ఉపానం నుంచి స్తూపిదాకా- అంటే గోపురం దాకా దేవాలయంలో కొన్ని అంతస్తులు కనిపిస్తాయి. ఒక్కొక్క అంతస్తును ‘విమానం’ అంటారు.’’
ఇదో విశేషమా? అది చూపటానికా నన్ను మభ్యపెట్టి తీసుకువచ్చారు. మీ మగవాళ్లంతా ఇంతే’’.
‘‘మీ ఆడాళ్లేం తక్కువా? ముక్కుకు తాడు వేసి ఆడించటానికి మేమేమైనా డూడూబసవలమా?’’- ‘బోల్ రాధా బోల్’
కిరణ్మయి నవ్వుతూనే వున్నది. ఇప్పుడు ఆ నవ్వుచూచి ఆనందించటానికి వీల్లేదు. ఆ నవ్వు మెల్లగా బుగ్గసొట్టల్లోకి జారే వైనం మనోనేత్రానికి స్పష్టంగానే కనిపిస్తూ వున్నది.
‘‘నువ్వలా కూచుని డాన్స్ చేస్తే ఎలాగమ్మా? బండి బోల్తా కొడుతుంది’’.
‘‘కొడితే కొడుతుంది. అన్నీ చూచుకోటానికి మీరున్నారుగా’’
‘‘ఈసారి నువ్వు కళ్లు మూసుకుని పడితే నేను మాత్రం ఒప్పుకోను’’
‘‘పోనీ కళ్లు తెరుచుకుని పడనా?’’
‘‘నేను పడిపోయాను. విను. ఒకే చోట మూడు విమానాలు ఈ త్రికూటాచలంలో కనిపిస్తుంది. అదే విశేషం’’.
‘‘అయితే పడండి. హేమకూటం చూడాలని వుంది.’’
‘‘అలాగే కానివ్వండి. రాణీవారి ఆజ్ఞ. శిరసావహించక తప్పుతుందా?’’
‘‘హేమకూట సింహాసనం మీద శ్రీకృష్ణదేవరాయల్ని కూచోపెట్టి పురందరదాసు ఓ పాట రాశారు. మాయా మాళవగౌడ రాగం అది.’’
‘‘పాడు మరి. మన సింహాసనం ఇలా ముందుకు సాగుతూనే వుంటుంది.’’
‘‘ఉహు నాకు సిగ్గేస్తున్నది’’- స్కూటర్ పక్కన పడేసి ఇద్దరూ కాలినడకన హేమకూటం చేరుకున్నారు.
‘‘ ‘తాళం’ అంటే ఆ కనిపించే మొదటి అంతస్తు ‘మంటపం’ అంటే ఒక పెద్ద గదిలాంటిది. దేవాలయంలో ఎన్ని మంటపాలైనా వుండొచ్చు. ఆ దేవాలయం అధిష్టాన దేవతకు దగ్గరగా ఓ చిన్న గది వుంటుంది. అలా చూడు. అది అర్థమంటపం. దేవాలయానికి ఎదురుగా ప్రవేశమార్గంలో వున్న మంటపాన్ని ముఖమంటపం అని పిలుస్తారు. గుడిలా పైన కనిపిస్తున్న గూడు వుండే- దాని పేరు ‘పంజరం’.
ఇదుగో! ఇక్కడ రెక్టాంగులర్ షేప్‌లో వుంది చూడు. దీన్ని ‘శాల’ అని పిలుస్తారు.
‘‘తాళం ఏమిటో తెలిసింది. అంతరాళం అంటే?’’
‘‘మంటపాన్ని గర్భగుడిలో కలిపే మార్గం. నీ గుండెలోతులు కాదులే’’
ప్రత్యగాత్మ ఆలయ శిల్పశాస్త్రం గురించి చెబుతూ వుంటే కిరణ్మయిలో అనుమానం మరింత పెరుగుతున్నది. ఇతను మహారాజు. మారువేషంలో ఇలా మాయచేస్తున్నాడు. ద్వారబంధం దగ్గర కిరణ్మయి భుజం పట్టుకుని ఆపి, సీలింగు వైపు చూడమన్నాడు ప్రత్యగాత్మ.
