగా ఆలోచించి, అందువల్ల మనకి ఆనందం కలుగుతుందని గాక, ఇతరులకి దుఃఖం కలుగుతుందా అని ఆలోచించి చేయడం నేర్చుకోవాలి’ ప్రతిజ్ఞ తల్లి వివరించింది.
-మల్లాది వెంకటకృష్ణమూర్తి
చేసి చూద్దాం
మీ కడుపుచేసే శబ్దాలు
మీ కడుపు చేసే శబ్దాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్కప్పుడు కడుపులో శబ్దాలు విన్పిస్తూ ఉంటాయి. కడుపు విడుదల చేసే శబ్దాలు వినడానికి ఇలా చేసి చూడండి.
ఒక మైక్రోఫోన్‌ను టేపు రికార్డర్‌తో కలపండి. టేపురికార్డర్‌లోని రికార్డు బటన్‌ని నొక్కాలి. మైక్రోఫోన్‌పై ఎక్కువగా వత్తిడి కల్గించకుండా దానిని కడుపునకు అదిమి ఉంచాలి.
రికార్డింగ్ జరిగేటప్పుడు మైక్రోఫోన్‌ను కదపకూడదు. రికార్డింగ్ ఒక నిముష కాలం చేయాలి. ఆ తరువాత టేపును రివైండ్ చేసి ఏం రికార్డింగ్ అయినది వినాలి.
మీకు వినిపించే శబ్దాలన్నీ కడుపు చేసే శబ్దాలే! కడుపు ఎందుకు శబ్దాలు చేస్తుంది అనే సందేహం వస్తుంది. మనం భుజించిన ఆహారం కడుపులో జీర్ణం అవుతూ ఉంటుంది. ఇలా జీర్ణం అయ్యే సమయంలో విడుదలయ్యే వాయువులు చేసే శబ్దాలు ఇవన్నీ.
-సి.వి.సర్వేశ్వరశర్మ