****
నృత్యగణపతి, నాట్యభంగిమలో అమ్మవారు, రెండు ఏనుగులు, వాటి తొండాల మధ్య ఓ కుండ. దానిపైన పువ్వు. పువ్వు అడుగుభాగాన పద్మపీఠం కనువిందు చేశాయి. చుట్టూ బారెడు జడలతో మగరాయుళ్లు శంఖాలు పూరిస్తూ చుట్టూ తిరుగుతున్నారు. గణపతి విగ్రహాలు బోలెడు కనిపించాయి. గణపతి అంటే కిరణ్మయికి చాలా ఇష్టం.
‘‘మగాళ్లకి అంత పెద్ద జడలా?’’ అన్నది ముక్కుమీద వేలు వేసుకుని కిరణ్మయి. అనే్నసి బొజ్జగణపతి బుజ్జి విగ్రహాలు ఎక్కడా చూడలేదు.
‘‘అప్పుడు ఇలాంటి తేడాలుండేవి కాదు. అయినా తమరి జడకన్నా పెద్దది కాదుగా’’ పట్టుకుని లాగాడు.
‘‘అబ్బ.. వదలండి’’ అన్నది చిరుకోపంగా. ‘మగాడికి చనువిస్తే నిలువునా ముంచేస్తాడు’ అంటుంది మలయవాసిని.
‘‘ఇప్పుడు మాత్రం మీ ఆడాళ్లు ఏం తక్కువ తిన్నారని? జీన్స్ ప్యాంట్లు తగిలించుకుని మగరాయుళ్లని మించిపోయారు’’
ఆకస్మికంగా ఒక గబ్బిలపు కుటుంబం అమాంతం లేచి గుళ్లో నుంచి తలమీదుగా ఆకాశంలోకి ఎగిరింది. కిరణ్మయి కెవ్వుమంటూ భయంతో ప్రత్యగాత్మను వాటేసుకున్నది. ఆ చప్పుడు భయంకరంగా వున్నది’’.
‘‘మీసం ఒకటి తక్కువ. మేమూ మగాళ్లమే అంటారు పైగా. గబ్బిలాలు వెళ్లిపోయాయి. కళ్లు తెరవవచ్చు’’.
‘‘చూచింది చాలు. నన్ను రూంకి చేర్చండి. బట్టలు సర్దుకోవాలి’’.
కిరణ్మయి ప్రయాణం ప్రత్యగాత్మకీ బాధాకరంగా వుంది.
‘‘దయచెయ్యండి’’
‘‘నన్ను సాగనంపాలనుకుంటున్నారు కదూ?’’
‘‘అయ్యో! దేవుడా! నేనెప్పుడన్నాను. అయినా నేనూ ఆగమంటే ఆగిపోలేవా?’’
కిరణ్మయి బుంగబూతి చందం అలుకలోనే బాగుందనిపించింది. తనకీ వెళ్లాలని లేదు. కాని, వెళ్లక తప్పదు.
కిరణ్మయి బస్సెక్కించి అటు తిరిగి కిటికీ దగ్గర నుంచున్నాడు ప్రత్యగాత్మ. అది బయలుదేరటానికి సిద్ధంగానే వున్నది. విసిరేసినట్టు ప్యాసింజర్లు ఎక్కడపడితే అక్కడ కూచున్నారు. బస్సు సగం ఖాళీగానే వుంది. డ్రైవరు రెడీగానే వున్నాడు. కండక్టర్ కోసం ఎదురుచూస్తున్నట్లున్నది.
‘‘ఓ మాట అడగనా?’’- కిటికీ ఊచలు పట్టుకుని తల బయటికి పెట్టి అడిగింది కిరణ్మయి.
‘‘ఒకటేం ఖర్మ, అడగాలనుకున్నవన్నీ అడిగేయ్’’
‘‘మీరు నిజంగా టూరిస్టుగైడా? ఒట్టేసి చెప్పండి’’- ఊచలమధ్య కుడి చేయి చాచింది ముందుకు.
- ఇంకాఉంది